ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే చాలు మొదట అమరావతి, రెండు పోలవరం ప్రాజెక్టు గురించి తరచుగా వింటాం. డ్యామ్ ల నిర్మాణం వల్ల సముద్రంలో జలాలు వృథాగా పోకుండా, కాల్వలు కట్టి పొలాలకు నీళ్లు వదులుతారు. దీని వల్ల ఆర్ధిక సంపద పెరుగుతుంది. వ్యవసాయం పండుగవుతుంది. అంతేకాని ఈ అంశంపై రాజకీయాలు చేయడం ఏ పార్టీకి కూడా తగదు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొట్టమొదట పోలవరం ప్రాజెక్టు సందర్శించారు. ఆ తర్వాత మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు విషాదానికి జగన్ సర్కార్ కారణమని నిందించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని జటిలం చేశారన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు నిలిచిపోయాయి. గందరగోళంగా తయారైంది.
నేను అధ్యయనం
చేసిన తర్వాత కాని మాట్లాడలేను. ఆ తర్వాత భవిష్యత్తు గురించి చర్చిస్తానని చంద్రబాబు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు మళ్లీ వివాదాలకుకేంద్రమైంది. ఈ ప్రాజెక్టుపై అనిశ్చిత స్థితి నెలకొనడానికి కారణమేంటి..? కేంద్రమా, టీడీపీనా, వైకాపానా ఎవరు… ఇక్కడ ఎవరిని నిందించాలి? పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఆంధ్రులకు వర ప్రదాయిని. 2014 నుంచి అధికారంలోకి వొచ్చే ప్రతిపార్టీ కేంద్ర, రాష్ట్రాల్లో పోలవరం పేరు చెప్పి వోట్లు దండుకోవడం, నిధులు ఇవ్వకపోవడం, పునరావాస చర్యలు తీసుకోకపోవడం, నిర్వాసితుల గోడును పట్టించుకోక పోవడం ఆనవాయితీగా మారింది. మళ్లీ ఏమి తెలియనట్లు జగన్, చంద్రబాబు ఒకరినొకరు నిందించుకోవడం తమాషాగా మారింది.
2014లో జాతీయ ప్రాజెక్టుగా పోలవరంను విభజన చట్టంలో ప్రకటించారు. అటువంటప్పుడు ఈ ప్రాజెక్టును కట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ నాటి సీఎం చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నట్లు… ఆ తర్వాత జగన్ అధికారంలోకి వొచ్చిన తర్వాత ఇదే విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కంటే సీఈవోగా పిలుచుకునేందుకు ఇష్టపడతారు. సింగపూర్ తరహా పరిపాలన చేయాలని అభివృద్దికి ప్రణాళికలు 2020 మరియు 2050 అంటూ డాక్యుమెంట్లను రూపొందించడంలో దిట్ట. ఎన్ని డాక్యుమెంట్లు తయారు చేసినా పోలవరం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. జాతీయ ప్రాజెక్టునిర్మాణాన్ని కేంద్రానికి ఇవ్వకుండా, రా
zష్ట్రం నెత్తిన వేసుకుని ఈ రోజు పడరాని పాట్లు పడుతున్నారు. ఆలస్యం వల్ల ఆర్థిక భారం పెరిగింది. ఈ రోజు ప్రాజెక్టు పనులు నిలిచాయి. వ్యయం తడిసిమోపెడవుతోంది. చంద్రబాబు తనను తాను అభినవ భగీరథ అని కూడా పిలిపిం చుకున్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగించకుండా చంద్రబాబు పెద్ద తప్పు చేశారు. పట్టీసీమ పథకాన్ని నిర్మిం చారు. ప్రాజెక్టు నిధులను దీనికి మళ్లించారు. ఇప్పటికే జరగాల్సిన నష్టం భారీ ఎత్తున పోలవరంకు, ఆంధ్ర రాష్ట్రానికిసంభవించింది. పురాణాల్లో భగీరథుడు గురించి కథ ప్రచారంలో ఉంది. తన పూర్వీకులైన 60 వేల మందికి విముక్తి కలిగించేందుకు దివి నుంచి భువికి గంగానదిని తీసుకువచ్చారని ప్రతీతి. ఆ తర్వాత గంగానది హిమాలయాల నుంచి మైదానాల ద్వారా సముద్రంలో కలుస్తుంది. మన అభినవ భగీరథుడు చంద్రబాబు కూడా దురుద్దేశంతోనే పోలవరం జాతీయ ప్రాజెక్టు అనే సంగతి మర్చిపోయి. మేమే నిర్మిస్తాం అంటూ ముందుకు వొచ్చారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కింద ఈ ప్రాజెక్టును నిర్మిస్తాం అంటూ చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించి బాధ్యత తీసుకున్నారు.
ఈ రోజు ఈ ప్రాజెక్ట వ్యయం 55వేల కోట్లకు పెరిగింది. అనంతరం టీడీపీ-బీజేపీ మధ్య సంబంధాలు చెడాయి. అవినీతి పెద్ద ఎత్తున చోటు చేసుకున్నట్లు బీజేపీ, వైకాపా పార్టీలు ఆరోపణలు కూడా చేశాయి. . వట్టిసీమ ప్రాజెక్టు కట్టడమే ఇందులో పెద్ద తప్పిదంగా చెప్పవొచ్చును. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1400 కోట్లు ఖర్చయింది. పోలవరం పూర్తయితే గ్రావిటీ ద్వారా కాల్వలోకి నీళ్లు వదులుతారు. అదే వట్టిసీమ అయితే నీటిని తోడాలి. పోలవరం పూర్తయితే వట్టిసీమ అవనరం ఉండదు.
పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విధులు, అధికారాలపై చంద్రబాబునాయుడు ఎప్పుడూ నోరు
మెదపలేదు. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కువ పాత్ర ఉంది. ఆ పాత్రకు ప్రాధాన్యత
లేకుండా చేశారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ వద్ద కూడా ఈ ప్రాజెక్టు గురించి ఎటువంటి ప్రణాళిక లేదు.
ఈ ప్రాజెక్టుపై ఎటువంటి రోడ్ మ్యాప్ కూడా లేదు. ఈ ప్రాజెక్ట్ పై ఎటువంటి తాత్కాలిక, దీర్గ కాలిక ప్రణాళికలు,
కనీస అవగాహన కూడా కేంద్రానికి లేదు. ఈ ప్రాజెక్టు ఎంత వరకు సురక్షితమనే అంశంపైన నిపుణులు ఇచ్చిన దానిని పరిశీలన కూడా జరగలేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలపై ప్రధాని మోదీ ఐదేళ్ల క్రిందట సమీక్షించి అప్పటి ఏజన్సీపై కన్నెర్ర చేశారు. ఆ ఏజన్సీ ఒక టీడీపీ ఎంపీది కావడం గమనార్హం. ఈ ఏజన్సీ పేరు ట్రాన్సటరీ ఇండియా. 2013లోనే హెడ్ వర్క్ కు 52% సంబంధించి ఈ సంస్థకు కాంట్రాక్టు దక్కింది. దాదాపు రూ.16వేల కోట్ల
వుతుందని అంచనా. తొలి దశలో నిర్మాణానికి ఈ ఏజన్సీకి రూ.4054 కోట్లకు కాంట్రాక్టు దక్కింది. ఈ ఏజన్సీ ఎం.డి
చెరుకూరి శ్రీధర్ అప్పటి ఎంపీ రాయపాటి బంధువు. శ్రీధర్ ఐఐఎం బెంగళూరు గ్రాడ్యూయేట్. ట్రాన్సటరీ సంస్థ
దివాలా కోరు సంస్థగా రష్యాలో పేరు తెచ్చుకుంది. అనేక అవినీతి ఆరోపణలను ఈ సంస్థ ఎదుర్కొంది. ఈ సంస్థతో
సంబంధాలున్న టీడీపీ ఎంపీ బ్యాంకులకు పెద్ద ఎత్తున బకాయిలు పడ్డారు. ఇంత పెద్ద మౌలిక సదుపాయాలున్న
ప్రాజెక్టును నిర్మించే తీరు ఇదేనా… ఈ ఏజన్సీ 27 శాతం పనులు చేసి చేతులెత్తేసింది. ఆ తర్వాత వై.ఎస్ జగన్ అధికా
రంలోకి వొచ్చిన తర్వాత ఈ ఏజన్సీని మార్చేశారు. మరో లోపమేమిటంటే ఈ ప్రాజెక్టు డిజైన్ బాధ్యతను సెంట్రల్ వాటర్ కమిషన్‌కు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ నిపుణులను విస్మరించారు. ఈ ప్రాజెక్టు డిజైన్ రూపకల్పనలో రాష్ట్ర నిపుణులను భాగస్వామ్యం చేయలేదు. దీంతో జగన్ సర్కార్ పాత ఏజన్సీని రద్దు చేసి రివర్స్‌టెండ
రింగ్ విధానంలో కొత్త ఏజన్సీకి పని అప్పగించారు. దీని వల్ల పనుల నిర్మాణంలో తీవ్రమైన జాప్యం జరిగింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒక లక్ష కుటుంబాలు నిర్వాసితులవుతారు. సహాయ పునరావాస పనుల ప్రణాళిక అధ్వాన్నంగా ఉంది. ఆర్ అండ్ ఆర్ పనులు సక్రమంగా లేకుండా ఈ ప్రాజెక్టు ను నిర్మించలేరు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలోఅనేక లోపాలు, జాప్యాల వల్ల వ్యవహారం గందరగోళంగా తయారైంది. నిర్వాసితులకు బ్రహ్మాండమైన
పునరావాసం కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు సర్కార్ చేతులెత్తేసింది. కేంద్రం అవసరమైన నిధులను సకాలంలో
ఇవ్వడం లేదు. సకాలంలో ప్రాజెక్టు పనులను కేంద్రం సమీక్షించలేదు. నిపుణుల కమిటీ నివేదికను కేంద్రం పట్టించుకోలేదు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో నిర్వాసితులకు భూమి, నష్టపరిహారం ప్రధానం.
ఈ పనులు అమలుకు కేంద్రం సిద్ధంగా లేదు. కేంద్రంలో టీడీపీ అండతో బీజేపీ అధికారంలోకి వొచ్చింది. ఏ మేరకు
కేంద్రం ఆంధ్రాకు న్యాయం చేస్తుందో చూడాలి. చంద్రబాబు కేంద్రం నుంచి ఏ మేరకు నిధులు రాబట్టనున్నారో వేచి
చూడాల్సిందే. కేంద్రం ఈ ప్రాజెక్టుకు నిధులను భరించకపోతే, ఆ భారాన్ని రాష్ట్రం భరిస్తుందా? చంద్రబాబు మనసులో ఏముంది? రాష్ట్ర ఖజానా పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. 2014-2019 మధ్య కూడా బీజేపీ కూటమిలో టీడీపీ ఉంది. మళ్లీ ఇప్పుడు కూడా అదే కూటమి కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఎవరెన్ని చెప్పినా పోలవరం ప్రాజెక్టుకునిధులు కావాలి. ఈ బాధ్యతను ఎవరు స్వీకరిస్తారు..? రాజకీయ పార్టీలు పరస్పరం నిందించుకుంటున్నాయి. కాని ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోయింది. నిధులు సమీకరణ గురించి ఏమి చేయాలనే దానిపై మాట్లాడడం లేదు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేయాల్సిందే. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.55వేల కోట్లు దాటింది. ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు…? ఏ విధంగానైనా ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు అంటు న్నారు. సహాయ పునరావాసానికి రూ.33వేల కోట్లు ఖర్చవుతుంది. ఈ నిధులను కేంద్రం నుంచి చంద్రబాబు తెస్తారా? అవినీతి, ఆధిపత్యం రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతిష్టాకరమైన పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తవు తుందనే నమ్మకం లేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మరి కొన్ని దశాబ్దాల సమయం పట్టడం ఖాయం. నేనే అపర భగీరథుడనే అని చెప్పుకునేందుకు చంద్రబాబు నాయుడు అంత వరకు ఆగాల్సిందే..!
-శామ్ సుందర్





