పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్‌

దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌
ప్రపంచ పెట్టుబడిదారులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సందేశం
గ్రీన్‌ ప్రాపర్టీ షో 2024లో గ్లోబల్‌ హైదరాబాద్‌ విజన్‌ను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్‌
నాలుగేళ్లలో ఐటి ఎగుమతుల రెట్టింపు ప్రభుత్వ లక్ష్యం : మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 17 : ప్రపంచంలోని అగశ్రేణి మహానగరాలకు పోటీగా హైదరాబాద్‌ను నిజమైన ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం హైటెక్స్‌లో ఐజిబిసి గ్రీన్‌ ప్రాపర్టీ షో 2024ను మంత్రి శ్రీధర్‌ బాబుతో కలిసి ప్రారంభించిన అనంతరం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ…ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రపంచ పెట్టుబడిదారులకు, దేశానికి, రాష్ట్రానికి స్పష్టమైన సందేశాన్ని పంపాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. హైదరాబాద్‌ ప్రతి కోణంలోనూ నిజమైన విశ్వ నగరంగా మారుతుందన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌రోడ్డు, ఎక్స్‌ప్రెస్‌వే, ఫ్లై ఓవర్లు, గోదావరి, కృష్ణా నదుల తాగునీటితో సహా హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని ఆయన వివరించారు. హైదరాబాద్‌ మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకుందని అన్నారు. మూసీ రివర్‌ఫ్రంట్‌ను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు, నగరంలోని ప్రతి మూలకు చేరుకునేలా మెట్రో రైల్‌ను  విస్తరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన ప్రణాళికలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు.

అదనంగా, తెలంగాణ ప్రభుత్వం వ్యాపార అనుకూల వాతావరణాన్ని పెంపొందిస్తుందని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ దేశంలోనే అత్యున్నతంగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు ప్రభుత్వానికి అత్యంత మద్దతునిస్తారన్నారు. తాము పారదర్శకంగా, స్నేహపూర్వకంగా, సమర్ధవంతంగా ఉంటామని, వ్యాపారస్తులకు, వ్యవస్థాపకులకు-స్నేహపూర్వకంగా ఉంటామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, నిర్మాణం, రియల్‌ ఎస్టేట్‌లను పెంచడానికి అవసరమయిన చర్యలు చేపట్టడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ను, తెలంగాణను వాస్తవంగా ప్రపంచ స్థాయికి ఎదగాలనే సంకల్పంతో ఉందని దేశంలోని ప్రతి ఒక్కరికీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హామీ ఇచ్చారు. రియల్‌ ఎస్టేట్‌ ఎక్కువగా అవగాహనతో నడుస్తుందని, నిర్మాణ, రియల్‌ ఎస్టేట్‌ రంగాలలో నిజమైన ఊపును సృష్టించడానికి, పెట్టుబడులను పెంచడానికి తమ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.

ప్రజల ఫిర్యాదులు, అవసరాలు, డిమాండ్లను పరిష్కరించడానికి తాము అందుబాటులో ఉన్నామని, హైదరాబాద్‌ను పెట్టుబడి కేంద్రంగా, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో నిజమైన ప్రపంచ విశ్వ నగరంగా మార్చడమే తమ ఏకైక లక్ష్యమని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదు నెలలు అధికారంలో ఉందని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా దాదాపు రెండు నెలల పాటు తమ చర్యలను పరిమితం చేసిందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు తాము పూర్తిగా పాలనపై దృష్టి కేంద్రీకరించాము, పరిశ్రమలు, నిర్మాణాలు, రియల్‌ ఎస్టేట్‌లలో ఏవైనా సమస్యలు ఉంటే తాము వాటిని పరిష్కరిస్తామని,  అందుకు బాధ్యత తీసుకుంటమని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ఇతర ప్రపంచ నగరాలతో పోటీపడుతుందని తాను వ్యక్తిగతంగా నమ్ముతున్నానని అన్నారు.శాంతిభద్రతలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వ్యాపారాన్ని సులభతరం చేయడం, రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణం, ఐటి మరియు ఇతర రంగాలను పెంచడానికి అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి ఉత్తమ్‌ అన్నారు. గ్రీన్‌ ఎనర్జీకి సంబంధించి, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ(సీఐఐ) యొక్క ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజిబీసీ) చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. హరిత కార్యక్రమాలను ప్రోత్సహించడంలో ఐజీబీసీ కీలకపాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. సుస్థిరత కోసం చేస్తున్న కృషికి హైదరాబాద్‌కు గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. సుస్థిరత అనేది కేవలం బజ్‌వర్డ్‌ కాదని, అది మనస్తత్వమని, మనం హృదయపూర్వకంగా స్వీకరించవలసిన జీవన విధానమని ఉత్తమ్‌ అన్నారు.

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణం, అనుబంధ పరిశ్రమలు పర్యావరణాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయని, అయితే అవి సానుకూల మార్పుకు అద్భుతమైన అవకాశాలను కూడా అందిస్తాయని త్తమ్‌ అన్నారు. మహాత్మా గాంధీని ఉటంకిస్తూ…ఏదైనా ప్రపంచంలో ప్రతి ఒక్కరి అవసరాలకు సరిపోతుంది..కానీ ప్రతి ఒక్కరి దురాశకు సరిపోదన్నారు. భూగోళం మనుగడకు హరిత విధానాలను అవలంబించాలని, భావి తరాలకు అలాగే వదిలేయాలని మోదీ ఉద్ఘాటించారు. తాము పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడానికి, వీలైనంత త్వరగా నికర కార్బన్‌-జీరో సొసైటీని సాధించడానికి కట్టుబడి ఉన్నామని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. అంతకుముందు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ..వొచ్చే నాలుగేళ్లలో హైదరాబాద్‌ నుంచి ఐటీ ఎగుమతులను రెట్టింపు చేసి హైదరాబాద్‌ను డేటా వేర్‌హౌస్‌లకు ప్రపంచ రాజధానిగా మార్చాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రస్తుతం ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని ప్రభుత్వం భావించడం లేదని, ఐటి పరిశ్రమ నిరంతరం అభివృద్ధి చెందేలా వాటిని నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాము వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని కొత్త స్థాయికి తీసుకువెళతామని, మరింత సరళంగా, స్నేహపూర్వకంగా, పరిశ్రమకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐజిబిసి నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ సి.శేఖర్‌ రెడ్డి, సిఐఐ ఐజిబిసి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎం. ఆనంద్‌, ఐజిబిసి హైదరాబాద్‌ చాప్టర్‌ కో-చైర్‌ శ్రీనివాస్‌ మూర్తి కూడా మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *