వికారబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: ఈనెల 16న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నందున, జిల్లా నుండి పెద్ద ఎత్తున రైతులను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, ముందుగా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా జిల్లాకు దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈనెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభ కార్యక్రమానికి జిల్లాకు 134 బస్సులు కేటాయించడం జరిగిందని, ఇట్టి బస్సుల ద్వారా నాలుగు నియోజకవర్గాల నుండి రైతులను పెద్ద ఎత్తున కార్యక్రమానికి సురక్షితంగా తరలించి, తిరిగి తీసుకురావాల్సిన పూర్తి బాధ్యత వ్యవసాయ శాఖ చేపట్టాలన్నారు. ప్రాజెక్టు ద్వారా విడుదల చేసిన కృష్ణా జలాలను కలశాలలో తీసుకువచ్చి మరుసటి రోజు దేవాలయాలలోని విగ్రహాలను నీటితో కడగడం జరుగుతుందన్నారు. అలాగే ఈనెల 15న జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాలను వేర్చువల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయనున్నందున ప్రోటోకాల్ ప్రకారంగా ముఖ్య అతిథులు అందరినీ ఆహ్వానించాలని, అలాగే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుండి 177 ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హత మేరకు సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, అసిస్టెంట్ ట్రేని కలెక్టర్ నారాయణ అమిత్ లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




