బాన్సువాడ పల్లె ప్రగతిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్
కామారెడ్డి, ప్రజాతంత్ర, జూన్ 11 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా తెలంగాణ గ్రామాలు దేశానికి ఆదర్శంగా తయారయ్యాయని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకు వలసలు ఉండేవని, ఇప్పుడు అవి తగ్గి ప్లలెలకు వలస మొదలైందన్నారు. ఐదో విడత పల్లె ప్రగతిలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ గ్రామాల్లో అన్ని సదుపాయాలు సమకూరుతున్నాయని, సర్వాంగ సుందరంగా తయారయ్యాయని చెప్పారు.
గ్రామంలో పచ్చదనం పెంచేందుకు నర్సరీలు, డంపింగ్ యార్డులు, చెత్తను వేరు చేసే పద్ధతి, అంతిమ సంస్కారాలకు వైకుంఠ ధామాల వంటివి పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. గ్రామాల్లో రైతు వేదికలు, కల్లాలు, రైతులకు ఎదురు పెట్టుబడి, రైతు బీమా, పెన్షన్లు, ప్లలె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, ఇలా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసిన సందర్భంగా గతంలో ఎప్పుడూ లేదని, సీఎం కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైందని మంత్రి చెప్పారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నయా పైసా బాకీలేకుండా ఇచ్చేసిందని చెప్పారు. కేంద్రం నుంచి రూ.1450 కోట్ల నిధులు రావాల్సి ఉందని వెల్లడించారు. పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు ఇక్కడి గల్లీల నుంచి ఢిల్లీకి చేరాయన్నారు. ఈ ప్రగతి ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని, దానికి తగినట్లుగా అవసరమైన నిధులు ఇస్తున్నారని చెప్పారు.
పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది-ఎమ్మెల్సీ కవిత కరోనా కారణంగా కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పెన్షన్, రైతు భీమా, రైతు బంధు, లాంటివి ఎక్కడా ఆగలేదు చెప్పారు. ప్లలెలు బాగుంటేనే దేశం బాగుంటుందని అనేక మంది మాటలు చెప్పారు తప్ప, ప్లలెల కోసం ఎవరూ ప్రణాళిక వేసుకొని పనిచేయలేదన్నారు. స్వాతంత్య్ర వచ్చిన ఇన్ని ఏండ్లకు, మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రమే, ప్లలె బాగుపడాలె, ఆరోగ్యంగా ఉండాలని , ప్లలెలు పరిశుభ్రంగా ఉండాలని సీఎం కేసీఆర్ పల్లె ప్రగతిని ప్రారంభించినట్లు చెప్పారు. ఒక ఇళ్లు ఎలా పరిశుభ్రంగా ఉంటుందో, పల్లె కూడా పరిశుభ్రంగా ఉండాలని సీఎం కేసీఆర్ భావించారన్నారు. రాష్ట్రం నుండే పాలన జరగడం కాదని, అధికార వికేంద్రీకరణ ద్వారానే పల్లెల్లో ఉండే సర్పంచ్ లు, ఎంపీటీసీలు , స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల్లో మా ఊరికి ఏం కావాలో మేమే తేల్చుకుంటాం అనే అధికారాన్ని ఇచ్చి, అధికారంతో పాటు నెలనెలా ఠంచనుగా డబ్బులు కూడా ఇచ్చి పల్లెలను బాగు చేసి కార్యక్రమం దేశం మొత్తంలో కేవలం తెలంగాణలో జరుగుతుందన్నారు. కరోనాతో మూడేండ్లు ఇబ్బంది పడ్డా, ఒక్క పూట కూడా మిషన్ భగీరథ నీళ్లు ఆగలేదని వివరించారు. ఒక్కపూట కూడా కరెంటు పోలేదని, రైతు బంధు, పెన్షన్ ఆగలేదన్నారు. ఇది కేవలం మన నాయకుడి పట్టుదలతోనే సాధ్యమైంది.వచ్చే నెల నుండి 57 ఏండ్లకే పెన్షన్ ను కూడాప్రారంభించుకుందామన్నారు.



