నిర్భయంగా.. నిరాటంకంగా…

కవిత్వంతోనే/  నా ఊపిరి వెలిగించుకుంటాను/   కవిత్వంలోనే /   నా ఆయువు పొడగించుకుంటాను/  నా కవిత్వానికి/  నేనే వాక్యాంతాన్నవుతానన్నారు కంచరాన భుజంగరావు. నీటి గింజల పంట పేరిట వెలువడిన ఆయన సంపుటిలోని కవితలు వచన కవిత్వంలో సరికొత్త అభివ్యక్తికి ఉదాహరణలుగా కనిపించాయి. నాగలి వెంట నడిచే కవిని నేను /  కవిత్వమే నా కుడి చేయి/  కాగితం కనురెప్పల మీద  నిర్నిద్ర / స్వప్నాల కుండపోత నా కవిత్వం వంటి వాక్యాలు కవిత్వం పట్ల ఆయనకు ఉన్న  నిబద్ధతను ప్రదర్శించాయి.

మట్టి మౌనంగా ఒదిగిపోయి సృష్టికి జీవం పోస్తుంటే సూర్యుడు మాత్రం ముసిముసిగా ముందుకు కదిలి కిరణాల చేతులతో ప్రేమగా నేలను నిమిరాడన్న  అద్భుతాలోచనను మౌనమే మట్టి రహస్యం కవితలో చెప్పారు. సూర్యుడు మెత్తని మట్టిని దోసిట పట్టి కర్మసాక్షి తానని రుజువు చేస్తూ కళ్లకద్దుకున్నాడని చెప్పడంలో కవిలోతైన ఆలోచనాశీలత కనిపిస్తుంది. నీ రెక్కల కింది ఆకాశం నీదేనని  భరోసా ఇస్తూ  మబ్బులెన్ని ముసిరినా స్వేచ్ఛగా ఎగసిపొమ్మని అన్నారు. మెదళ్లకు సంకెళ్లేసే నియంత రాజ్యంలో కూడా రెక్కలు ఆడుతూనే ఉండి ఎదురు లేకుండా తీరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఏకాంతం దక్కని ఒంటరినైన  తనను డిజిటల్‌ వాన, వర్చువల్‌ వాగు సాక్షిగా ఆవిష్కరించి గుండెలారబెట్టుకున్న  వైనాన్ని భావోద్వేగంతో  చెప్పారు. ఏమీ తోచని తనంతో ఎడతెగని సహవాసం తాను చేశానని చెప్పుకొచ్చారు. ఒంటరితనపు గోతి నుండి బహిరాంతర్లోకాన్ని స్వాంతన పరచడానికి సదా సిద్ధమవుతూనే ఉంటానని ప్రకటించారు. తడి స్పర్శకు పులకల మొలకలయ్యే తల్లితనానికి తనను తాను ఉదాహరణగా మలుచుకున్నారు. మైకులు నోరు జారుతున్న కొద్ది భాష నిలువెల్లా మ్యాన్‌ హోల్లో కూరుకుపోతుందని ఆవేదన చెంది భాష మార్చండి ప్లీస్‌ అని వేడుకున్నారు.

మా పేద రంగు బతుకు/   సుంకం లేని ఒక ఎగుమతి సరుకు అని నీటి గింజల పంట కవితలో చెప్పారు. గిజిగాని పచ్చని వెన్నెల గూడి చెమట పిట్ట , స్వప్నాలు రాలే బోడిచెట్టు, ఖాళీ కుర్చీ న్యూనత, వలస కంపు శోకం, ఇసుక పూల జిగట, వెలుతురు మీగడ, మెలకువ గీతం వంటి ఆలోచనాత్మక  ప్రయోగాలను ఈ కవితలో కవి చేశారు. ఎరుక లేకుండా/  తెరిపి లేకుండా, ఎవరితో పోరాడుతున్నామో తెలియట్లేదని దుఃఖాన్ని నెమరేసుకున్నారు. విరామ చిహ్నాల మధ్య అనంత శోక వాక్యాలను రాశారు. తెల్లని పువ్వు లాంటి మనస్సులో / ఒక తెల్ల బట్ట కప్పండి చాలు అంటూ కరోనా కర్కశ రూపాన్ని దయనీయతో కూడిన ముగింపుతో దూదిపువ్వు కవితలో చెప్పారు. మమతల మట్టి తల్లికి మన్నించడం మాత్రమే తెలుస్తుందని క్షమయా ధరిత్రి అన్న కవితలో అన్నారు. పూల గొంతుల్ని కోసి అక్షరాల చెట్టు మూగబోయి ఏడ్చిందని  చెప్పారు. నేల నరాల్లో  రేగే అలజడిని నాగలి వెంట నడిచిన కవిగా అవలోకించారు. దుక్కిలో రాలే కన్నీటి చుక్కల కదలు వినబడుతున్నప్పుడు మట్టి మడతల్లో గుబాళింపులు ఎన్ని ఉంటే ఏం లాభం అని ప్రశ్నించారు. పంపకాల సారాంశంలో/ అమృతమెవరికి దక్కింది ?/  హాలాహలమెవరికి మిగిలింది ? అని నిలదీశారు.

యుద్ధం ముగిసే వరకు తెగువే ఆయుధమని నమ్మమన్నారు. సాటి మనిషి పట్ల ప్రేమ కొలతల్లేని సహజాతమై దోసిళ్లలో ఒలికిపోవాలని  కోరుకున్నారు. ప్రాణానికీ  ప్రియమారా మరికొన్ని ఊపిరి బొట్లను కానుకివ్వాలని చెప్పారు. పెరట్లోని ఆ చింత చెట్టు చుట్టూ గంతులాడిన బాల్యాన్ని  తలచుకున్నారు. అవధానంలో కొలువుతీరిన పంచకట్టు పండితుల్లా  పంక్తుల్లో అమరిపోయిన వ్యూహాత్మక వాక్యాలను ప్రస్తావించారు. వెన్నెముక ఎంత నిటారుగా ఉంటే మనకంత స్వేచ్ఛ ఉన్నట్టని సృజనకారులను చెప్పారు. విశ్వమంతా కరెన్సీ వాసన విస్తరించిందన్నారు. దేశమేదైనా, ప్రజలెవరైనా యుద్ధాన్ని నిరసించడమే పౌర విధి కావాలని చెప్పారు. అవిశ్రాంత  జీవితాన్ని బొట్లుబొట్లుగా జారిపోయే క్షణాల తుంపరతో పోల్చి చూపారు. కవిత్వంతో క్రష్‌ అయితేనే గుండెలోని కొండ గుహల్లో తేనె పట్టుపూస్తుందని అన్నారు. ఉద్దేశ పూర్వక మౌనం వల్ల కలిగే పరిణామాలను ఉదాహరించి స్వేచ్ఛాకాశం కోసం ప్రజా పతాకను చేసి ఎగరేయమన్నారు. నిర్భయ వసంతాన్ని కొత్త తరాలకు కానుకివ్వాలి కదా అని గుర్తు చేశారు. బతుకు పొలంలో మిఠాయి పంటలు పండాలన్నారు. అక్షరమే నా ఆలంబనగా  లక్షల కవితల్ని ప్రపంచానికి నివేదిస్తానని చెప్పారు. పలుకుబడి పాయల్లో అందలాలెక్కాలనుకుంటే అరుగును తవ్వి ఆకాశానికి నిచ్చన పేర్చడమే అవుతుందని హెచ్చరించారు. కొండలా పోగుపడిన చీకటి చావిడిలో/  పొయ్యి వెలిగించే ఓ నిప్పు కణం కోసం పొగ రాజేస్తున్నానని చెప్పారు.

ఒళ్లంతా గాయాలతో నెత్తురు కక్కుకున్న మట్టిని చూసి ఓదార్పుగా నేలను హత్తుకుందంటూ మట్టీ చెట్టు జన్మాంతపు అనుబంధాన్ని విశ్లేషించారు. వెలుగు నీడల భాష మనుసు మీద రాసుకునే దినచర్యగా కళ్లముందు సాక్షాత్కారం అవ్వచ్చని చెప్పారు. తలకు మించిన భారాన్ని మోసే అతడిని వెన్నువిరుస్తున్న నీటి మూఠల్ని పెకిలించకపోతే దేశం తలెత్తుకోలేదని తెలిపారు. పాలకులు, అధికార గణాన్ని ఉద్దేశించి మా కర్మానికి మమ్ములను వదలయేండి అని నువ్వు మరచిన నేల కవితలో వివరించారు.

సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని నిరసిస్తూ  గాజువాగు ఒడ్డున యుద్ధ శిబిరం కవితలో  కొన్ని ఎత్తైన కంచెల్ని మొలిపిస్తుంటాడు/  ఓ పెద్దతల బాపతు ధనమాలి/  ఆండ్రాయిడ్‌,  ఆపిల్‌ స్క్రీన్ల మీద మనిషిని కోతిలా మార్చి బుద్ధిని ఏమార్చే/  కోట్లాది బొమ్మల్ని కుమ్మరిస్తుంటే మనమంతా కబోదులుగా మిగిలిపోతుంటామని వేదన చెందారు. దోపిడీ తంత్రాలను అడ్డుకోగల స్వతంత్రత మనిషి కావాలన్నారు. నాగలి జెండా పట్టుకొని  రైతన్న పంటెండిపోయిన మెట్టపొలం కన్నీటిని నేల సాక్షిగా వివరించారు. కాయ, గింజ, పిక్క ఏదీ దక్కకపోతే అమ్ముకున్న పొలాల మధ్య కడుపు  చింతతో ఎడతెగని దుఃఖంతో చెమట సముద్రానికి సేతువు కట్టేందుకు రైతు చేస్తున్న నిరంతర యుద్ధానికి కవి  అక్షరాకృతి తొడిగారు. దోపిడీ వ్యూహాల తీరాన్ని బలంగా ఢీకొట్టి ఆకలి గుంజాటనలను పటాపంచలు చేయాలన్నారు. బతుకునీ, బరువునీ ఒకేలా తూనికవేసే స్వరాల సాంగత్యంలో తూగీతూగని గాయక కలికితురాళ్ళ నిత్య జీవిత విచారాలను కవి ఎంతో అద్భుతంగా ఆవిష్కరించి వారికి పాటల పొద్దే అమ్మల పొది కావాలన్నారు.

కళాయి పూతలేని నిలువుటద్దం మా ఊరు /  పుట్టి మునిగాక ఒడ్డు చేర్చిన ఓటి పడవ మా ఊరు/  గ్రామ స్వరాజ్యం ఎండమావి ఊటల్ని చూస్తున్న/  బాపూజీ కళ్ళజోడు మా ఊరు అన్న కవితా వాక్యాలు శిథిల గ్రామీణాన్ని ఎత్తి చూపాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని విశ్లేషించారు. సవాలక్ష  సందిగ్ధ దృశ్య ప్రవాహాల మధ్య ఒక ఉదాత్త ప్రతిపాదన జరిగితే ఉత్పన్నమయ్యే  పరిస్థితికి కొమ్మలకెందుకో కొరత అన్న కవిత అద్దం పట్టింది. నాన్నను చెమట పూల చెట్టుగా అభివర్ణించారు. ప్రాణాలు కాపాడే దక్షత గల వైద్యుల ప్రజావైద్యాన్ని మెడికో డెయూస్‌ కవిత చూపింది. బతుకు భాష, బతకాల్సిన బాట తెలిశాక నిజాన్ని  నిక్కచ్చి మాటల్లో  వెలిగించాలన్నారు. కరోనా వికృతిలో నేలరాలిన నిన్నటి పువ్వుల సన్నటి నవ్వుల్ని పరిమళాల్ని గుర్తు తెచ్చుకొమ్మని చెప్పారు. ఉద్యమ నినాదాలతో పిడికిలి జెండా ఎత్తి ఉక్కుద్రవం  ఒలికిపోకుండా పోరాడమన్నారు. కవిత్వమూ దుఃఖమే, దాని చారికలు సాహిత్య అద్దంలో కనబడుతూనే ఉంటాయని చెప్పారు.

ప్రతి అణువుకు గుక్కెడు నీరుపోసి /  నీ మనసు చెరకుతోటను మొలిపించవూ…! అని గుండెలోని సెగ నిప్పును ఆర్పేయమన్నారు. ఆఖరి సంస్కారం కోసం కొన్ని పూల పడవల్ని జోడిరచి సాగనంపమన్నారు. ఇక్కడ అభివృద్ధంటే/  పెద్ద తలల ఆశల స్వర్గం/  శ్రమజీవుల అగమ్య దుర్గం అని తలకిందుల స్వర్గంలో  జరిగే తతంగాన్ని చెప్పారు. అనురాగమే ఆమె నిరంతర గమ్యమంటూ మాతృమూర్తిని కొనియాడారు. ప్రళయానికి ఇనుప గుండెల మానవుడి విధ్వంస తత్వమే కారణమన్నారు. సంబంధాల త్రాసులో తూనిక రాళ్లన్ని నీటిపై తేలే జీలుగు దుద్దులైనప్పుడు పచ్చనోట్ల నెగడు అనివార్యమవుతుందని  చెప్పారు. నీదైన శూన్యంలోంచి ఒక చరిత్ర పుడుతుందని మనిషికి గుర్తు చేశారు. ఆఖరి ఆయుధం మృత్యువేనా అని సూటిగా  ప్రశ్నిస్తారు. ఆకుపచ్చని రాత్రిలో వెన్నెల తునకల కోసం తపనను పునరపి కుసుమం కవితలో వివరించారు. రసనదిలో కంఠంలోకి మునిగి కవిత్వంతో తలమునకల ప్రేమలో ఉన్నానని చెప్పుకొచ్చారు. పొలిబారిన గుండె మెరకల క్రింద నీటి జలపై కన్నీరూరుతుంది అని చెప్పారు. నేల నుదుటి యుద్ధ విధ్వంస గాయాలకు చెమట తడి అనే మందును రాసుకుందామన్నారు. వెలుతురు మొలచిన పూలచెట్టును గురించి చెబుతూ చిరుగులైన బతుకు బట్టలకు మాసికలేసే శక్తి ఉన్న కళాజాలికులైన వారు పాడుతుంటే ప్రజలు ప్రవహిస్తారని చెప్పారు. తోకలు తెగిన ఎలకల్లా/  కలుగుల ఇల్లల్లోనే ముడుచుకు పడుకుందామన్నారు. ఆశయ వాక్యం  ఓదార్పు గీతమై పదాల పెదాలపై పల్లవించాలన్నారు.

అంతిమ శ్వాసను అక్షరాలపై గీసి అగ్గిపుల్లల్లా గురు కవులు వెలిగించగలరని చెప్పారు. ఆలోచనలు కదిలే జీవుల్లాంటివేనని తలపుల సిరి కవితలో తెలిపారు. స్మరణ ఒక సిద్ధాంతం/  చింతన ఒక హృదంతం/  బుద్ధి పుట్టడం ఒక కాంక్ష/  ఆలోచన ఒక ఆకర్షణ/  తలపు ఒక అన్వేషణ  అన్నారు. స్మరణ ఒక సిద్ధాంతం, చింతన ఒక హృదయాంతమని చెప్పారు. సౌరభానిదే సొగసిరి/  సౌశీల్యానిదే తలపుల సిరి అని మంచి ఆలోచనల ప్రాధాన్యతను వివరించారు. చివరగా A ూశ్రీవa ఖీశీతీ జష్ట్రaఅస్త్రవ కవితలో  ణఱంషవతీఅ aశ్రీశ్రీ  ్‌ష్ట్రవ జష్ట్రఱశ్రీసతీవఅ/ Aశ్ర్‌ీవతీ ్‌ష్ట్రవ ూaఅస్త్రబaస్త్రవ ూశ్రీవaంవ  అని చెప్పారు.  దైనందిన  జీవితానికి ప్రతిబింబంగా చర్చిస్తూ సంస్కార వికాసాలను పెంచే ప్రయత్నం దాదాపుగా అన్ని కవితల్లో కవివైపు నుండి జరిగింది. కవిలోని   సునిశిత ఆలోచన, ఆవేశానుభూతి, వ్యక్తీకరణ, విశాల అవగాహన, వైవిద్యంతో పాటు కవిత్వ నిర్మాణ  శ్రద్ధ అనేక పంక్తులలో కన్పిస్తుంది. తన చుట్టూ ఉన్న సమస్త అంశాలను పోగు చేసి నిర్మాణ చట్రంతో కవి అందించిన మహానుభూతి  ఈ కవిత్వం.
– డా. తిరునగరి శ్రీనివాస్‌
8466053933

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *