ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి

బిజెపికి హటావో దేశ్‌కో బచావో

మేధావులు మౌనం వహించినపుడు మూర్కుల సంఖ్య రెట్టింపు అవుతుందని. ఇది ఎదిగే సమాజ ఉనికికే ప్రమాదం. నెల్సన్‌ మండేలా

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో గత 10 ఏండ్లుగా బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవు తూ వస్తుంది. ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడి, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కొనసాగాల్సిన పాల న ప్రజలను ప్రలోభాల కు గురి చేసి వాస్తవ సమస్యల నుండి పక్కదోవ పట్టించి ఫాసిస్టు పాలన కొనసాగిస్తున్నారు. రెండు సార్లు జరిగిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిపించి మాయజేసి  ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతుకులను జైళ్ళలో బంధించి పాలన కొనసాగిస్తున్న బిజెపిని 18 వ సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిరచి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే వుంది.

స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా దేశంలోని ప్రజలకు ప్రజాస్వామ్య పాలన, చట్టసభలు, ఎన్నికలు, వోట్లు వాటి తాలూకు సరైన అవగాహన లేకపోవడం చాలా బాధాకరం. అవగాహన లేని ప్రజలు ఎక్కువ శాతం ఉండడం వల్లనే పాలకులు తమ ఇష్టానుసారంగా పాలన కొనసాగిస్తూ అత్యంత దోపిడి చేస్తున్నారు. దుర్మార్గ పాలనకు దేశంలోని మెజార్టీ ప్రజలు చైతన్య రాహిత్యంతో ఉండడం ఒక కారణమైతే  చైతన్యంతో ఉన్నవాళ్ళతో కూడా పెద్ద సమస్యనే వుంది. దేశంలో వోటు వేసే వారు ఈ ప్రజాస్వామ్య పాలన పట్ల పూర్తి అవగాహన లేకుండా వోటు వేస్తుంటే అవగాహన కలిగిన వారు వోటుకు దూరముంటున్నారు. ఇలాంటి ధోరణి వల్ల దోపిడీ పార్టీలు, ప్రజలను ఏమార్చే పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. ఈ స్థితిని మార్చాల్సిన బాధ్యత బుద్ధిజీవులు, మేధావులు, సామాజిక ఉద్యమకారులపై వుంది. రాజనీతిజ్ఞులు, నైతిక విలువలు కలిగిన వారు రాజకీయాల గురుంచి ఆలోచన చేయకుండా, ప్రజాస్వామ్య రాజకీయాలలోకి వచ్చి ప్రజలను చైతన్యం చేయనంతవరకు భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడదు.

ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ వల్ల ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన మార్పులు, చదువుకున్న యువతకు సరైన ఉపాధి అవకాశాలు దొరకకపోవడం, దేశీయ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గడం లాంటి చాలా కారణాలతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. అప్పటి వరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను ఆసరాగా తీసుకున్న బిజెపి దేశంలోని ఆర్థిక అసమానతలను రూపుమాపుతానని అధికారం చేపట్టింది. ప్రధానంగా ఓ ఆరు కార్డులను వాడుకొని అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోదీ ని ముందు పెట్టి ఒకటి బి.సి కార్డు, రెండవది అవినీతి రహిత పాలన, మూడవది సుస్థిర పాలన, నాల్గవది నిరుద్యోగ నిర్మూలన లేదా పేదరిక నిర్మూలన, ఐదవది స్వదేశీ పాలన, ఆరవది గుజరాత్‌ తరహా అభివృద్ధి అంటూ విపరీత ప్రచారం చేసి దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టి బిజెపి అధికారంలోకి వచ్చింది. అట్టహాసంగా హామీలను గుప్పించి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన బిజెపి ఆ హామీలను వేటిని కనీసంగా కూడా తాకక పొగా అధికారం చేపట్టిన ప్రారంభం నుండే ఆ పార్టీకి చెందిన అనుబంధ విభాగాలైన సంఫ్‌ు పరివార్‌, ఆర్‌ ఎస్‌ ఎస్‌, భజరంగ్‌ దళ్‌ లాంటి సంస్థలను ప్రజల్లోకి పంపించి ప్రజలను నిత్యం మతం, దేవుడి మత్తులో ఉండే విధంగా, దేశంలోని క్రిస్టియన్‌, ముస్లిం మతాల వల్లనే దేశానికి నష్టం వాటిల్లుతుందని పరమతాలపై ద్వేషం పెంచే కార్యక్రమాలు విపరీతంగా చేసారు.

దేశంలోని సంపన్నుల సొమ్ము విదేశీ బ్యాంకుల్లో, స్విస్‌ బ్యాంకుల్లో ఉందని, ఆ సొమ్మును వెనక్కి తెచ్చి పేదలకు పంచుతానని ప్రగల్పాలు పలికిన మోదీ  ఆ సంగతి మరవడమే కాకుండా దేశంలోని సంపన్నుల వద్ద అక్రమంగా నిలువ ఉన్న సొమ్మును బయటకు తీస్తానని చెప్పి నోట్ల రద్దు చేసి ప్రజలను రోడ్లపై పడేసింది. అప్పటి వరకు సుస్థిరంగా నడిచే వివిధ కంపెనీలు మూతపడి లక్షల మంది ఉద్యోగాలు పోయాయి. అసలు నోట్ల రద్దు చేసింది అవినీతి నిర్మూలన కోసం కాదు ఉత్తరప్రదేశ్‌ తో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు ఈ నోట్ల రద్దు చేసి ప్రతిపక్షాలకు ఎన్నికల ఖర్చుకు కూడా డబ్బు దొరకకుండా చేసి ప్రతిపక్షాలపై రాజకీయ సర్జికల్‌ స్ట్రైక్‌ చేసి ఆ ఐదు రాష్ట్రాల్లో బిజెపి  గెలిచి తద్వారా రాజ్యసభలో తన బలాన్ని పెంచుకుంది. వీటికి తోడు రాజ్యసభలో బిల్లులు పాస్‌ కావడం కోసం తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపిలో చేర్చుకోవడంతో పాటు సమాజ్‌ వాది పార్టీ రాజ్యసభ సభ్యుడితో రాజీనామా చేపించి కుటిల రాజకీయాలకు తెరలేపింది. పార్లమెంటుతో పాటు రాజ్యసభలో మెజార్టీ సాధించిన బిజెపి తన పార్టీ ప్రతిష్ఠ పెంచుకునే బిల్లులైన త్రిపుల్‌ తలాక్‌, 370 రద్దు లాంటి బిల్లులను, ప్రజలను అణచివేసే రైతు వ్యతిరేక చట్టాల బిల్లులను పాస్‌ చేసి బిజెపి మార్కు పాలనను కొనసాగించింది.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలతో రెండవసారి కెసిఆర్‌ అధికారంలోకి వచ్చినట్లు నోట్ల రద్దు, టెర్రరిస్టులపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ లాంటి అభూత కల్పనలతో రెండవసారి అధికారం చేపట్టిన బిజెపి మొదటి సారి ఇచ్చిన ఎన్నికల హామీలను పక్కకు నెట్టి ఎన్‌ఆర్సి, సిఎఎ చట్టాలను రూపొందించి దేశంలోని మైనార్టీలను దేశం నుండి బహిష్కరించే లాంటి కుట్రలెన్నో చేసింది. దేశంలోని ముస్లింలు విదేశీయులని బిజెపి చేస్తున్న ప్రచారంలో నిజమెంతో ప్రజలు తెలుసుకోవాల్సిన అవరసరముంది? అసలు భారతదేశంలో దేశీయులు ఎవరు? విదేశీయులు ఎవరు? అనే విషయంపై మెజార్టీ దేశ ప్రజలకు అవగాహన లేక బిజెపి మాటలు నమ్ముతూ మత ఘర్షణనల్లో భాగమై కలిసి ఉండాల్సిన వారు విద్వేషాలతో రగిలిపోతున్నారు. మైనార్టీలను విదేశీయులనే బిజెపి ఆర్య, బ్రాహ్మణులు అసలు ఈ దేశస్తులే కారు. మూడు వేల ఏండ్ల క్రితం పశ్చిమ ఆసియా దేశాల నుండి ఇండియాకు బ్రతకొచ్చిన వారనే వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఈ ఆర్య బాపండ్లు చేసిన అణచివేత, అంటరానితనం తట్టుకోలేకనే చాలా మంది శూద్రులు ఆయా కాలాల్లో ఇస్లాం, క్రిస్టియన్‌ మతంలోకి మారారనే చరిత్రను తెలుసుకుంటే శత్రువు ఎవరో? మిత్రువు ఎవరో తెలుస్తుంది. దేశంలో హిందువులు అనబడే దళిత, బి.సి లకు వారి రక్త సంబంధీకులైన ముస్లిం, కృష్టియన్లు మిత్రులు అనే విషయాన్ని దేశ ప్రజలు తెలుసుకొని బిజెపి చేస్తున్న విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలల్సిన అవసరముంది.
-సాయిని నరేందర్‌
సామాజిక,
రాజకీయ విశ్లేషకులు
9701916091
(మిగతా రేపటి సంచికలో..)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *