నేటి నుండి బతుకమ్మ పండుగ ఉత్సవాలు షురూ

  • ఊరూవాడా ఇక బతుకమ్మ సందడి
  • నేడు ఎంగిలి పూల బతుకమ్మ…22న సద్దుల బతుకమ్మతో ముగియనున్న ఉత్సవాలు

వరంగల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13 : ‌పూలపండగ బతుకమ్మకు తెలంగాణలో రంగం సిద్దం అయ్యింది. శనివారం నుంచి ఇక ఊరూవాడా బతుకమ్మ వేడుకలతో ఆడపడచుల సందడి కానరానుంది. పూలను బతుకమ్మగా కొలిచే అద్వితీయ సంప్రదాయం కేవలం తెలంగాణకే సొంతం. బతుకమ్మలో ఉపయోగించే గునుగు, తంగేడు, గుమ్మడి లాంటి అనేక పుష్పాలు చెరువు నీటిని శుద్ధి చేస్తాయి. పండుగ కొనసాగుతున్న రోజుల్లో పంచే ఫలహారాలలో ఖనిజ, విటమిన్‌ ‌పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. లయబద్ధమైన పాదపు కదలికలు, లలితమైన చప్పట్ల మోతలు, అద్భుతమైన సారస్వత విలువలు గల పాటలతో… రసరమ్య మోహన గీతాలతో ఒక అలౌకిక ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. ప్రేమలు, ఆప్యాయతలు, మానవ సంబంధాలను చిక్కబరిచే బతుకమ్మ చిరకాలం వర్ధిల్లుతూనే ఉంటుంది.

ఏటా బతుకమ్మను పూలతో పేర్చి మధ్యలో గౌరమ్మని తలపించేలా పసుపుముద్దను పెడతారు. పరమేశ్వరుడి కోసం అమ్మవారు ఎదురుచూస్తుందని..జాములు గడిచినా శివుడు ఇంకా రాలేదంటూ పాట పాడతారు. ఏటా ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వొచ్చే అమావాస్య అంటే భాద్రపద అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. అంటు వ్యాధులు, కరువు కాటకాల బారి నుంచి ప్రజల్ని కాపాడాలని ప్రార్థిస్తూ ప్రకృతి గౌరిని ఆటపాటలతో పూజించే వేడుకే బతుకమ్మ. తెలంగాణ పల్లెల్లో ప్రతీ ఒక్క ఆడపడుచు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఈ పండుగ వైభవాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. పల్లె పల్లెల్లో జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు ఎల్లలు దాటి దేశ విదేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు. నేటి నుంచి 22 అక్టోబర్‌ ‌వరకూ బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *