హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : తెలంగాణ ప్రభుత్వం అభాగ్యులైన, ఆసరా అవసరమైన దివ్యాంగులకు ఆర్థిక భరోసాగా అందిస్తున్న మొత్తాన్ని మరింతగా పెంచింది. గతంలో మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పింఛన్‌ను పెంచబోతున్నట్లు సీఎం కేసీఅర్ ప్రకటించారు. ఈ మేరకు దివ్యాంగుల పింఛన్‌ను రూ.1,000 పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతి నెలా రూ.3,016 పెన్షన్‌ను అందుకుంటున్న దివ్యాంగులు, ఇక మీదట 4,016 పెన్షన్‌ను అందుకుంటారు. ఈ నెల నుండి అమలులోకి వొస్తుందని ప్రభుత్వం జీఓ లో పేర్కొంది. దీని ప్రకారం 5 లక్షలకు పైగా దివ్యాంగ పున్షనర్లు లబ్ది పొందనున్నారు. దివ్యాంగుల పెన్షన్లు పెంచడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో వేరెక్కడ లేనివిధంగా అత్యధిక పెన్షన్లు అందిస్తూ దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీష్ రావు ట్విట్ చేశారు.




