మేడిపల్లి,ప్రజాతంత్ర, అక్టోబర్ 05 : దాదారిరీలు, దౌర్జన్యాలు, నక్సలిజం, రౌడీయిజం గతం.. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన అనంతరం అంతా ప్రశాంతం.. సీఎం కేసీఆర్ దార్శనికత, ముందు చూపుతో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడంతో దేశంలోనే సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ, అన్ని వర్గాలకు నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ప్రాచుర్యం పొందుతున్నాయని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో పటిష్టమైన పోలీస్ వ్యవస్థతో పౌరులు ప్రశాంతంగా కంటి నిద్ర పోతున్నారని పేర్కొన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లిలో రూ. 78 కోట్ల వ్యయంతో 56 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఏర్పాటు చేస్తున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ నిర్మాణానికి గురువారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వస్తే నక్సలిజం, గూండాయిజం, అరాచకాలు పెరిగిపోతాయని అప్పటి సమైఖాంధ్ర పాలకులు దుష్ప్రచారం చేసి భయబ్రాంతులకు గురి చేసి అభూతకల్పనలు సృష్టించారని గుర్తు చేశారు. అయినా దృఢదీక్షాపరుడైన కేసీఆర్ సారధ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్దించాక సీఎంగా ఆయనే పాలనాపగ్గాలు చేపట్టి శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యతనివ్వడంతో నేడు రాష్ట్రం సుసంపన్నమవడంతో పాటు శాంతిభధ్రతల పరిరక్షణలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ విస్తీర్ణపరంగా దేశంలోనే అతి పెద్ద కమిషరేట్ అని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కొంత భాగంతో పాటు సమీప ఇతర జిల్లాలను కలుపుకుని శాంతి భధ్రతల పరిరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. నేర శోధనలో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న సీసీ కెమెరాల ఏర్పాటులో దేశంలోనే ప్రథమ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందని ఆయన వివరించారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాచకొండ పోలీసుల సమర్ధవంతమైన పనితీరుతో శాంతిభద్రతల పదిలంగా ఉన్నాయనాయని కితాబునిచ్చారు. పోలీస్ కమిషనరేట్ తన పరిధిలో ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ ధృడ సంకల్పం, కార్యదక్షతతో తెలంగాణలో పోలీస్ వ్యవస్థ పటిష్టవంతంగా రూపొందించారన్నారు. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పోలీస్ వ్యవస్థను ఆధునీకరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ అలికిడి జరిగినా క్షణాల్లో తెలిసిపోతోందని, నగరంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే ఆదర్శమన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైతే శాంతిభధ్రతలు చిన్నాభిన్నమవుతుయని ఆనాడు హేళన చేసిన వారే నేడు సీఎం కేసీఆర్ పాలన చూసి నోటి నుంచి మాటలు రాక విస్తుబోతున్నారని చురకలంటించారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ నేరాల నియంత్రణతో పాటు, మాదకద్రవ్యాలు, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు.
కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, బోడుప్పల్, జవహర్నగర్ మేయర్లు సామల బుచ్చిరెడ్డి, కావ్య, పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి, ఘట్కేసర్ చైర్పర్సన్ పావని, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గ దయాకర్ రెడ్డి, పీర్జాదిగూడ, బోడుప్పల్ జంట నగరాలకు కార్పొరేటర్లు, రాచకొండ పోలీస్ అధికారులు, మేడిపల్లి మండల తహసీల్ధార్ హసీన, మేడిపల్లి పోలీస్ ఇన్పెక్టర్ సైదులు, పలువురు బీఆర్ఎస్ నాయకులు, పరిసర ప్రాంతాల ప్రజాప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.





