ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11 : తెలంగాణ ఉద్యమంలో నిత్యం శ్రమించిన తన వ్యవసాయ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేయడమే కాకుండా తమ కుటుంబాన్ని హతమారుస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తుల నుంచి తమను, తమ ఆస్తులను రక్షించాలని బాధితుడు జగిత్యాల జిల్లా కధలాపుర్ మండల తెలంగాణ జేఏసీ చైర్మన్ పోడేటి పాల్ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ మేరకు శుక్రవారం హైదర్ గూడ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధనలో ఎన్ని కష్టాలు వచ్చినా ఉద్యమాన్ని ముందుకు నడిపానని గుర్తు చేశారు. గత రెండు నెలలుగా అదే మండలంలోని తక్కళ్ళపల్లి గ్రామంలోని సర్వే నెం.380/16/1 లోగల తన ఐదెకరాల లావణి పట్టా భూమిని ఆ గ్రామ సర్పంచ్ భర్త మూలిగె శ్రీనివాస్(బిజెపి), అతని సోదరుడు ములిగె సుదర్శన్(పత్రిక విలేకరి)లు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూ పొలంలోని పంటలను సైతం సర్వనాశనం చేశారని ఆరోపించారు. ఇదే విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. తాను కోర్టును ఆశ్రయించగా కేవియెట్ జారీ చేసిందన్నారు. తమ కేసు వాదిస్తున్న న్యాయవాదికి సుదర్శన్ ఫోన్ చేసి తనను హతమారుస్తానని, సర్వే అధికారిపై సైతం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడని ఆ ఫోన్ రికార్డులు సైతం ఉన్నాయని తెలిపారు. అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడని సుదర్శన్ పై ఆరోపణలు ఉన్నాయని, అధికారులను విచారణ జరిపించాలన్నారు. సర్పంచ్ భర్త, అతని సోదరుడిపై వెంటనే చర్యలు తీసుకొని ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో తమ కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యం అని పాల్ అన్నారు.




