పోడు రైతుకు పట్టాభిషేకం…దశబ్దాల కల సాకారం

  • గిరిజనుల ఆత్మగౌరవాన్ని అకాశానికెత్తిన కెసిఆర్‌
  • ‌పుడమిపై పోడు రైతుకు పూర్తి హక్కు
  • పట్టాతో పది రకాల ప్రయోజనాలు
  • కేసులు ఎత్తివేసే దిశగా చర్యలు  
  • పాల్వంచలో మంత్రి పువ్వాడతో కలిసి పోడు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీష్‌ ‌రావు

కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌తెలంగాణలో గిరిజనులు దశబ్దాలుగా ఎదురు చూస్తున్న పోడు పట్టాల కల సిఎం కెసిఆర్‌ ‌సాకారం చేశారని, పోడు రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి అడవి బిడ్డలను అన్నదాతలుగా మార్చిన ఘనత సిఎం కెసిఆర్‌దని రాష్ట్ర అర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరిష్‌రావు అన్నారు. పోడు పట్టాల పంపిణీ రాష్ట్రమంతా పండగలా జరుగుతుందని, దీనితో పోడు గోడు పూర్తిగా సమసి పోయిందని, ఇక తెలంగాణలో పోడు రైతు గోడు వినపడదని అన్నారు. రైతులకు కెసిఆర్‌ ‌పాలన ఓ స్వర్ణ యుగం అని తెలిపారు. భదాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ ‌హాల్‌లో పోడు రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.

మంత్రులు హరీష్‌ ‌రావు, పువ్వాడ అజయక్‌ ‌కుమార్‌ ‌లబ్దిదారులకు పోడు భూములకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ…అన్నం పెడుతున్న భూమికి హక్కు పత్రాలు లేక ఏండ్లతరబడి ఇబ్బందులు పడుతున్న అడవి పుత్రులకు పట్టా అందజేసి సంపూర్ణ హక్కును కల్పించామని అన్నారు. రాష్ట్రం మొత్తం 4 లక్షల 6 వేల ఎకరాలకు పట్టాలు ఇస్తే ఒక్క భదాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్ష 51 వేల ఎకారాలకు పట్టాలు అందజేస్తున్నామన్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మెత్తం 50 వేల 595 మంది లబ్దిదారులకు 1,51,195 ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతు కుటుంబాలకు మూడు ఎకరాల భూమికి పట్టాలు అందజేస్తున్నామన్నారు. పోడు భూములకు పట్టాలు పొందిన రైతులకు అదనంగా పది రకాల ప్రయోజనాలు లబ్ది చేకూరుతాయన్నారు. ధరణిలో పేరు చేర్చి పాస్‌ ‌పుస్తకం అందజేస్తున్నామని చెప్పారు. అటవీ అధికారుల బెడద సమసి పోతుందని స్పష్టం చేశారు. భూమిపై పూర్తి హక్కుదారుడిగా పోడు రైతులు మారుతాడన్నారు. బ్యాంకు రుణాలు, రైతు బంధు కింద ఎకరాకు రూ 10 వేలు, ప్రమాదవశాత్తు రైతులు చనిపోతే రూ 5 లక్షల రైతు బీమా వర్తిస్తాయన్నారు. విద్యుత్‌ ‌శాఖ అధికారులు 24గంటల ఉచిత కరెంటు ఇస్తారని అన్నారు.

మార్కెట్‌ ‌కమిటీలోను రిజర్వేషన్‌లు అమలు చేస్తున్నామని, అందులోనూ అవకాశాలతో పదవులు పొందే అవకాశాలు పొందొచ్చని అన్నారు. ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు రైతు అవసరాల నిమిత్తం ఇచ్చే ప్రతి పథకం అందుబాటులోకి పోడు పట్టాదారులకు సైతం లభిస్తాయన్నారు. అకాల వర్షాలతో జరిగే పంట నష్టం ఎకరాకు రూ.10 వేలు అందుతాయన్నారు. గతంలో పంట నష్టం జరిగితే ఎలాంటి సహాయం అందక పోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కెసిఆర్‌ ‌ప్రభుత్వం పట్టాతో పోడు రైతులకు అన్ని హక్కులు కల్పించామని తెలిపారు. సంజీవిని లాంటిది కెసిఆర్‌ ‌పాలన అని కొనియాడారు. సిఎం కెసిఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి దశాబ్దాల కలను గూడాలను, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కెసిఆర్‌ది అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో మన్యం ప్రాంతాలు మంచం పట్టేవని కానీ బిఆర్‌ఎస్‌ ‌పాలనలో ఇంటింటికి భగీరథ పథకంతో మంచినీటిని అందించామని, పల్లె, బస్తీ దవఖానాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో నూతనంగా మెడికల్‌ ‌కాలేజీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గిరిజనులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.

2471 గూడాలను మాతండాలో మారాజ్యం అనే దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చిన గూడాలను తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దారని వెల్లడించారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని ఆకాశాన్ని అంటేలా బంజారాహీల్స్ ‌రూ 50 కోట్లతో బంజారా భవన్‌, ‌కొమరం భీమ్‌ ‌భవన్‌లను నిర్మించింది బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్‌ అన్నీ మేమే చేశామంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్‌ ‌నేతలు ఒక్క మహిళా రెసిడెన్షియల్‌ ‌కాలేజీని ఏర్పాటు చేయకపోడం సిగ్గుచేటు అన్నారు. తొమ్మిదేళ్ళ పాలనలో 95 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌ది అన్నారు. విదేశాలలో చదివే విద్యార్థులకు ఓవర్సిస్‌ ‌స్కాలర్‌ ‌షిప్‌ ‌కింద రూ 20 లక్షలు ఇస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 22 గిరిజన మహిళా రెసిడెంన్షిల్‌ ‌కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. •దేశంలో తొలిసారిగా రెసిడెంన్షియల్‌ ‌లా కళాశాలను తెలంగాణలో ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు.

కాంగ్రెస్‌ ‌పాలనలో ఒక్క మహిళా రెసిడెన్షియల్‌ ‌కలేజీ లేదు. తెలంగాణ ఏర్పడ్డాక దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్టి ప్రత్యేక ప్రగతి నిధితో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించిందన్నారు. గిరిజనులకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. త్రి ఫేస్‌ ‌కరెంటు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం రూ 221 కోట్లతో త్రి ఫేస్‌ ‌కరెంటు ఇచ్చామన్నారు. గిరిజనుల చేతుల్లో ఉన్న 8లక్షల ఎకరాల భూములకు రైతు బంధు కింద రూ 8300 కోట్ల నిధులు బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కేటాయించిందన్నారు. 60 ఏళ్ళలో జరగని అభివృద్ధి కేవలం దశాబ్ద కాలంలో చేసి దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. గిరిజనులు వొచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు బాసటగా నిలిచి మంచి చేస్తున్న కేసిఆర్‌ను ఆశిర్వదించాలని కోరారు.

యుద్ధ భూములు ఇక సస్యశామలం
ప్రభుత్వ విప్‌ ‌రేగా కాంతారావు మాట్లాడుతూ గతంలో పోడు భుములు యుద్ధ భూమిని తలపించేవని పట్టాల పంపిణీతో సస్యశామలంగా మారనున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. పోడు పట్టాల పంపిణీతో రైతులకు రైతు పథకాలు వర్తిస్తాయని అన్నారు. ఒక దశలో ఫారెస్టు అధికారులకు పోడు రైతులకు జరుగుతున్న సంఘర్షణతో రైతుల దు:•ం చూసి ఫారెస్టు అధికారులు వొస్తే చెట్టుకు కట్టేయండి అనాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఎందుకు మారారు అంటూ ప్రశ్నించే వారికి ఈ పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం సమాధానం చెబుతుందన్నారు. బిజెపి పార్టీ మారితే రూ 100కోట్లు ఇస్తామన్నది, కానీ గిరిజనుల సంక్షేమమే ముఖ్యమని అన్నారు. ఇంత మహత్తర బృహత్‌ ‌కార్యక్రమానికి సిఎం కెసిఆర్‌ శ్రీ‌కారం చుట్టారని చెప్పారు. అయితే గిరిజనుల హక్కులకంటే స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్లుగా జడ్పి చైర్‌పర్సన్‌ ‌గొప్ప కార్యాక్రమానికి గైర్హాజరు కావడం విచారకరం అన్నారు.

భవిషత్‌లో భూ వివాదాలు తలెత్తకుంగా పట్టాల పంపిణీలో అదునాతన సాంకేతికతను జియో కోఆర్డినేటీవ్‌ ‌మ్యాప్‌ ‌విధానాన్ని జోడించామని పేర్కొన్నారు. జిల్లాలోని పినపాక నియోజకవర్గంలో 15962, ఇల్లందులో12347, వైరాలో 1812, కొత్తగూడెంలో 4541, అశ్వారావుపేటలో 9418, భద్రాచలంలో 6515 మందికి పట్టాలు అందజేస్తున్నామని అన్నారు. పోడు రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని సిఎంని కోరారు. పోడు పట్టాల పంపిణీ ద్వారా గిరిజనులకు ప్రభుత్వం పట్టాభిషేకం చేస్తుంటే గిరిజనుల పక్షాన ఉండాల్సింది పోయి రాజకీయ పబ్బం గడుపుకోడానికి ప్రతిపక్షం పంచన చేరడం హేయమైన చర్య అన్నారు. చిత్తశుద్ధి లేని వ్యక్తి పదవిలో ఉన్నా లేకున్నా ఒక్కటే అని, జడ్పి చైర్మన్‌ ‌పదవికి రాజీనామా చేసి పోవాలని హితవు పలికారు. సిఎం కెసిఆర్‌ ‌కారణ జన్ముడని, ఆయన గిరిజనుల సంక్షేమానికి చేపడుతున్న పనులకు ఆకర్శితుడై పార్టీ మారానని గుర్తు చేశారు. సిఎం కెసిఆర్‌కు గిరిజనుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి
పోడు రైతులు ఎదుర్కుంటున్న కేసులను ఎత్తివేయాలని సిఎం కెసిఆర్‌కు విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సుధీర్ఘంగా జరిగిన పోడు రైతుల పోరాటంలో గిరిజనుల పక్షాన నిలిచినందుకు పోలీసు కేసులు సైతం ఎదుర్కున్నానని గుర్తు చేశారు. కేసులకు భయపడకుండా రైతులకు పక్షాన నిలిచామన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. పోడు రైతులు ఎదుర్కుంటున్న అక్రమ కేసులను అధికారులు ఉపసంహరించేలా చర్యలు చేపట్టాలని కెసిఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక
పోడు పట్టాల పంపిణీలో లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ అన్నారు. పోడు రైతులకు  రెండు వారాల పాటు అధికారులు ఐసిడివోలోనే నిద్రాహారాలు మాని పట్టాల పంపిణీ పక్రియ పూర్తి చేశామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *