‘‘సమైక్య పాలన విధానంలో ఏ విధంగానైతే వ్యవసాయ రంగం ఉన్నదో అదేవిధంగా ఉంది తప్ప కొత్త పుంతలు తొక్కిన దాఖలాలు లేవు.కొత్త వంగడాలు సృష్టించింది లేదు, రైతు ఆదాయంలో మార్పు వచ్చింది లేదు, జీవన ప్రమాణ స్థాయి పెరిగింది లేదు, పైగా బాధ్యులు ఎవరైనా రసాయనిక ఎరువులు పురుగుమందులు పెట్టుబడి అన్నింటిలో కూడా రేట్లు నాలుగింతలు అయినాయి. ప్రతి రైతు ప్రైవేటు వ్యాపారస్తుల కాడ అప్పుల ఊబీలోనే ఉన్నారు. అంతిమంగా వ్యవసాయంలో ఏలాంటి మార్పు వచ్చింది లేదు.’’
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పాలనాకాలం దశాబ్దం పూర్తి కాకుండానే,ఇచ్చిన హమీలు అమలు చేయకుండానే దశాబ్ది ఉత్సవాలకు తెరలేపింది. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఇరవై ఒక్క రోజుల ఉత్సవాలు ఏనాడు చేయలేదు.ఎన్నికలు సమీపిస్తున్న ఈ వేళ ఇలాంటి సంబరాలకు తెరలేపడాన్ని చూస్తుంటే అనధికారికంగా కోట్ల రూపాయలతో మొదటి దశ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించినట్లు తేటతెల్లమవుతుంది. జూన్ 2వ తేదీన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి స్థాయి నుండి గ్రామస్థాయి ప్రజా ప్రతినిధి వరకు జాతీయ జెండాలు ఎగురవేసి సంబరాలు ప్రారంభించుకున్నారు. జూన్ 3 న తెలంగాణ రైతు దినోత్సవంగా రైతు వేదికల వద్ద జరపాలని ప్రభుత్వం పేరుతో నిర్ణయించారు.మరో అడుగు ముందుకేసి ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.ఇందులో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను, ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేసే విన్యాస కార్యక్రమాలు నిర్వహించి ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులందరితో కలిసి సామూహికంగా భోజనాలు చేయాలని ఆదేశాలు జారీ చేసారు. పైవాటితోపాటు ఈ సందర్భంగా వ్యవసాయ రంగాన్ని కి,రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హమీలను,రైతు సాధక బాధకాలను కూడా చర్చించాల్సిన అవసరం ఉంది.
రైతు బంధు మేజార్టి గా రాబందులకే…!
రైతు బంధు పెట్టుబడి పథకం మంచిదే అభినందిద్దాం.మరి ప్రభుత్వం సంక్షేమ పథకాల కు ప్రాతిపదిక పేదరికం/ఆర్థిక ప్రమాణాలే కదా .!వ్యవసాయ రంగంలో రైతులకు ఇస్తున్న రైతుబంధు పెట్టుబడి కోసమే కదా .! దీనికి క్రైటీరియా ఉండదా.! సేద్యానికి పనికిరాని గుట్టలకు,కరోడపతులకు,పెట్టుబడి
ఉచిత కరెంట్ పేరుతో చేసిన అప్పులను కూడా రైతులకు చెప్పాలి.
గత పాలకుల కాలంలో కరెంటు కష్టాలు పడ్డది నిజమే మీరు ఉచిత విద్యుత్ ఇస్తున్నది కూడా నిజమే. కానీ గత పాలకుల కంటే విద్యుత్ రంగంలో వేయిలకోట్లలో అప్పులు చేసిన విషయాన్ని కూడా మీరు చేస్తున్న రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు చెప్పాలి కదా.! గృహ అవసరాలకు యూనిట్ కు ఎంత పెంచినరో కూడా ప్రజల ముంధు పెట్టాలి కదా.! ఎన్ని డీడీలు కడితే ఎంత హార్స్ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఇస్తున్నరో,ఎన్ని కరెంటు పోల్స్ మీరు ఇస్తున్నారో,గత పాలకులు ఎట్లా ఇచ్చినారో కూడా చెప్పాలి కదా.! తెలంగాణ లో ఒక్క కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టి దాని కింద ఉన్న 20 లిప్టులలో వాడుతున్నది 8 లిప్టులు మాత్రమే. వీటి ద్వారా ఎత్తిపోసింది 154 టి.ఎంసిలు. ఈ నాలుగేళ్ల లో కరెంట్ కైన ఖర్చు సుమారు 4000 కోట్లు.విద్యుత్ రంగ నిపుణులు చెపుతున్న ప్రకారం ఒక ఎకరం పండించడానికి ఐన విద్యుత్ ఖర్చు 50,000 రూపాయలు.ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే గిన్ని వేయిల కోట్లు ఖర్చు అయితే తెలంగాణ మొత్తం ఉచిత కరెంటు పేరుతో ఇప్పటివరకు చేసిన అప్పు సుమారు 50 వేయిల కోట్ల రూపాయలు.ఇది కూడా ప్రజలకు వివరించాలి కదా.! దీనిని కూడా సంబరాలలో భాగం చేయాలి కదా.!
భూమి ఉన్న రైతుకు బీమా సరే మరి కౌలు రైతుల పరిస్థితి
గుంటెడు జాగా ఉన్న నిర్ణీత వయసుకు లోబడి అకాల మరణం చెందిన ప్రతి రైతుకు రైతు బీమా ను అమలు చేస్తున్నారు. రైతు సమస్యలపై పనిచేస్తున్న రైతాంగ నిపుణులు చెబుతున్న ప్రకారం ఈ రాష్ట్రంలో 61 లక్ష మంది భూ యజమానులు ఉంటే సుమారు 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు నివేదికల రూపంలో చెబుతున్నారు. వారికి రైతుబంధు ఇచ్చింది లేదు, రైతు భీమా అమలు చేసింది లేదు. కనీసం ప్రభుత్వం వాళ్లను రైతులుగా కూడా గుర్తించడం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఏ రూపంలో కూడా వారికి అందడం లేదు ఆ కౌలు రైతుల గురించి కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతాంగ దినోత్సవం లో మాట్లాడాలి. వారి బాధలను కూడా వినాలి.
మీరు సృష్టించిన భూ(ధరణి) సమస్యలను కూడా చర్చించాలి.
ధరణి పేరుతో మూడేళ్ల కాలంగా గ్రామాలన్నీ అశాంతి అలజడ్లకు కేంద్రంగా మారినాయి. ఈ ధరణి తీసుకొచ్చినప్పుడు భూములు సర్వే చేసి నూతన డిజిటల్ పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పారు కానీ పాత రికార్డులను చూసి కంప్యూటర్లో ఎక్కించే క్రమంలో అనేక తప్పులు దొర్లినాయి. ఫైనల్ చేయడానికి ముందు ఏమైనా తప్పులు ఉన్నాయో కనీసం సవరించుకోమని గ్రామపంచాయితీలలో కూడా ఎలాంటి నోటీసులు అంటించలేదు.ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన డిజిటల్ పాస్ పుస్తకాల ముద్రణ అనేక సమస్యలను సృష్టించిపెట్టింది. ప్రతి గ్రామంలో ఈ ధరణితో బాధపడుతున్న వారి సంఖ్య కనీసం తక్కువ అంటే తక్కువలో 25% ఉంటుంది.రైతులు తమ పనులను వదిలిపెట్టి తమ భూముల సమస్యలు పరిష్కరించుకోవడానికి నిరంతరం రెవిన్యూ కార్యాలల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ, ప్రదక్షిణలు చేస్తున్నారు ..ఇది కేసీఆర్ గారి గొప్పతనం అనడంలో ఏలాంటి సందేహం లేదు.ధరణి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఆ పోర్టల్ ద్వారా సృష్టించబడిన సమస్యలకు ఇంతవరకు పరిష్కారం చూపడం లేదు. భూములకు సంబంధించిన పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలను గురించి కూడా ప్రజల ముందు పెట్టాలి.
ఈ రైతు దినోత్సవ వేడుకలలో ధరణితో బాధపడుతున్న రైతుల బాధలను కూడా వినాలి.
ధాన్యం కొనుగోలులో రైతుల గోడును వినాలి.
తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున వరి ధాన్యం పండినట్లు అదేదో ప్రభుత్వమే 50 శాతం సబ్సిడీ ఇచ్చి పంట పండించినట్లు మంత్రులు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి అవధులు లేని ప్రకటనలు చేస్తున్నారు. మీడియా ముందు మాట్లాడుతున్న వారు కానీ ప్రభుత్వ అధికారులు గానీ ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఏనాడైనా రైతు సమస్యలలో భాగమైనారా.! పంట పండించిన ప్రతిసారి రైతుకు అరిగోసే. పండించడం ఒక ఎత్తైతే, దిగుబడి వచ్చిన దాన్యాన్ని అమ్ముకోవడం మరొక ఎత్తు. ఒక్కొక్క రైతు కుటుంబాన్ని వదిలిపెట్టి వ్యవసాయాన్ని వదిలిపెట్టి 30 రోజులు 60 రోజులు 70 రోజులు ఇలా ఐకెపి కేంద్రాలలో పడిగాపులు కాస్తున్నారు.ఈ బాధలు ప్రభుత్వానికి పట్టవు,అధికారులకు పట్టవు,స్థానిక ప్రజాప్రతినిధులకు పట్టవు. ప్రకృతి వైపరీత్యాలతో ఆగమైన వరి ధాన్యాన్ని పరిశీలించడానికి మేము వెళ్ళినప్పుడు దానిలో కొన్నిచోట్ల అధికార పార్టీ సర్పంచులే ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసినారు. ఇప్పుడు మీరు చేస్తున్న రైతు వేడుకలు రైతు వేదికల వద్దే కదా అక్కడ ఇంకా ఎన్ని వడ్ల కుప్పలు ఉన్నాయో ఆ రైతులను కూడా కలవాలి వారి బాధలు కూడా వినాలి. పరిగణలోకి తీసుకోవాలి పరిష్కారం చూపాలి.
రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడాలి
మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వారు 2014 జూన్ 2 నుండి నేటి వరకు 7007 రైతు ఆత్మహత్యలు ఎందుకు జరిగినట్లు.? అందులో 1600 రైతు ఆత్మహత్యలు మాత్రమే జరిగినట్లుగా ఎందుకు ఒప్పుకున్నట్లు.? ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ ఇందుకోసమేనా.! పైగా రైతు సమస్యలపై ఉద్యమిస్తున్న వారి పై ఒంటి కాలుపై లేస్తున్నారు.చిత్తశుద్ధి ఉంటే రైతు ఆత్మహత్యలకు గల కారణాలు ఏమిటో విశ్లేషించాలి కదా.! మీరు చేస్తున్న రైతు వేడుకలలో ఇంటి పెద్దని కోల్పోయి ఒంటరైన రైతు కుటుంబాలను పిలిచి ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటో కూడా విశ్లేషించాలి.!
వ్యవసాయానికి/రైతుకి ఇచ్చిన హమీల సంగతి ఏమిటి..?
తెలంగాణ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నట్లుగా వ్యవసాయం సమగ్రంగా ఎక్కడ అభివృద్ధి చెందింది లేదు. రైతుల కోసం ఇచ్చిన హామీలన్నీ కాగితాలకే పరిమితమైనాయి.పండించిన పంటలకు లాభసాటి ధర కల్పిస్తామన్నారు అది ఇవ్వలేదు.? ఐకేపీ లలో ఆకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దైతే ప్రజాప్రతినిధులు కనీసం అటువైపు వెళ్లి రైతులకు భరోసా ఇచ్చిన దాఖలాలు లేవు.?
రైతులందరికీ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని డొల్ల మాటలతో డొలుపుకొస్తున్నారు.ఇది జరుగకపోగా తెలంగాణ ప్రతి రైతు పై ఉన్న తలసరి 1,54000/ ఇది వాస్తవమే కదా.! విత్తనోత్పత్తి కేంద్రంగా తయారు చేస్తామన్నారు,తెలంగాణ లో నఖిలి విత్తనాల దంధా ఎంధుకు కొనసాగుతుంది.? ప్రభుత్వం భూసార పరీక్షలు చేస్తాస్తామని హమీ ఇచ్చారు ఎక్కడ చేశారో నిరూపించగలరా.! తప్పుకున్నది నిజమే కదా .! ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన రైతులకు యుద్ధ ప్రాతిపదికన సహయం అందిస్తామని చెప్పారు,ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఎంతమందికి ఇచ్చారో గ్రామాల వారీగా మీరు చేసే రైతు వేడుకలలో నిరూపించండి.తెలంగాణ ను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా గా మారుస్తామన్నారు..! తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విత్తనాలను యావత్ భారతదేశం లో మార్కెటింగ్ చేసే బాధ్యత ను ప్రభుత్వం స్వీకరిస్తుంది అన్నారు.
ఎన్ని విత్తనాలు ఉత్పత్తి అయ్యాయి.? ఎన్ని రాష్ట్రాలకు ఎగుమతి చేశారు..? ఇంతవరకు అతిగతి లేదు.రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు ఇస్తామన్నారు అవి ఎటు పోయినవి..? పంటల బీమా పథకం ఏమైంది.? వ్యవసాయ పనిముట్లు కొనుగోలుకు ఇస్తానన్న సబ్సిడీలు ఎక్కడ ఇస్తున్నారు.? గ్రీన్ హౌస్ కల్టివేషన్ ప్రారంభించి.! ఇస్తానన్న 75% సబ్సిడి ఏమైంది.? పండ్ల తోటలకు ఇస్తానన్న డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎటు పోయింది.? భూముల సర్వే ఒక బూటకం కాదా.! ధరణితో లాభ పడ్డది పల్లెను వదిలి పట్టణాలకు పోయిన దొరలు కాదా.! అమ్మిన భూములకు డిజిటల్ పాస్ పుస్తకాలు ఇచ్చింది మీరు కాదా.! చెరుకు పరిశోధన కేంద్రం పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటుకు మీ చొరవ ఏమైంది.! వ్యవసాయ రంగంలో రైతు సంఘాల సహకారం ఎక్కడ తీసుకుంటున్నారు.?
ఒక్క రైతుబంధు ఇస్తూ మరోవైపు భూ రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి మొత్తం ఇదే రైతు సంక్షేమం అని చెప్పడం సమంజసమా.! గతానికి ఇప్పటికీ రైతు ఆదాయం ఎంత రెట్టింపు ఐనదో చెప్పగలరా.! సమైక్య పాలన విధానంలో ఏ విధంగానైతే వ్యవసాయ రంగం ఉన్నదో అదేవిధంగా ఉంది తప్ప కొత్త పుంతలు తొక్కిన దాఖలాలు లేవు.కొత్త వంగడాలు సృష్టించింది లేదు, రైతు ఆదాయంలో మార్పు వచ్చింది లేదు, జీవన ప్రమాణ స్థాయి పెరిగింది లేదు, పైగా బాధ్యులు ఎవరైనా రసాయనిక ఎరువులు పురుగుమందులు పెట్టుబడి అన్నింటిలో కూడా రేట్లు నాలుగింతలు అయినాయి. ప్రతి రైతు ప్రైవేటు వ్యాపారస్తుల కాడ అప్పుల ఊబీలోనే ఉన్నారు. అంతిమంగా వ్యవసాయంలో ఏలాంటి మార్పు వచ్చింది లేదు. రైతు దినోత్సవం పేరిట సంబరాలు చేసుకోవడం అంటే రైతు జీవితాలలో గతానికంటే భిన్నంగా మార్పులు రావాలి. అందుకై ప్రభుత్వం రైతు ఆదాయం పెరగడానికి నూతన మార్గాలను అన్వేషించాలి ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వమే పూర్తిగా పెట్టుబడి అందజేయాలి. రైతు ఆదాయాన్ని ప్రతి సంవత్సరం గత సంవత్సరంతో విశ్లేషణ చేయాలి.దేశానికి వెన్నెముకగా రైతులను తయారు చేయాలి.
– పందుల సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192




