మూడు పంటల విధానమా..మూడు గంటల కరెంటా
రైతులతో విస్తృతంగా చర్చించి తీర్మానాలు చేయాలి
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు ఉండాలి
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై15: రాష్ట్రవ్యాప్తంగా పదిరోజుల పాటు రైతులతో సమావేశాలు నిర్వహించి ఉచిత విద్యుత్‌పై చర్చించాలని అధికార బిఆర్‌ఎస్ నిర్ణయి ంచింది. ఈ మేరకు బీఆర్‌ఎస్ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ రైతు వేదిక వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు బీఆర్‌ఎస్ రైతు సమావేశాలు నిర్వహిం చాలన్నారు. 3 పంటలు బీఆర్‌ఎస్ నినాదం.. 3 గంటల కరెంటు కాంగ్రెస్ విధానం పేరిట సభలు నిర్వహించాలని సూచించారు. రైతులకు కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పేలా తీర్మానాలు చేయాలన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్‌కు మద్దతిస్తే ఉచిత విద్యుత్ రద్దే అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎకరానికి గంట విద్యుత్ చాలనటం రైతులను అవమానించడమే అని అన్నారు. 24 గంటల విద్యుత్ వద్దన్న కాంగ్రెస్ కుట్రను రైతులకు వివరించాలని సూచించారు. కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా..? వెలుగు జిలుగుల బీఆర్‌ఎస్ కావాలా..? తెలంగాణ రైతులు తేల్చుకోవాల్సిన తరుణమిది అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని రైతుల సమక్షంలో చర్చించాలన్నారు. ప్రతీ రైతువేదిక వద్ద రైతు సమావేశాలు నిర్వహంచాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. 3 పంటలు బిఆర్‌ఎస్ నినాదం- 3 గంటల కరెంట్ కాంగ్రెస్ విధానం పేరిట సభలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో తన వ్యాఖ్యలతో దుమారం రేపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అవసరం లేదని పేర్కొంటూ రెడ్డి చేసిన ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దారితీసింది. ఈ క్రమంలో ఇప్పటికే బిఆర్‌ఎస్ ఆందోళనలకు దిగింది. దిష్టిబొమ్ములు దగ్ధం చేసింది. తాజాగా రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.



