పారిశ్రామికాభివృద్దికి కట్టుబడి ఉన్నాం

పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఫాక్స్‌కాన్‌ ప్రతినిధి బృందం భేటీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం డా. బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణా సచివాలయంలో సిఎం రేవంత్‌ రెడ్డితో ఫాక్స్‌కాన్‌కు చెందిన హాన్‌ హాయ్‌ ప్రెసిషన్‌ ఇండస్ట్రీస్‌ ప్రతినిధి వీలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ…ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందని అన్నారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నాం. కాబట్టి, పారిశ్రామికవేత్తలకు కూడా పూర్తి సహాయ, సహకారాలందిస్తామని అన్నారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడం తోపాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని తెలియజేసారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ అభివృద్దిని మరింత వేగవంతం చేస్తామని, కొంగర కలాన్‌ ఉత్పాదక కేంద్రం నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని సిఎం తెలిపారు.

ఫాక్స్‌కాన్‌ సంస్థ చేపట్టబోయే భవిష్యత్‌ ప్రాజెక్టులకు కూడా అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామన్నారు. ఇక ఫాక్స్‌కాన్‌ కంపనీ పూర్వాపరాలను పరిశీలిస్తే…మార్చి 2023లో తెలంగాణ ప్రభుత్వంతో ఫాక్స్‌కాన్‌ గ్రూప్‌ ఒప్పందం కుదిరింది. సంస్థ ఆపిల్‌ ఐఫోన్లను ప్రధానంగా తయారుచేస్తుంది. సంస్థ ప్రధాన కస్టమర్లలో గూగుల్‌, జియామీ, అమజాన్‌, హెవ్‌లెట్‌ ప్యకార్డ్‌, హెచ్‌యుఏడబ్ల్యుఐ, అలీబీబీ గ్రూప్‌, సిస్కో, డెల్‌, ఫేస్‌బుక్‌, నెన్టెడో, సోనీ, మైక్రోసాఫ్ట్‌, సెగా, నోకియా వంటివి వున్నాయి. చైనా, వియత్నాం, థాయ్‌లాండ్‌, మలేషియా, అమెరికా, యూరప్‌, భారత్‌ సహా 24 దేశాలలో ఫాక్స్‌కాన్‌ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నది. మన దేశంలో శ్రీసిటి(ఎపి), శ్రీపెరంబుదూర్‌ (తమిళనాడు), తెలంగాణ (కొంగరకలాన్‌) మరియు కర్ణాటక (బెంగళూరు సమీపంలో) సంస్థ పనిచేస్తున్నది. ఫాక్స్‌కాన్‌ సంస్థ ఎలక్ట్రానిక్స్‌ తయారుచేసే వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా 1,00,000 ఉద్యోగాలను కల్పిస్తామనే హామితో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందంపై సంతకం చేసింది. మొదటి దశలో, వొచ్చే రెండేళ్లలో 25000 ఉద్యోగాలు కల్పించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, సిఎస్‌ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు, ఫాక్స్‌కాన్‌ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *