నేడు రాష్ట్రంలో పట్టణ ప్రగతి దినోత్సవం

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా…

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం పట్టణ ప్రగతి దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌తో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ ‌కార్పొరేషన్లు, ఆయా మున్సిపాలిటీల కార్యాలయాల్లో పట్టణ ప్రగతి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో ఉత్తమ మున్సిపాలిటీ, కార్పొరేషన్ల వార్డు కౌన్సిలర్లకు, చైర్మన్లకు, మేయర్లకు, ఉద్యోగులకు సన్మానం చేయనున్నారు. ఆయా మున్సిపాలిటీలలో చేపట్టిన అభివృద్ధి పనులు, కార్యక్రమాలు, పట్టణ పారిశుద్ధ్యం, పచ్చదనం గణనీయంగా మెరుగుపడిన తీరును వివరించ నున్నారు. జాతయ స్థాయిలో పట్టణ అభివృద్ధిలో సాధించిన అవార్డుల వివరాలను కూడా ఈ ఉత్సవాలలో ప్రదర్శించనున్నారు.

రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌ ‌శిల్పకళా వేదికలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్‌ ‌పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కె.టి.రామారావు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. రాష్ట్రంలోని అన్ని అర్బన్‌ ‌మున్సిపాలిటీలలో ఉత్తమ మున్సిపల్‌ ‌కార్మికులను ఘనంగా సన్మానించనున్నారు. ప్రతీ మున్సిపాలిటీలలో ర్యాలీలు నిర్వహించి, టీ.ఎస్‌ ‌బీపాస్‌,  ‌తొమ్మిదేళ్లలో పట్టణ స్థానిక సంస్థలు సాధించిన ప్రగతిని తెలియచేస్తారు. హైదారాబాద్‌ ‌లో  కొత్తగా ఏర్పాటు చేసిన వార్డ్ ‌కార్యాలయాలను మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రారంభిస్తారు. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో జరిగిన అభివృద్ధిని బుక్‌ ‌లెట్లు, వీడియో చిత్రాల ద్వారా వివరిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *