అధికారం ఎల్లప్పుడూ ఒకరి సొత్తు కాదనేది జగమెరిగిన సత్యం. సహజంగా పార్టీల ఎజెండాను చూసి, అందులో ఉన్న నాయకుల నిబద్ధతను చూసి ప్రజలు ఆయా పార్టీలకు అధికారం కట్టబెడతారు. నవంబర్ 2023 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ప్రజలు పార్టీల ఎజెండా కంటే కూడా బలంగా తెలంగాణలో మార్పు కావాలని కోరుకున్నారు. గతంలో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన పార్టీని ప్రజలు తిరస్కరించారు. దానికి ప్రధాన కారణం ప్రజా నాయకులు ప్రజలకు అందుబాటులో లేకపోవడం. దానికి తోడు అనేక రకాలైన కుంభకోణాలలో అధికార పార్టీ నాయకుల పాత్ర ప్రత్యక్షంగానో, పరోక్షంగానూ ఉండడం. గతంలో ఇతర పార్టీలలో విజయం సాధించిన ప్రతిపక్ష నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించి ఫిరాయింపులను ప్రోత్సహించడం. ఇతర పార్టీల గుర్తులపై గెలిచి తమ పార్టీలోకి వచ్చిన వారిని రాజీనామా చేయాలని అడగాల్సిన నైతిక బాధ్యతను పక్కకు పెట్టి, ఏకంగా వారికి మంత్రి పదవులను ఇచ్చి ప్రోత్సహించారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం పాలక పక్షానికి అత్యాశే అవుతుంది. పార్టీలను ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోమని సంబంధిత పార్టీ సభ్యులు సభాపతిని కలవడం, ఆయన వారి వినతి పత్రాన్ని స్వీకరించడం, ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం ఆనవాయితీగా వస్తూనే ఉంది.
రెండవసారి టిఆర్ఎస్ పార్టీ 85 స్థానాలు గెలవగా, ఫిరాయింపులను ప్రోత్సహించి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకొని 105 పెరిగి, ఇక తమకు ఎదురులేదనే భావనతో పాలన కొనసాగించారు. కానీ ప్రజలు విజ్ఞులు కాలం కలిసి రాగానే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ విధానాల కంటే కూడా, పాలకపక్షంపై ప్రజలలో ఉన్న వ్యతిరేకతే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. దీంతో 64 స్థానాలతో అధికారంలోకి రాగా, గతంలో అధికారంలో ఉన్న పార్టీ39 స్థానాలకు పరిమితమైంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు కొంతమంది నాయకులు వారి అవసరం, అవకాశం, స్వార్థంతో అధికార పార్టీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు తిరస్కరించిన నాయకులే వారి వారి అవసరాల కోసం అధికార పార్టీలోకి వచ్చి మళ్లీ మంత్రులుగా, ఎంపీలుగా గెలుపొందాలని ఆలోచనలు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే భంగం కలిగించినట్లు అవుతుంది. నిబద్ధత కలిగిన నాయకుడు దొరికే అవకాశాలే లేవా అని ప్రజాస్వామ్యవాదులు బాధపడే రోజులు వచ్చాయి.
ప్రజా తీర్పులను గౌరవించి కనీసం 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి, ప్రజల పక్షాన పోరాడే ఓపిక కూడా నేటి నాయకులకు లేకపోవడం దురదృష్టకరం. నాడు తెలంగాణ పునర్నిర్మాణానికి కట్టుబడి పార్టీలను మారుతున్నాం అని చెప్పిన నాయకులు, నేడు తెలంగాణ అభివృద్ధికి పార్టీలు మారుతున్నామని చెప్పడం పరిపాటి. గతంలో బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందో, నేడు కాంగ్రెస్ పార్టీ కూడా మెల్ల మెల్లగా ఫిరాయింపులకు తెర తీసినట్లుగా కనిపిస్తోంది. నిన్నటి వరకు అవినీతిపరుడని విమర్శించిన నాయకుడిని తమ పార్టీలో చేర్చుకుంటే, అతని అవినీతి తొలగిపోతుందా? అతను దోచుకున్న ప్రజల సొమ్ము ఎవరికి చెందినట్లు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన నాయకులు మాత్రం వారే అన్నట్లుగా వ్యవస్థ తయారవడం సమాజానికి మంచిది కాదు.
నాయకులు అక్రమంగా సంపాదించిన ఆస్తుల పరిరక్షణ కోసమో, కేసుల నుండి తప్పించుకోవడానికి అధికారం కావాలని, అధికార పార్టీలలోనికి నాయకులు వస్తున్నారు. పైగా వీరు ప్రజాసేవ చేయడానికి అధికార పార్టీలో ఉంటేనే మంచిది అని చెప్పడం హాస్యాస్పదం. అవకాశాల కోసం, అవసరాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం నీతిలేని రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడే నాయకులతోనే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. కనుక పార్టీ ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించిన అది రాజ్యాంగ విరుద్ధమే, ప్రోత్సహించిన పార్టీలే నష్టపోక తప్పదనే సత్యాన్ని గ్రహించాలి.
-వేదాంతం హరికుమార్, హనుమకొండ




