పార్లమెంట్‌లో మార్మోగుతున్న ‘మణిపూర్‌’

  • ‌చర్చ చేపట్టాలని బిఆర్‌ఎస్‌ ‌సహా పలు పార్టీల వాయిదా తీర్మానాలు
  • తిరస్కరించిన స్పీకర్‌…‌సభ హుందాతనాన్ని కాపాడాలని సూచన
  • సస్పెండ్‌ అయిన ఆప్‌ ఎం‌పీకి మద్దతుగా బీఆర్‌ఎస్‌ ఎం‌పీల ధర్నా
  • మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ‘ఇండియా’!

న్యూ దిల్లీ, జులై 25 : పార్లమెంట్‌లో మంగళవారం కూడా మళ్లీ మణిపూర్‌ అం‌శమే మార్మోగింది. లోక్‌సభలో విపక్షాలు ఉదయం ప్రశ్నోత్తరాలను అడ్డుకుని.. మణిపూర్‌ ‌హింసాకాండపై చర్చించాలని డిమాండ్‌ ‌చేశాయి. కానీ స్పీకర్‌ ఓం ‌బిర్లా అందుకు నిరాకరిస్తూ ఆ వాయిదా తీర్మానాలను కొట్టిపారేశారు. ప్రశ్నోత్తరాలను నిర్వహించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. అయితే ప్రశ్నోత్తరాలను విపక్ష సభ్యులు తమ నినాదాలతో అడ్డుకున్నారు. ఆందోళనలతో సమస్యలు పరిష్కారం కావని ఈ సందర్భంగా సభ్యులకు స్పీకర్‌ ‌బిర్లా సూచించారు. సభ హుందాతనాన్ని కాపాడాలని ఆయన సభ్యుల్ని కోరారు.

కానీ విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకుండా పెద్ద ఎత్తున నినాదాలను కొనసాగించారు. దాంతో ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడంతో ఆయన సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. ఇక అంతకు ముందు మణిపూర్‌ అం‌శంపై చర్చ చేపట్టాలని ఇవాళ బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఎంపీ నామా నాగేశ్వర్‌రావు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మణిపూర్‌లో శాంతి నెలకొల్పడంతో పాటు సాధారణ పరిస్థితులు ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కోరింది. మణిపూర్‌ ‌ఘటనలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌ ‌చేసింది.

సస్పెండ్‌ అయిన ఆప్‌ ఎం‌పీకి మద్దతుగా బీఆర్‌ఎస్‌ ఎం‌పీల ధర్నా
మణిపూర్‌ అం‌శంపై చర్చకు పట్టుబట్టి రాజ్యసభ నుంచి సస్పెండ్‌ అయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ ‌సింగ్‌కు భారత రాష్ట్ర సమితి మద్దతు ప్రకటించింది. ఆయనకు మద్దతుగా పార్లమెంటు ఆవరణలో బీఆర్‌ఎస్‌ ఎం‌పీలు నామా నాగేశ్వర్‌రావు, సంతోష్‌ ‌కుమార్‌, ‌బడుగుల లింగయ్య యాదవ్‌, ‌రంజిత్‌ ‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ధర్నాకు దిగారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీ సంజయ్‌ ‌సింగ్‌ను సస్పెండ్‌ ‌చేయడాన్ని నామ నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఇది అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, ఆప్‌ ఎం‌పీ ఆందోళనకు సంఘీభావంగా సోమవారం సాయంత్రం 6.30 గంటల నుంచి బీఆర్‌ఎస్‌ ఎం‌పీలు ధర్నాలో కూర్చున్న సంగతి తెలిసిందే.

మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ‘ఇండియా’!
మణిపూర్‌ అం‌శంపై ప్రధాని మోదీ ఉభయసభల్లో మాట్లాడాలని విపక్షాలు డిమాండ్‌ ‌చేస్తున్నా ఆయన మౌనం వీడకపోవడం పట్ల ఆగ్రహంగా ఉన్న విపక్షాలు..లోక్‌సభలో కేంద్ర సర్కార్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల ‘ఇండియా’ పేరుతో కూటమిగా మారిన విపక్ష పార్టీలు ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. మణిపూర్‌ అం‌శం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం వొస్తుంది. ఈ నేపథ్యంలో విపక్ష కూటమి ఇండియా కూడా భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు సిద్ధమైంది. కాగా, మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విపక్ష పార్టీలపై ప్రధాని మోదీ ఫైర్‌ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *