- కెసిఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం సమావేశం
- జాతీయ రాజకీయాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం
- భేటీపై సర్వత్రా చర్చ…మరోమారు సమావేశం కావడంపై ఆసక్తి
హైదరాబాద్, ప్రజాతంత్ర: వరుసగా రెండోసారి టిఆర్‌ఎస్ కార్యవర్గ భేటీ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీలో ఏం చర్చిస్తారన్నదానిపై టిఆర్‌ఎస్ నేతలు పరస్పరం చర్చించు కుంటున్నారు. దసరారోజు ఓ మారు భేటీ అయిన కార్యవర్గంలో టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో మరోమారు భేటీ కావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఏమై ఉంటాయన్న ఆలోచనలో పడ్డారు. 15న మధ్యాహ్నం రెండు గంటలకు టీఆర్‌ఎస్ ముఖ్య నేతలందరితో సమావేశంఅవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులంతా ఈ సమావేశానికి హాజరుకావాలని కేసీఆర్ ఆదేశించడంతో ఏం జరగనుందోన్న ఆసక్తి తెలంగాణ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఈ సమావేశాన్ని ఇటు టీఆర్‌ఎస్ శ్రేణులతో పాటు, అటు ప్రతిపక్షాలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి. రాజకీయంగా ఏదో కీలక నిర్ణయం తీసుకునే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ సమావేశం నిర్వహిస్తున్నారని మాత్రం స్పష్టమైంది. నిజానికి ఇటీవలి పరిణామాలే ప్రధాన ఎజెండాగా సమావేశం ఉంటుందని భావిస్తున్నారు. కేంద్రం తీరుతో ఆగ్రహంగా ఉన్న కెసిఆర్ ఐటి, ఇడి దాడులను కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోళ్లు, మునుగోడు విజయం,ఐటి, ఇడి దాడులు, ప్రధాని మోడీ విమర్శలు కూడా నేటి సమావేశంలో కీలక చర్చకు దారితీయవచ్చని అనుకుంటున్నారు. అయితే కేసీఆర్ వ్యూహరచన తలలు పండిన రాజకీయ నేతలకు కూడా అంతుచిక్కని రీతిలో ఉంటుందని చాలా సందర్భాల్లో రుజువైంది. జాతీయ పార్టీగా బీఆర్‌ఎస్‌కు దాదాపుగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో టీఆర్‌ఎస్ ముఖ్యులందరితో సమావేశం నిర్వహించాలని తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమావేశంలో కేసీఆర్ ప్రధానంగా చర్చించే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు విస్తృతంగా సాగుతున్నాయి. కేసీఆర్ మరోసారి ముందస్తుకు వెళ్లే ఉద్దేశంతోనే, అందుకు సంబంధించి టీఆర్‌ఎస్ నేతలకు దిశానిర్దేశం చేసే ఆలోచనతోనే ఈ సమావేశానికి పిలుపునిచ్చారనే చర్చ కూడా వి•డియాలో జోరుగా సాగుతోంది. ముందస్తుకు వెళ్లడం వల్ల టీఆర్‌ఎస్ మరోసారి అలవోకగా అధికారాన్ని కైవసం చేసుకుంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే ముందస్తుకు వెళ్లేది లేదని గతంలోనే కెసిఆర్ కుంబబద్దలు కొట్టారు.
మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా ఇప్పుడే ఎన్నికలకు వెళ్లమని కూడా చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీఅని నిర్ణయానికొచ్చిన టీఆర్‌ఎస్ అధినేత అందుకు పార్టీ నేతలను సన్నద్ధం చేసే విషయం కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో బీజేపీకి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేకపోవడం, ప్రజల్లో కాంగ్రెస్‌కు ఎదురవుతున్న నిరాదరణ వంటి పరిణామాల కారణంగా ఆయా నియోజక వర్గాల్లో పార్టీ బలోపేతం పైనా దిశానిర్దేశం చేయనున్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్ గెలిచినప్పటికీ బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత వొచ్చే ఎన్నికలపై ప్రభావం చూపే స్థాయిలో ఉందని పసిగట్టిన కేసీఆర్ ఆ ప్రభావాన్ని వీలైనంత తగ్గించే దిశగా ఉన్న మార్గాలను అన్వేషించే పనిలో పడ్డారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించేందుకే సమావేశం నిర్వహించారని అంటున్నారు. మొత్తంగా నేటి సమావేశంలో ఏం చర్చిస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.




