- రికార్డ్ స్థాయిలో కురుస్తున్న వర్షాలు
- 3 వంతు ప్రజలపై గాబ్రియెల్ ప్రభావం
ఆక్లాండ్, ఫిబ్రవరి 14 : న్యూజిలాండ్‌లో గాబ్రియెల్ తుఫాన్ విధ్వంసం సృష్టిస్తోంది. భారీ వర్షానికి తోడు భీకర గాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. దీంతో వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. నార్త్ ఐలాండ్, ఆక్లాండ్‌లో గాబ్రియెల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. రికార్డ్ స్థాయిలో కురుస్తున్న వర్షాలు, వరదలతో విలవిలలాడుతున్నారు ప్రజలు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతికి ఓ బ్రిడ్జి కొట్టుకుపోయింది. భారీ వరదలకు ఇప్పటివరకు నలుగురు మృతి చెందారు. ఇక పలు విమానాలు రద్దయ్యాయి. స్కూల్స్‌కు సెలవులు ప్రకటించారు.
పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. తుపాన్ ప్రభావంతో సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఆక్లాండ్ తీరంలో గంటకు 159 కిలోమీటర్ల మేర గాలులు నమోదయ్యాయని మెట్‌సర్వీస్ తెలిపింది. ఈ తుపాన్ భూమికి దగ్గరగా ఉన్నందున గాలులు మరింత తీవ్రతరమయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖాధికారులు. తుఫాన్ ఇవాళ తీరం దాటే అవకాశముందని..ఆ సమయంలో పెనుగాలులు వీచే అవకాశముందని తెలిపింది వాతావరణశాఖ. అలాగే కుండపోత వానలు పడతాయని..అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. తుఫాన్ తీవ్రత నేపధ్యంలో ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది . పలు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చెయ్యాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో ఈ అత్యవసర పరిస్థితుల్లో తమ వెంట ఏ ఏ వస్తువులు తీసుకెళ్లాలో జాతీయ విపత్తుల నిర్వహణ వ్యవస్థ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తోంది. అక్లండ్‌లో ముందు జాగ్రత్తగా 50 అపార్మెంట్లలోని కుటుంబాలను ఖాళీ చేయించారు. ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా అవి ఎప్పుడైనా కుప్పకూలే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాటిల్లో 109 ఏళ్ల క్రితం నిర్మించిన మౌంట్ ఎడిన్ స్టీల్ టవర్ కూడా ఉంది. గాబ్రియెల్ తుపాను ప్రభావం న్యూజీలాండ్ జనాభాలో సుమారు మూడోవంతు మందిపై ఉండబోతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వందలాది విమానాలను రద్దు చేశారు. పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు.
తుపాను ప్రభావం సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉండబోతోందని అధికారులు వెల్లడించారు. గాబ్రియెల్ తుపాను ప్రభావంతో తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు కురుస్తాయి. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం చెట్లు కూలిపోయాయి, రోడ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ వ్యవస్థ స్తంభించింది. తీవ్రమైన గాలులు, భారీ వర్షాల కారణంగా అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి. అలాగే అత్యవసర సేవలందించే సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలని జాతీయ విపత్తుల నిర్వహణ అధికారి తెలిపారు. ఓ వైపు తుపాను ముప్పు కొనసాగుతుండగానే మరోవైపు న్యూజీలాండ్‌ను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 6.1గా భూకంప తీవ్రత నమోదయ్యిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.



