- సిఎం ఏ కార్యక్రమం చేపట్టినా మానవీయ కోణం
- 27,147 పాఠశాలల్లో 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ది
- రావిర్యాలలో మంత్రి సబితతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
- స్కూల్ విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసిన మంత్రులు
- దసరా సెలవుల తర్వాత అన్ని పాఠశాలల్లో అమలు : విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 06 : మానవీయ కోణంలోనే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్ధుల కోసం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి అల్పాహార పథకం వల్ల తల్లిదండ్రులపై భారం తగ్గుతుందని అన్నారు. ఈ పథకాన్ని రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిలతో కలిసి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ…బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పిల్లలు తినే అల్పాహారాన్ని ప్రభుత్వ పాఠశాల పిల్లలకు వడ్డిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేద పిల్లలకు ఇదొక్క గొప్ప వరం లాంటిదని అన్నారు. ఈ పథకం ద్వారా 27,147 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదివే దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకురుతుందని తెలిపారు.
ముఖ్యమంత్రి అల్పాహారం పథకం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపవుట్స్ తగ్గుతాయన్న హరీష్ రావు దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదన్నారు. పౌష్టిక విలువలతో అందిస్తున్న అల్పాహారాన్ని విద్యార్థులు అరగించి బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని అన్నారు. కల్యాణలక్ష్మి పథకం వల్ల బాల్యవివాహాలకు అడ్డుకట్ట పడిందని, కేసీఆర్ కిట్ వల్ల మాతశిశు మరణాలు తగ్గాయని తల్లులకు పుట్టబోయే పిల్లలు ఆరోగ్యం కాపాడుకోగలుగుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా విద్యార్థుల హాజరుపెంచడం, పోషకాహారం ఇవ్వడం ద్వారా పిల్లలలో శారీరక ఎదుగుదల ఉండేలా చూడటం తల్లిదండ్రులపై భారం తగ్గుతుందని అన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా సీజనల్ వ్యాధులు తగ్గిపోయాయని, వర్షాకాలంలో వొచ్చే డయేరియా, మలేరియా, డెంగ్యూలు తగ్గిపోయి ప్రజల ఆరోగ్య ప్రమాణాలను పెంచిందని అన్నారు. ఇలా ప్రతి పథకం వెనుక ఎన్నో అద్భుతమైన ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం సాధించిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.. ఆంగ్లమాద్యమంలో చదువు చెప్పడం మూలంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య బాగా పెరుగుతుందని అన్నారు.
ఆంగ్ల మాద్యమంలో బోధన, ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్నం భోజనంతో పాటు కొన్ని రోజులు కౌడిగుడ్డు ఇవ్వడం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనే అన్నారు. దేశంలో ఎక్కడ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి గురుకుల పాఠశాలలతో పాటు బాలికల కోసం 70కి పైగా గురుకుల డిగ్రీ కళాశాలలు ఇచ్చామన్నారు. ఆడపిల్లల చదువుకు ప్రాధాన్యతనిస్తు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఎంతగానో బలోపేతం చేస్తున్నామని తెలిపారు.దసరా సెలవుల తర్వాత అన్ని పాఠశాలల్లో అమలు : విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి దసరా సెలవులు ముగిసిన తర్వాత అన్ని పాఠశాలల్లో సిఎం అల్పాహార పథకం అమలవుతుందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. పథకం అమలును పర్యవేక్షించే బాధ్యతను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో అదనపు కలెక్టర్లకు అప్పగిస్తామన్నారు. విద్యాశాఖ, పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాకల సమన్వయంతో పనిచేసి ఈ పథకాన్ని సమర్ధంగా అమలు చేస్తామని పేర్కొన్నారు.
పిల్లలు బాగా చదివి వృద్ధిలోకి రావాలని తల్లిదండ్రులతోపాటు తెలంగాణ ప్రభుత్వం కూడా సంతోషిస్తుందని అన్నారు. విద్యారంగంలో సీఎం సమూలమైన మార్పులు తీసుకొచ్చారని అన్నారు. పేద విద్యార్థులకు పోషకాహారం ఇవ్వడానికి పథకాన్ని అమలు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి హరీష్ రావు, మంత్రి సబితారెడ్డిలు కలిసి అల్పాహారాన్ని తిని, విద్యార్థులకు స్వయంగా ఇడ్లి తినిపించారు. కాసేపు వారితో ముచ్చటించారు. పలువురు విద్యార్థుల దగ్గరకు వెళ్లి మంత్రులు స్వయంగా అల్పాహారం ఎలా ఉందంటూ వాకబు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా జడ్పీచైర్పర్సన్ అనితారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎంపీ బీవీపాటిల్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, దయనంద్ గుప్తా, రఘోత్తమరెడ్డి, ఎమ్మెల్యేలు యాదయ్య, పైళ్ల శేఖర్రెడ్డి, విద్యాకార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాడైరెక్టర్ దేవసేన, టీఎస్ డబ్ల్యుఐడీసీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ హన్మంత్ రావు, జిల్లా కలెక్టర్ హరీష్, డీఈవో సుశీందర్రావు, పురపాలక చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, కమిషనర్ వెంకట్రామ్, హెచ్‌ఎం రఘు, ఎంఈవో కృష్ణ, సత్తు వెంకట్రమణరెడ్డి, గుండెమోని అంజయ్య ముధిరాజ్, తదితరులు పాల్గొన్నారు.





