పోడు భూములకు పట్టాలపై మరో డ్రామా..

  • తక్షణమే పట్టాలియ్యకుంటే పేదలు ఫామ్‌ ‌హౌజ్‌ను దున్నడం ఖాయం
  • 1100 మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలని సుప్రీమ్‌ ‌కోర్టు చెప్పినా స్పందించని  కేసీఆర్‌
  • ‌మీకు చేతగాకుంటే మాకు అప్పగించండి…
  • •కేంద్రంతో మాట్లాడి జర్నలిస్టులందరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటా
  • రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ఫైర్‌
  • ‌సంజయ్‌ ‌సమక్షంలో బీజేపీలో చేరిన సిరిసిల్ల మాజీ వైస్‌ ‌ఛైర్మన్‌ ‌లగిశెట్టి శ్రీనివాస్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : కేసీఆర్‌ ‌పాలన మానవత్వానికి చిరునామా అంటూ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌తీవ్రస్థాయిలో స్పందించారు. కేసీఆరే మానవ మృగం అంటూ అభివర్ణించారు. ఇంటర్మీడియట్‌ ‌విద్యార్థులు మొదలుకుని రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కనీసం స్పందించని నరరూప రాక్షసుడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలివ్వకుండా 8 ఏళ్లుగా నాన్చిన కేసీఆర్‌ ‌మళ్లీ అఖిలపక్షం పేరుతో కొత్త డ్రామాలకు తెరతీశారని విమర్శించారు. ఈసారి పోడు భూములకు పట్టాలివ్వకుంటే పేదలంతా కలిసి ఫామ్‌ ‌హౌజ్‌ను ఆక్రమించుకుని దున్నడం ఖాయమని హెచ్చరించారు. జర్నలిస్టు సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం నెంబర్‌ ‌వన్‌ అం‌టూ కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు.

ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తున్న కేసీఆర్‌ ‌సంక్షేమం గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలోని 1100 మంది జర్నలిస్టులకు నిజాంపేట, పేట్‌ ‌బషీరాబాద్‌లో తక్షణమే ఇండ్ల స్థలాలు కేటాయించాలని సుప్రీమ్‌ ‌కోర్టు తీర్పునిచ్చి 6 నెలలైనా అమలు చేయని దుర్మార్గుడు కేసీఆర్‌ అని మండిపడ్డారు. రాష్ట్రంలో కూల్చే సంస్క్రుతి బీఆర్‌ఎస్‌ ‌దేనని, సచివాలయాన్ని కూల్చిందెవరో ప్రజలకు తెలుసునన్నారు.  పాతబస్తీలో విద్యుత్‌ ‌బకాయిల్లేవంటూ ఎంఐఎం నేతలు, టీఆర్‌ఎస్‌ ‌నాయకులు మాట్లాడటం విడ్డూరమన్నారు. పాతబస్తీలో ఏటా రూ.వెయ్యి కోట్ల విద్యుత్‌ ‌చౌర్యం జరుగుతుందని, తనతో వొస్తే నిరూపించేందుకు సిద్ధమని సవాల్‌ ‌విసిరారు. సిరిసిల్ల సెస్‌ ‌మాజీ వైస్‌ ‌ఛైర్మన్‌, ‌శ్రీనివాస చారిటబుల్‌ ‌ట్రస్ట్ అధినేత లగిశెట్టి శ్రీనివాస్‌ ‌సహా వందలాది మంది అనుచరులు శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ ‌సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ, రాష్ట్ర నాయకులు ఎర్రం మహేశ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ..పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని, పట్టాలిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్‌ 8 ఏళ్లుగా ఎందుకు పట్టాలివ్వడం లేదు? పోడు భూముల్లో పంటలు వేసుకోవాలని చెప్పేది కేసీఆరే…తీరా పంట చేతికొచ్చే సమయానికి అధికారులను పంపి దాడులు చేయించేది కేసీఆర్‌.. ‌దాడులయ్యాక గిరిజనుల పక్షాన ఆందోళనలు చేయించేది కేసీఆర్‌. ‌కేసీఆర్‌ ‌ద్వంద్వ నీతికి నిదర్శనం..అని విమర్శించారు. అఖిల పక్ష సమావేశం నిర్వహించి భవిష్యత్తులో పోడు సాగు చేయబోమని హామీ ఇస్తేనే పట్టాలిస్తానని కేసీఆర్‌ ఇవాళ్ల అసెంబ్లీలో చెప్పడం సిగ్గు చేటు. ఉప ఎన్నికల సమయంలో ఈ మాట ఎందుకు చెప్పలేదు? కుర్చీ వేసుకుని పోడు భూములకు పట్టాలిస్తానని హామీ ఎందుకు ఇచ్చారు? ఇన్నాళ్లు నాన్చింది ఎవరు? మళ్లీ అఖిలపక్షం పేరుతో కొత్త డ్రామా చేస్తుందెవరు? పట్టాలివ్వకుండా చేయడానికే కొత్త నాటకం మొదలు పెడుతున్నారు. పోడు భూములకు పట్టాలివ్వకుంటే గిరిజనులంతా నీ ఫామ్‌ ‌హౌజ్‌ను ఆక్రమించుకుని దున్నడం ఖాయం..

ఆ అవకాశం ఇవ్వకుండా తక్షణమే పట్టాలివ్వాలని డిమాండ్‌ ‌చేస్తున్నాం..అని అన్నారు. ‘‘ప్రశ్నించే జర్నలిస్టుల గొంతు నొక్కుతున్న కేసీఆర్‌ ‌ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమంలో నెంబర్‌ ‌వన్‌ ‌గా నిలిచిందని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం హాస్యాస్పదం. జర్నలిస్టులకు ఎంతమందికి డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇం‌డ్లు ఇచ్చారో చెప్పాలి? అని బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ హైదరాబాద్‌ ‌కేంద్రంగా పనిచేస్తున్న 1100 మంది రాష్టస్థాయి జర్నలిస్టులకు నిజాంపేట, పేట బషీరాబాద్‌లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సాక్షాత్తు సుప్రీమ్‌ ‌కోర్టు తీర్పునిచ్చి 6 నెలలైనా ఇంతవరకు ఇవ్వకుండా అరిగోస పెడుతున్న కేసీఆర్‌ ‌ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం గురించి మాట్లాడటం సిగ్గు చేటు. మీడియాను పాతాళ లోకంలో పాతిపెడతానని చెప్పి రెండు ఛానళ్లపై నిషేధం విధించిన దుర్మార్గుడు కేసీఆర్‌. ‌జర్నలిస్టులకు ఇండ్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వాలని ప్రతిపాదన పంపితే వారం రోజుల్లో మంజూరు చేయించే బాధ్యత నేను తీసుకుంటా. దమ్ముంటే కేసీఆర్‌ ‌ప్రతిపాదనలు పంపాలి..అని ఈ సందర్భంగా సవాల్‌ ‌విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *