నిర్లక్ష్యానికి గురవుతున్న ‘బాగ్‌ ఎ ఆమ్‌..’

  • పేలవంగా నిర్వహణ..డంపింగ్‌ ‌గ్రౌండ్‌గా మారిన నాంపల్లి పబ్లిక్‌ ‌గార్డెన్‌ !
  • ‌కొరవడిన సుందరీకరణ
  • పట్టించుకోని అధికార యంత్రాంగం…అవస్థల్లో ప్రజలు
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 2 : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ఇప్పుడు సుందరీకరణ వైపునకు పరుగులు పెడుతుంది. ఎక్కడ చూసినా అందాల హరివిల్లులా చూడచక్కని ప్రదేశాలు ఆహా..ఓహో…అనిపించేలా పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి. మరచిపోలేని విధంగా కనువిందు చేస్తున్నాయి. పర్యాటకులు సరే..మరి ప్రజల పరిస్థితుల మాటేమిటి? అని ఆలోచిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవలసిందే. అసలు విషయంలోకి వొస్తే.. మన హైదరాబాద్‌  ‌నాంపల్లి పబ్లిక్‌ ‌గార్డెన్‌ ‌పార్క్ ‌నిర్వహణ చూసిన ప్రతీ ఒక్కరూ..‘ఇదేం పార్కురా బాబోయ్‌..’ అనక మానరు! మరి పాలకులు పదే పదే చెబుతున్న సుందరీకరణ మాటల్లో నిజమెంతుందో వారికే తెలియాలి. తెలంగాణ శాసనసభను ఆవరించి ఉన్న ఈ పార్కుకు ఎంతో చారిత్రక ప్రాముఖ్యం ఉంది. ప్రభుత్వం సైతం ఈ పార్కును పూర్తిగా మరచిపోయిందని..ఫలితంగా దయనీయస్థితికి చేరుకుని దుర్గంధం వ్యాపిస్తుందని పర్యావరణ.. స్వచ్ఛ హైదరాబాద్‌ ‌కార్యకర్త మహమ్మద్‌ అబిద్‌ అలీ ‘ప్రజాతంత్ర’ ప్రతినిధితో మాట్లాడుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పార్కులో ఎక్కడవేసిన చెత్త అక్కడే ఉంటుంది. జిహెచ్‌ఎం‌సి సిబ్బంది కనీసం గార్డెన్‌ ‌వైపుకునకు చూడడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఉద్యానవనం విచ్చలవిడి జంతువులకు మేతగా మారిందనొచ్చు! ఈ పార్కుపై సరైన నిర్వాహణ లేకపోవడతో చుట్టూ బాణాలు..చెత్తా చెదారంతో పూర్తి డంపింగ్‌ ‌గ్రౌండ్‌గా మారింది.
ఈ పార్కు సుందరీకరణ కోసం ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ఈ పబ్లిక్‌ ‌గార్డెన్‌ ‌పార్కును హార్టీ కల్చర్‌ ‌డిపార్ట్ ‌మెంట్‌ ‌నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అపరిశుభ్రతతో రోజురోజుకూ ఈ పార్కు కడు దయనీయంగా మారుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇటు అధికారులు..అటు పాలనా యంత్రంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడంతో పబ్లిక్‌ ‌గార్డెన్‌ ‌పార్క్ ‌నిర్వహణ పూర్తిగా అటకెకెక్కిందనే చెప్పొచ్చు. చారిత్రక, వారసత్వ ఐకానిక్‌ ‌బ్రాండ్‌ ‌పేర్లు ప్రభావితం అవడమేకాదు..చెత్త సేకరణ సమస్యలపై ఓ వైపు హార్టీ కల్చర్‌ ‌డిపార్ట్ ‌మెంట్‌..‌మరో వైపు జిహెచ్‌ఎం‌సి ఈ రెండు విభాగాలు డేంజర్‌ ‌జోన్‌ ‌లోకి వెళ్లాయి. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో పబ్లిక్‌ ‌గార్డెన్‌ ‌పార్కులో ఎన్నో మొక్కలు నాటింది. అయినా ఫలితం లేదు. కనిపించే తోట, మొక్కలు, గడ్డి కోసం సరైన నీరు లేక పూర్తిగా ఎండిపోయింది. మానవ నిర్మిత చెరువు నిర్వహణ లేక ఆలనాపాలనా కరువైంది. ఈ చెరువును 1868 ఏడీలో హైదరాబాద్‌ 7‌వ నిజం ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ‌నిర్మించారు. ఉద్యానవనాలు, పురావస్తు ప్రదేశాలు మన సాంస్కృతిక, పర్యావరణ వారసత్వానికి ఎంతో అవసరమైనవి. అవి వినోదం,  విద్యా అవకాశాలను అందిస్తాయి.
అయితే, ఈ సున్నితమైన ప్రదేశాల్లో వాణిజ్య వాహనాల ఉనికి వాటి సంరక్షణ, స్థిరత్వానికి గణనీయమైన సవాళ్లను సంభావ్య ప్రమాదాలను కలిగిస్తుంది. పార్కులు, పురావస్తు భవనాలలో వాణిజ్య వాహనాల వల్ల కలిగే ప్రభావాలు..నష్టాలు  ఉన్నాయన్నది మరచిపోకూడదు. పార్కులు,  పురావస్తు భవనాలను సంరక్షించడం అనేది ఒక సమష్టి బాధ్యత, ఈ విలువైన ఆస్తులపై వాణిజ్య వాహనాల ప్రభావం గురించి సమగ్ర అవగాహన ఎంతో అవసరం. సంభావ్య పర్యవసానాలను గుర్తించడం, తగిన ఉపశమన వ్యూహాలను అనుసరించడం ద్వారా, ఆర్థిక కార్యకలాపాల మధ్య సమతుల్యతను సాధించగలిగి భవిష్యత్‌ ‌తరాలు ఆనందించడానికి, నేర్చుకోవడాం ద్వారా మన సాంస్కృతిక, పర్యావరణ వారసత్వాన్ని కాపాడుకోవచ్చు. ఈ గార్డెన్‌ ‌లోని చాలా వరకు చెట్లు 150 సంవత్సరాల వయస్సులో ఉన్నాయి..ఇవి ఎంతగానో  ప్రభావం చూపుతాయి. ప్రతిరోజూ 3000 నుండి 5000 వరకు నడిచేవారికి కూడా ఇవి  సమస్యలను కలిగించొచ్చు.
కాబట్టి ఈ చెట్లను పరిశీలించవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఈ సమస్యను ఆందోళనల రూపంలో ప్రజలు లేవనెత్తినా..పబ్లిక్‌ ‌గార్డెన్‌, ‌మ్యూజియంల కేర్‌టేకర్‌ ‌విభాగాలు ఖచ్చితమైన చర్యలు ఏ మాత్రం తీసుకోలేకపోగా అశ్రద్ధ వహించారు. అలాగే తెలంగాణ శాసనసభ పక్కన, హైదరాబాద్‌ ‌నగరం నడిబొడ్డున ఉన్న నాంపల్లిలోని 150 ఏళ్ల నాటి ఈ పబ్లిక్‌ ‌గార్డెన్‌ ‌పార్కులో వాణిజ్య, ట్రావెల్స్ ‌వాహనాల పార్కింగ్‌ను రక్షించడానికి,  ఆపడానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రికి కేసీఆర్‌, ‌సంబంధిత శాఖలకు వినయపూర్వకమైన విన్నపాన్ని వ్యక్తం చేస్తూ పార్క్ ‌క్షీణతను తనిఖీ చేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకనైనా పేలవంగా మారిన ఈ నాంపల్లి పబ్లిక్‌ ‌గార్డెన్‌ ‌పార్క్ ‌నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దృష్టి సారించి సుందరంగా తీర్చి దిద్దాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *