రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన “ప్రత్యేక మిలటరీ ఆపరేషన్” పేరున ఫిబ్రవరి 24, 2023న ఉక్రెయిన్‌పై అమానుష దాడితో మొదలై నాటో సహాయసహకార ప్రవేశంతో గత 500 రోజులుగా కొనసాగడంతో ప్రపంచ దేశాలన్నీ యుద్ధ ప్రభావంతో ఉత్పత్తి, సరఫరా గొలుసులు తెగిపోవడంతో ఆర్థికంగా 1.6 లక్షల కోట్ల డాలర్లకు పైగా కుంగిపోవడం, మరో లక్ష కోట్ల డాలర్ల వరకు నష్టం వాటిల్లవచ్చనే వార్తలను చూస్తున్నాం. యుద్ధం మూలంగా ఒక వైపు ద్రవ్యోల్బనానికి రెక్కలు వచ్చి ఆకలి కేకలు, మరో వైపు ఇంధన సంక్షోభాలతో సతమతం అవుతున్న దేశాలను చూస్తున్నాం. రావణకాష్ఠంగా రగులుతున్న యుద్ధ మంటలు డ్రోన్లు, క్షిపణులా, రాకెట్ లాంచర్లతో రష్యా బలగాలు ఉక్రెయిన్ గుండెల్లో మారణహోమం సృష్టిస్తున్నాయి. అగ్నికి ఆజ్యం పోసేలా ఇటీవల యూఎస్ పంపించిన క్లస్టర్ బాంబులతో యుద్ధం మరో మలుపు తిరగనుందని హెచ్చరిస్తున్నారు.
అపార ఆస్తిప్రాణ నష్టం:
24 ఫిబ్రవరి 2022న ఏకపక్షంగా రష్యా పుతున్ ప్రారంభించిన ఉక్రెయిన్‌పై నిరవధిక యుద్ధం 500 రోజులు, 16 మాసాలు దాటుతూ విధ్వంసకరంగా, అమానవీయంగా కొనసాగుతూ పరిష్కారమే కనిపించని అనిశ్చిత స్థితిలో కొనసాగుతున్నది. ఇతరుల యుద్ధ నష్ట అంచనాలు ఎలా ఉన్నా ఇప్పటి వరకు 9083లకు పైగా అమాయక పౌరులు, 15,779లకు పైగా గాయపడడం నమోదైందని ఐరాస వివరాలు స్పష్టం చేస్తున్నాయి. వీటికి తోడుగా 6.3 ఉక్రేనియన్ ప్రజలు నిస్సహాయంగా తమ ఆవాసాలకు కన్నీటి వీడ్కోలు పలుకుతూ పొరుగు దేశాలైన యూరోప్‌కు వలసలు వెళ్లి శరనార్థులుగా బతుకులు ఈడ్చుతున్నారు. దీనికి తోడుగా ఇరు దేశాల సైనికులు లక్షల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా. ఉక్రెయిన్ పక్షాన 17,500 మంది సైన్యం ప్రాణాలు కోల్పోగా, 1.14 లక్షల మంది గాయపడ్డారని యూఎస్ అంచనా వేసింది. రష్యా సైన్యంలో దాదాపు 2.5 లక్షల మంది మరణించడం (దాదాపు 50,000 మంది) లేదా గాయపడడం (2 లక్షల వరకు) జరిగిందని తేల్చారు.
పుతిన్ బాంబులకు ఉక్రెయిన్ అతలాకుతలం:
పొరుగు దేశమైన ఉక్రెయిన్ ప్రభుత్వం రష్యా-వ్యతిరేకంటూ జూలై 2021లోనే పుతిన్ మనసులోని ద్వేషపు మాటలను బయట పెట్టారు. పుతిన్ పుర్రెలో పుట్టిన యుద్ధ పురుగు దినదినం పైచాచికంగా మారుతూ ఉక్రేయిన్ పూర్తి విధ్వంస దిశగా కొనసాగడం ప్రపంచ మానవాళి వ్యతిరేకతను చవిచూస్తున్నది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం వైపులు రష్యా బలగాలు కవాతు చేయడం, ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓలోడిమిర్ జెలెన్స్కీ పశ్చిమ దేశాల సహాయంతో ప్రతిఘటించడంతో పుతిన్ దురాక్రమణ ఊహలు నీరుకారిపోవడం, ఇరుపక్షాల మధ్య యుద్ధం కొనసాగడం జరుగుతున్నది. ప్రపంచంలోనే అతి పెద్దదైన యూరొప్‌లోనే అతి ముఖ్యమైనదైన ‘జపోరిజ్జియా అణు విద్యుత్ కేంద్రాన్ని’ రష్యన్ బలగాలు ఏప్రిల్ 2023లో అదుపులోకి తీసుకోవడంతో న్యూక్లియర్ విస్పొటనం జరుగవచ్చనే వార్తలు కూడా చక్కర్లు కొట్టడం విన్నాం.
ఐరాస చొరవతో రష్యా ఉక్రెయిన్‌ల మధ్య అంగీకారంతో ఆహార ధాన్యాల ఎగుమతులు ఉక్రెయిన్ నావికా కేంద్రాల నుంచి కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 2023లో పుతిక్ బలగాలు ఉక్రెయిన్‌లోని డోనెట్స్క్, లుహాన్స్క్, జపొరిజ్జయా, కెర్సన్ ప్రాంతాలను ఆక్రమించడం జరిగినా యూఎస్, యూరోపియన్ దేశాలు దురాక్రమణను అంగీకరించడం లేదు. గత అక్టోబర్ మాసంలో కెర్చ్ బ్రిడ్జ్ విధ్వంసం జరిగి, తీవ్రవాదులు చేయవచ్చనే వార్తలను వ్యాప్తి చేయడం చూస్తున్నాం. రష్యన్ బలగాలు ముందు కదలడం సులభం అయ్యింది. ఉక్రెయిన్ శక్తి కేంద్రాలే లక్ష్యంగా రష్యన్ మెసైల్ దాడులతో కొనసాగడం, డిసెంబర్‌లో జెలెన్స్కీ యూయస్ శ్వేతసౌధం దర్శించి అమెరికా అధ్యక్షుడిని కలిసి పలు సూచనలు చేశారు.
యుద్ధాగ్నికి ఆజ్యం పోస్తున్న నాటో దేశాలు:
నాటో కూటమిలో చేరాలనుకున్న ఉక్రెయిన్ ఆలోచనలను వ్యతిరేకించిన పుతిన్ దురాక్రమణతో కొద్ది రోజుల్లో లొంగదీసుకోవాలనుకొని మొదలు పెట్టిన యుద్ధం నేటికీ కొనసాగడంతో ఇరువైపుల తీవ్ర ఆస్తిప్రాణనష్టాలతో పాటు నేడు ఉక్రెయిన్ అత్యంత పతన స్థితికి చేరి అస్థవ్యస్థం అయ్యింది. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరితే రష్యా సరిహద్దుల వరకు పాశ్చాత్య దేశాల బలగాలు చేరి తమ సార్వభౌమత్వం దెబ్బ తింటుందని పుతిన్ యుద్ధభేరా మోగించారని మనకు తెలుసు. యుద్ధంతో రష్యా ప్రత్యక్షంగా విధ్వంసం కాకున్నప్పటికీ ఆదేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్నది. సైనికుల సంఖ్య తగ్గడంతో సామాన్య పౌరులు, ఖైదీలను కూడా నిర్బంధంగా సైనికులుగా మార్చవలసి వస్తున్నది. అణ్వాయుధాలు ప్రయోగించైనా యుద్ధం గెలవాలనే కోరిక తీరకుండా యుద్ధ తీవ్రత పెరుగుతోంది. పుతిన్, జెలెన్స్కీల మధ్య శాంతి చర్చలకు వేదిక కరువైంది, మధ్యవర్తిత్వం చేసే వారే కనిపించడంతో లేదు కాబట్టి ఇరుపక్షాలు శాంతియుతంగా సమస్యకు పరిష్కారం చూసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. నేడు రష్యాలో 12.75 లక్షలు, జర్మనీలో 10.77 లక్షలు, పోలాండ్‌లో 10 లక్షలు, చెక్ రిపబ్లిక్‌లో 3.5 లక్షలు, యూకెలో 2.07 లక్షల శరణార్థుల తలదాచుకుంటున్నారు.
శిధిలాల్లో ఉక్రెయిన్ ఆవాసాలు:
ఉక్రెయిన్‌లోని ఆవాస భవనాలు, హాస్పిటల్స్, పవర్ ప్లాంట్లు, డ్యామ్‌లు, బ్రిడ్జిలు, మౌళిక వసతులు విసిరిన పుతిన్ బాంబులకు నేలమట్టం అయ్యాయి. నేడు దాదాపు 20 శాతం ఉక్రెయిన్‌ను రష్యా బలగాలు ఆక్రమించాయని, పలు కీలక సంస్థలను చేజిక్కించుకున్నాయని తెలుస్తున్నది. నాటో కూటమి దేశాల చేయూతతో రష్యా దురాక్రమణ దూకుడును ఎదిరించడం తప్ప మరో మార్గం లేని దుస్థితిలో ఉక్రెయిన్ ఉన్నది. యుద్ధం సమస్యలకు ముగింపు కాదని, ఆయుధాలు ప్రపంచ ఆకలిని పెంచుతాయని, బాంబులు మరణమృదంగం మోగిస్తాయని తెలుసుకొని, గుణపాఠం నేర్చుకొని యుద్ధానికి చరమగీతం పాడాలని ప్రతి ప్రపంచ పౌరుడు కోరుకుంటున్నాడు. ప్రపంచ మేలును కోరి రష్యా ఉక్రెయిన్‌లు చర్చల తలుపులు తెరిసి యుద్ధ ముగింపుకు అంగీకరించాలని భారత్ లాంటి తటస్థ దేశాలు కోరుకుంటున్నాయి.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037




