కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 11: మండల పరిధిలో ఉన్న కొత్తగూడ గ్రామపంచాయతీకి కూతవేటు దూరంలో గత 20 సంవత్సరాల క్రితం మద్ది లక్ష్మారెడ్డి పౌల్ట్రీ ఫారాలను నిర్మించారు.పౌల్ట్రీ ఫారాలను నిర్మించినప్పటి నుండి కొత్తగూడ గ్రామ ప్రజలకు శాపంగా మారింది.కోళ్ల పేడతో వచ్చే దుర్వాసన అంతఇంత కాదని, వాసన భరించలేకపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు పౌల్ట్రీ యాజమానికి విన్నవించిన స్పందించడం లేదని గ్రామస్తులు వాపోయారు.ఎన్నో దఫాలుగా గ్రామ పాలకులకు,అధికారులకు సమస్యపై వివరించడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు.కోళ్ల ఫారాలలో రోజురోజుకు గుట్టల్లాగా కోళ్ల పేడ పేరుకుపోయి భరించలేని వాసన వెదజల్లుతుందని,ఈగలు,దోమలు అధికంగా తయారై రోగాల బారిన పడుతున్న పట్టించుకునే నానుడు లేడని ప్రజలు ఆందోళన వ్యక్తపరిచారు.చనిపోయిన కోళ్లను పౌల్ట్రీ ఆరుబయట కాల్చకుండా పడి వేయడంతో గ్రామ సింహాలు స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని భయాందోళనలు చెందుతున్నారు.గ్రామ పంచాయతీ తరపున పౌల్ట్రీ యాజమానిని పిలిచి పలు పర్యాయాలు పౌల్ట్రీ ఫారాలను మూసుకోవాలని సూచించిన యాజమాని పట్టించుకున్న పాపాన పోలేదని పాలకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.పౌల్ట్రీ ఫారాలు వద్దకు కొత్తగూడ సర్పంచ్ సాధ మల్లారెడ్డి,పంచాయతీ కార్యదర్శి శివశంకర్, గ్రామస్తులు కలిసి అక్కడి పరిసర ప్రాంతాలను పరిశీలించగా కోళ్ల పేడ కుప్పలు తిప్పలుగా పడి ఉన్నాయని ఇలా ఉంటే గ్రామానికి ప్రమాదం ఎప్పటికైనా జరుగుతుందనే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్, కార్యదర్శి నేరుగా యాజమానికి గత నెలలో నోటీసులు ఇచ్చిన నేటికి స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.పౌల్ట్రీ ఫారాల నుండి వచ్చే దుర్వాసనపై కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు గ్రామపంచాయతీ పాలకులు,గ్రామస్తులు సిద్ధమయ్యారు.కాలుష్య నియంత్రణ మండలి బోర్డు అధికారులు కొత్తగూడ గ్రామంలో ఉన్న పౌల్ట్రీ ఫారాలను పరిశీలించి తగు చర్యలు తీసుకొని పౌల్ట్రీ ఫారాలను మూసివేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పౌల్ట్రీ ఫారాల నుండి వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నాం



