పంద్రాగస్టులోగా రూ.2 లక్షలు రైతు రుణమాఫీ

  • చేయకుంటే రాజీనామా చేస్తవా అంటున్నవ్‌…చేస్తే పార్టీని రద్దు చేసుకుంటవా హరీష్‌
  • కేసీఆర్‌ పాలనతో అప్పుల కుప్పగా తెలంగాణ
  • అరుణమ్మ మోదీ చేతిలో కత్తిగా మారి పాలమూరు కడుపులో పొడవొద్దు..
  • వంశీచంద్‌ రెడ్డికి 50 వేల మెజారిటీ ఇవ్వండి..
  • కొడంగల్‌ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  
కొడంగల్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 23 : పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కొడంగల్‌ నియోజక వర్గ స్థాయి కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో సీఎం మాట్లాడారు. కొడంగల్‌ నియోజక వర్గంలో కార్యకర్తలు నాటిన మొక్క.. నేడు తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిందని అన్నారు. కొడంగల్‌ నియోజకవ ర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి ఏక కాలంలో ఇచ్చిన ఘనత సోనియమ్మదని కొనియాడారు. చేయి చాచి అడిగే పరిస్థితి నుంచి ఇవాళ ఎవరికి ఏం కావాలో ఇచ్చే స్థాయికి కొడంగల్‌కు కాంగ్రెస్‌ పార్టీ అవకాశమిచ్చిందని తెలిపారు. కార్య కర్తలే  కథానాయకులై తనను 33 వేల మెజారిటీతో గెలిపించారన్నారు. కొడంగల్‌ను దొంగ దెబ్బ తీయాలని బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు కుట్ర చేస్తున్నారని, వాటిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత కొడంగల్‌ ప్రజలపై ఉందన్నారు. ఆనాడు నారాయణపేటకు ఎత్తిపోతల రాకుండా అడ్డుకున్నది డీకే అరుణ అని ఆరోపించారు.
ఇప్పుడు డీకే అరుణ వోట్లు అడగడానికి వొస్తున్నారని, శత్రువు చేతిలో చుర కత్తిగా మారి పాలమూరు కడుపులో ఎందుకు పొడుస్తున్నవని మాత్రమే తాను అరుణను ప్రశ్నించానని తెలిపారు. నరేంద్రమోదీ చేతిలో కత్తిగా మారి పాలమూరు కడుపులో పొడవద్దని కోరారు. పాలమూరు బిడ్డలు నూటికి నూరు శాతం తనకు అండగా నిలబడ్డారని, అలాంటి తనకు అరుణ మీద అసూయ, కోపం ఎందుకుంటుందని ప్రశ్నించారు. తనకు నామెకూకు పోటీ ఏంటి..పొంతనేంటని దుయ్యబట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తనకు శత్రువులు.. ప్రత్యర్ధులు లేరని, పాలమూరు అభివృద్ధి కోసమే తన తపనంతా అని, 70 ఏళ్ల తరువాత పాలమూరుకు వొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రేవంత్‌ రెడ్డి కోరారు. తనకు  అండగా నిలబడండని, పాలమూరును రాబోయే వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని… పాలమూరు అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు. వందరోజుల్లోనే తమను కేసీఆర్‌ దిగిపొమ్మంటున్నారని, పదేళ్లు ప్రజలను మోసం చేసిన ఆయన చెంపలు వాయించాలని ధ్వజమెత్తారు.
తాగుబోతు కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, రూ.3900 కోట్ల లోటు బడ్జెట్‌తో తాను సీఎంగా బాధ్యత తీసుకున్నానని, తాను వొచ్చాక నాలుగు నెలలల్లో 26 వేల కోట్లు వడ్డీలు కట్టినట్లు చెప్పారు. అసెంబ్లీకి వొన్తే తాను లెక్కలు చూపిస్తానని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ తో 45 లక్షల ఇళ్లల్లో వెలుగు నింపుతున్నామని తెలిపారు. సేవాలాల్‌ సాక్షిగా పంద్రాగస్టులోగా రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని రేవంత్‌ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని హరీష్‌ మాట్లాడుతున్నాడని, ఇదే వేదికగా తాను హరీష్‌ రావుకు సవాల్‌ విసురుతున్నానని, పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే నీ పార్టీని రద్దు చేసుకుంటావా..అంటూ ప్రశ్నించారు. తాను మాట ఇస్తే ఎలా ఉంటుందో వెళ్లి ఆయన మామను అడగాలని చెప్పారు. బీజేపీ నేతలకు పిచ్చి ముదిరి మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, వారి మాయలో పడొద్దని కోరారు. కొడంగల్‌ నుంచి వంశీచంద్‌ రెడ్డిని 50 వేల మెజారిటీతో గెలిపించాలని సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *