ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 11 : గృహలక్ష్మి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తుందని ఈ విషయంలో అనుమానాలకు అపోహలకు తావు లేదని బిఆర్ఎస్ జిల్లా నాయకుడు గుత్తి బాలస్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకాన్ని రాజకీయం చేయడం తగదని ఆయన కోరారు. ఆమనగలు పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుత్తి బాలస్వామి మాట్లాడుతూ… నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అర్హులైన నిరుపేదలందరికీ ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని, మొదటి విడత పూర్తికాగానే రెండో విడత మరికొంతమందికి ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని చెప్పారు. గృహలక్ష్మి పథకం కింద మొదటి విడత ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందికి మూడు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని బాలస్వామి పేర్కొన్నారు. గృహలక్ష్మి పథకం సహాయానికి పేదలు సంబంధిత అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు.




