నిర్వాసిత రైతు కుటుంబాలను ఆదుకోండి

  • భవిష్యత్తులో రైతులు భూమిలేని కూలీలుగా మారే ప్రమాదం
  •  దళితులు.. బలహీన వర్గాల అసైన్డ్‌ భూముల రైతుల ఆందోళన
  •  తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల వేదిక డిమాండ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్‌ దగ్గర లోని జరాసంఘం, నాయకల్‌ మండలాలలో 12,634 ఎకరాల భూమిని సేకరించి, నేషనల్‌ ఇండస్ట్రీయల్‌ మేనేజిమెంట్‌ జోన్‌(నిమ్జ్‌) పరిశ్రమలు స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి, అందుకు కావలసిన ఏర్పాట్ల ప్రక్రియ ప్రారంభించిందని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల వేదిక పేర్కొంది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేస్తూ…తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు కోసం భూసేకరణ చేసే ప్రక్రియ ప్రారంభించింది. ఈ మొత్తం భూమిలో 9 వేల ఎకరాల పట్టా భూమి పోను , దాదాపు 3,500 ఎకరాల అసైన్డ్‌ /ప్రభుత్వ భూమి ఉంది. దళితులు, బలహీన వర్గాలకు చెందిన రైతులు చాలా కాలంగా ఈ భూముల్లో  మెట్ట  పంటలు పండి స్తున్నారు.

ప్రభుత్వం ముందుగా, దళితులకు, బలహీన వర్గాలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములు సేకరించే ప్రయత్నం  చేసింది. పట్టా భూములకు ఇచ్చిన ధర కంటే  పేద రైతులు అభివృద్ధి చేసిన ఈ భూములకు తక్కువ నష్ట పరిహారం చెల్లించారని పేర్కొన్నారు. తీవ్ర నిర్భంధ పద్ధతుల్లో బలవంతంగా పోలీసుల సహాయంతో భూ సేకరణ జరిపించారు. పలుమార్లు నిరసన చేస్తున్న రైతులను అక్రమమగా అరెస్ట్‌ చేశారు. మంత్రులు హరీష్‌ రావు, కెటి రామారావు జహీరాబాద్‌కు ఏ కార్యక్రమానికి వొచ్చినా, ముందస్తుగా ఈ రైతులను పోలీస్‌ స్టేషన్లకు తరలించి ఆ నాయకులు వెళ్లి పోయిన తరువాత విడిచిపెట్టేవారు. ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడిపే తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులను కలిసి వివరాలు సేకరించడానికి 9 మంది సభ్యులతో కూడిన(ఎస్‌.జీవన్‌ కుమార్‌, వి.తిరుపతయ్య, వి.బాలరాజు, రోహిత్‌, వెంకటనారాయణ, సురేష్‌, చందు, ఎం.బాలయ్య, మల్లేష్‌) మానవ హక్కుల వేదిక బృందం, జహీరాబాద్‌ నిఫ్టీ ప్రభావిత 10 గ్రామాలను ఈ నెల 10న (ఆదివారం) పర్యటించి బాధితులను కలిసి వివరాలు సేకరించింది. ప్రభుత్వం ముందుగా, దళితులకు, బలహీన వర్గాలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములు సేకరించే ప్రయత్నం చేసిందని వెల్లడిస్తూ కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. నివేదికలో వారు పొందుపరిచిన వివరాలు, వారు చేస్తున్న డిమాండ్లను పరిశీలిస్తే…

1. ఎల్గోయీ గ్రామంలోని సర్వే నంబర్‌ 54, 125 ల్లో గల మూడు వేల ఎకరాల పైగా భూమిని ఇప్పటికే ప్రభుత్వం గత ఏడెనిమిదేండ్ల కాలంలో సేకరించింది. ఇందులో అధిక భాగం అసైన్డ్‌ భూమి. ఈ సేకరణ అంతా జీవో 123 అనే అక్రమ జీవో ద్వారా అన్యాయంగా, భూమి స్వంతదారులను భయ బ్రాంతులకు గురిచేస్తూ జరిగింది. హైకోర్టు ఆ జీవోను కొట్టివేసిన కారణంగా ఆ జీవో సహాయంతో జరిగిన భూ సేకరణ ఒప్పందాలను మొత్తం రద్దు చేసి, తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసి, అదే భూమిని 2013 భూ సేకరణ చట్టం ప్రకారం సేకరించాలి. కొత్త ధరల ప్రకారం వారికి పరిహారం చెల్లించాలి.

2. ఎల్గోయీ గ్రామానికి చెందిన ఐదువందల ఎకరాల తమ వ్యవసాయ భూమిని రైతులు ఇప్పటి వరకు నిమ్జ్‌కి ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వటానికి వారు సిద్దంగా లేరు. కాబట్టి ప్రభుత్వం ఆ భూమిని బలవంతంగా సేకరించవద్దని ఆ గ్రామ రైతులు కోరుతున్నారు.

3. భూమిని కోల్పోయే రైతులు భవిష్యత్తులో భూమి లేని కూలీలుగా మారే ప్రమాదం ఉన్నందున గ్రామానికి సాధ్యమైనంత సమీపంలో అవసరమైన భూమిని ప్రభుత్వమే కోనుగోలు చేసి భూమిని కోల్పోయే ప్రతీ నిర్వాసిత కుటుంబానికీ రెండెకరాల వ్యవసాయ భూమిని అందించాలి.

4. ప్రతీ నిర్వాసిత కుటుంబానికీ కోల్పోయే ఒక ఎకరం వ్యవసాయ భూమికి ఒక గుంట నివాస స్థలం చొప్పున పునరావాస సహాయం అందివ్వాలని రైతులు కోరుతున్నారు.

5. నిమ్జ్‌లో ఉత్పన్నం కాగల ఉద్యోగాల్లో నిర్వాసిత కుటుంబాల్లోని, స్థానిక ప్రాంతంలోని అర్హులకు తప్పని సరిగా ఉద్యోగ అవకాశం ఉంటుందనే లిఖిత పూర్వక ఒప్పందం ఉండాలి.

6. ఇంకా నిమ్జ్‌లో ఎటువంటి పరిశ్రమల పనులు ప్రారంభం కాలేదు కాబట్టి, అంత వరకు ఆ భూములు పడావు ఉండకుండా అప్పటిదాకా ఆ భూముల స్వంత దారులైన రైతులను వ్యవసాయం చేసుకోవటానికి స్వేచ్ఛగా అనుమతించాలని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు ఎస్‌. జీవన్‌ కుమార్‌, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎస్‌. తిరుపతయ్య, నగర కమిటీ అధ్యక్షుడు వి. బాల రాజు, సంస్థ సభ్యులు రోహిత్‌, వెంకట్‌ నారాయణ, సురేష్‌, అచ్యుత్‌, ఎం. బాలయ్య, మల్లేష్‌ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *