మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమకారిణి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అధినేత్రి ఆంగ్ సాన్ సూకీ ప్రజాస్వామ్య మయన్మార్ కోసం ఉద్యమిస్తూ సైనిక జుంటా ప్రభుత్వంచే అన్యాయంగా అత్యధిక కాలం పాటు నిర్బంధంలో కొనసాగారు. ఒక రకంగా చెప్పాలంటే ‘ఆమె నేటికి కూడా నిర్బంధమే ఒక జీవితంగా జీవిస్తున్నారు’. నేడు నిర్బంధం అనగానే ఆంగ్ సాన్ సూకీ పేరు స్ఫురణకు రావడం గమనార్హం. ఆమె తండ్రి ఆంగ్ సాన్ బర్మా స్వాతంత్య్రం కోసం ఉద్యమించి చివరికి ప్రత్యర్థులచే హత్య చేయబడ్డారు. బర్మీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ మరియు జపనీస్ భాషలు అనర్గళంగా మాట్లాడే ఆమె తన తండ్రి ఆంగ్ సాన్ నుండి ఉద్యమ వారసత్వాన్ని స్వీకరించి పలు నిర్బంధాలు అధిగమించి ప్రజాగొంతుకగా మయన్మార్ లో ‘ప్రజాస్వామ్య సాధన’కు ఉద్యమించారు.
ప్రజాస్వామ్య మయన్మార్’ కోసం 1988 ఆగస్ట్ 8న మయన్మార్‌లో భారీ ప్రదర్శనలు జరిగి చివరకు హింసాత్మకంగా మారి తీవ్రంగా అణచివేయబడ్డాయి. ఈ ఆగస్ట్ 8 తిరుగుబాటు ద్వారా ఆంగ్ సాన్ సూకీ విశిష్ట ప్రాధాన్యతని సంతరించుకుని ‘ప్రజాస్వామ్య దార్శనికత’ని ప్రదర్శించారు. 1988 ఆగస్ట్ 26 న రాజధానిలో జరిగిన ర్యాలీలో ఆమె ప్రజాస్వామ్యం కోసం పిలువు ఇచ్చారు. 1988 సెప్టెంబర్ లో మిలిటరీ జుంటా అధికారాన్ని చేపట్టింది. యూనేవిన్ యొక్క సైనిక పాలన క్రూరత్వంతో కదిలిన ఆమె ప్రజాస్వామ్యం మరియు మానవ హక్కుల కోసం అహింసాహియుత పోరాటాన్ని ప్రారంభించారు. 1988 సెప్టెంబర్ 18 న జరిగిన సైనిక తిరుగుబాటు తర్వాత 1988 సెప్టెంబర్ 27 న సైనిక జుంటాని విమర్శించిన అనేక మంది రిటైర్డ్ ఆర్మీ అధికారుల సహాయంతో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డి) అనే కొత్త ప్రజాస్వామ్య అనుకూల రాజకీయ పార్టీ స్థాపించబడగా ఈ పార్టీకి ఆంగ్ సాన్ సూకీ చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. జుంటా ప్రభుత్వం సూకీని 1989 జూలై 20 నుండి 1995 జూలై వరకు విచారణ లేకుండా గృహ నిర్బంధం గావించింది. అయితే ఆమె దేశం వదిలిపోతే స్వతంత్రంగా ఉండడానికి అవకాశాన్ని కల్పించిననూ ఆమె ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు. సూకీ నిర్బంధంలో ఉన్న కాలమైన 1990 మే 27 నాడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్. ఎల్. డి) 59 శాతం ఓట్లను 82 శాతం పార్లమెంట్ స్థానాలను సాధించింది. అయితే ఈ ఎన్నికల ఫలితాలను సైనిక ప్రభుత్వం విస్మరించి రద్దు చేసి ఆమెకు అధికారాన్ని బదలాయించేందుకు నిరాకరించింది. 1991 ఆగస్ట్ 10 నాడు ఆమెని విచారణ లేకుండా ఐదు సంవత్సరాల వరకు నిర్బంధంలో ఉంచడానికి వీలుగా సైనిక పాలకులు ముందస్తుగా చట్టాన్ని సవరించారు. ఆ సవరణల ప్రకారంగా 1995 జూలై 10 నాడు సూకీ స్వల్ప ఆంక్షలతో గృహానిర్బంధం నుండి విముక్తి పొందారు.
2000 లో దేశంలోని ఇతర ప్రాంతాలలో రాజకీయ సమావేశాలు నిర్వహించేందుకు రాజధాని రంగూన్ ని విడిచి పెట్టేందుకు పలుమార్లు ప్రయత్నించిన కారణంగా సూకీని తిరిగి గృహా నిర్బంధంలో ఉంచారు. జుంటా ప్రభుత్వం సూకిని 2000 సెప్టెంబర్ 23 నుండి 2002 మే 5 వరకు గృహా నిర్బంధంలో ఉంచి 19 నెలల తర్వాత 2002 మే 6 నాడు ఐరాస జరిపిన చర్చల ఫలితంగా విడుదల చేసింది. ఈసారి అంక్షలు లేకుండా దేశమంతా తిరిగే స్వేచ్ఛ ఆమెకి లభించింది. అయిననూ వివిధ సందర్భాలలో అకారణంగా ఆమె ప్రభుత్వ వేధింపులకు గురయ్యారు. కొంతకాలం తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఆమెని అరెస్ట్ చేసి రంగూన్ లోని ఇన్సేన్ జైలులో బంధించింది. 2003 లో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ కార్యకర్తలు మరియు ప్రభుత్వ అనుకూల ప్రదర్శనకారుల మధ్య జరిగిన తర్వాత ప్రభుత్వం ఆమెని గృహ నిర్బంధానికి పంపింది. 2004 డిసెంబర్ 2 నాడు సూకీ గృహ నిర్బంధాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఆమెని విడుదల చేయవలసిందిగా అమెరికా మయన్మార్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. 2005 నవంబర్ 28 నాడు సూకీ గృహ నిర్బంధాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దీనిని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. 2006 మే 27 నాటికి సూకీ గృహ నిర్బంధం ముగియాల్సి ఉండగా బర్మా ప్రభుత్వం దానిని మరో ఏడాది పొడిగించింది. 2007 మే 25 నాడు ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేసినప్పటికీ గృహ నిర్బంధాన్ని మరో ఏడాది పొడిగించారు. కాని 2008 మే 27 నాడు గృహ నిర్బంధం మరో సంవత్సరం పొడిగించబడిననూ ఒక రకంగా ఆమె గృహ నిర్బంధ పరిస్థితులు కొంత మేరకు తగ్గించబడ్డాయి. 2009 మార్చ్ 24 నాడు యునైటెడ్ నేషన్స్ వర్కింగ్ గ్రూప్ ‘సూకీ ఏకపక్ష నిర్బంధం చట్ట విరుద్ధమని మరియు ప్రభుత్వం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం సబబు కాదు’ అని పేర్కొంటూ ఒక తీర్పుని జారీ చేసింది. మరోసారి 2009 మే 13 నాడు సూకీని అరెస్ట్ చేసి గృహ నిర్బంధ నిబంధనలు ఉల్లంఘించినట్లు అభియోగాలు మోపారు. 2009 జూలై 3 నాడు ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ బాన్- కి – మూన్ బర్మాకి వెళ్లి సూకీని విడుదల చేయమని బర్మా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చాడు. 2009 ఆగస్టు 11 నాడు ఆమె దోషిగా నిర్ధారించబడింది. అందుకుగాను ఆమెకి మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధింపబడింది. విచారణ గురించి అంతర్జాతీయ సమాజ ఆగ్రహాన్ని శాంతింపజేసే ఉద్దేశ్యంతో సృష్టమైన క్రమంలో ఆమెకి విధించిన శిక్షను వెంటనే 18 నెలలకు ప్రభుత్వం తగ్గించి గృహా నిర్బంధంలో ఉన్నప్పుడే దానిని అనుభవించడానికి అనుమతించబడింది.
ఆర్టికల్ 9 యూనివర్సల్ డిక్లరేషన్ ప్రకారం మానవ హక్కుల ఉల్లంఘనలని ఖండిస్తూ సూకీని విడుదల చేయమని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ బర్మా అధికారులను కోరింది. బర్మా అధికారులు ఆ అభ్యర్థనని తోసిపుచ్చారు. 2009 ఆగస్ట్ 18 నాడు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సూకీతో పాటు రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని సైనిక నాయకత్వాన్ని కోరారు. శిక్షకు వ్యతిరేకంగా సూకీ చేసిన అప్పీల్ ను 2009 అక్టోబర్ 2 నాడు బర్మీస్ కోర్ట్ తిరస్కరించింది. ఫలితంగా 2010 లో జరగాల్సిన ఎన్నికల్లో సూకీ పాల్గొనలేకపోయారు. 2010 సాధారణ ఎన్నికల వరకు ఆమె గృహ నిర్బంధంలో కొనసాగారు. ఆమె ఆధ్యర్యంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ 2010 నాటి ఎన్నికలను బహిష్కరించింది. ఫలితంగా 2010 నవంబర్ 12 నాడు సైనిక మద్దతు గల యూనియన్ సాలిడారిటీ ఆఫ్ డెవలప్ మెంట్ పార్టీ ( ( యు.ఎస్.డి.పి ) ఎన్నికలలో గెలిచిన తర్వాత అనగా దాదాపు 20 సంవత్సరాల తర్వాత నిరంకుశ ప్రభుత్వం సూకీ విడుదల పత్రాల మీద సంతకం చేసింది. ఫలితంగా 2010 నవంబర్ 13 నాడు సూకీ గృహ నిర్బంధం నుండి విడుదలయ్యారు. సూకి 1989 నుండి 2010 మధ్య గల 21 సంవత్సరాలలో మొత్తంగా 15 ఏళ్ళ పాటు గృహ నిర్బంధంలో ఉన్నారు.
2011లో సూకీ కార్యకలాపాలపై ఆంక్షలు సడలింపబడ్డాయి. 2012 ఏప్రిల్ లో జరగాల్సిన పార్లమెంట్ ఉప ఎన్నికలకు ముందుగానే నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ అధికారికంగా పునరుద్ధరించబడింది. 2012 ఏప్రిల్ 1 నాడు జరిగిన ఎన్నికల్లో ఆమె ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. 2012 ఏప్రిల్ 2 నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె పార్టీ పోటీ చేసినసభ 45 స్థానాలలో 43 స్థానాల్లో విజయం సాధించింది. ఫలితంగా దిగువ సభలో సూకీ ప్రతిపక్ష నాయకురాలు ఆయ్యారు. 2012 జూలై 9 నాడు ఆమె మొట్టమొదటిసారిగా చట్టసభకు హాజరు అయ్యారు. 2012 జూలై 25 నాడు సూకి పార్లమెంట్ లో తన మొదటి ప్రసంగం చేశారు. 1990 తర్వాత 2016 లో తిరిగి బహుళ పార్టీ ఎన్నికలు దేశంలో తొలిసారిగా స్వేచ్ఛగా జరుగగా నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ 86 శాతం సీట్లు గెలుపొంది చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. అయితే విదేశీ బంధువులు ఎవరైనా దేశ నాయకురాలిగా ఉండడాన్ని నిషేదించే రాజ్యాంగ సవరణ కారణంగా సూకీ దేశ అధ్యక్షురాలు కాలేకపోయారు. ఆమె సన్నిహితుడైన క్యావ్ ని పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. 2016 మార్చి 15 నాడు లెజిస్లేటివ్ సభ్యులు క్యావ్ ని కొత్త అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా దశాబ్దాల సుదీర్ఘ పోరాటంలో భాగంగా గృహా నిర్బంధంలో 15 సంవత్సరాలు గడిపిన తర్వాత సూకీ 2016 ఎన్నికల్లో తన పార్టీకి ఘనవిజయం సాధించిపెట్టి దేశంలో మొదటి పౌర ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. సూకీ 1988 నుండి 2011 వరకు పార్టీ ప్రధాన కార్యదర్శి గాను, 2012 నుండి 2016 వరకు ప్రతిపక్ష నాయకురాలు గాను, 2016 నుండి 2021 వరకు విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి గాను మరియు మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ గాను బాధ్యతలు నిర్వహించారు.
రకైన్ రాష్ట్రంలోని రోహింగ్యా ముస్లిం ప్రజలపై సైన్యం చేసిన దూరాగతాలకు నిలువరించడంలో సూకీ విఫలమైనందున అంతర్జాతీయ సమాజం ఆమె మౌనంపై తీవ్రంగా విమర్శలు ఎక్కుపెట్టింది. 2016 మరియు 2017 లలో హింసాత్మక సైనిక కార్యకలాపాల సమయంలో హింసింపబడిన వేల మంది మైనారిటీలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లోకి బలవంతంగా వెళ్లిపోయారు. 2017 నాటికి సైనిక దళాలచే రోహింగ్యాలని మారణహోమానికి గురిచేయడం పరాకాష్టకు చేరింది. మయన్మార్ సైన్యం మరణకాండకు పాల్పడిందని అంగీకరించడానికి సూకీ నిరాకరించి రోహింగ్యాలకు పౌరసత్వం ఇవ్వడానికి తిరస్కరించారు. పైగా ఆమె మయన్మార్ సైన్యాన్ని సమర్థించారు. సూకీ తీసుకున్న అప్రజాస్వామిక విధానాలను ఖండిస్తూ అనేక సంస్థలు ఆమెకి గతంలో అందించిన గౌరవాలు మరియు అవార్డులు రద్దు చేశాయి. 2018 మే నెలలో బ్రిటన్ యొక్క ఇంటర్నేషనల్ కమిటీ నివేదికలో రోహింగ్యాలకు వ్యతిరేకంగా జరిగిన నేరాలలో సూకీని భాగస్వామిగా ప్రకటించింది. మయన్మార్ ప్రభుత్వం రోహింగ్యా ముస్లింలపై మరణహోమ చర్యలకు పాల్పడిందని గాంబియా దేశం అంతర్జాతీయ న్యాయస్థానంలో దావా వేయగా 2019 లో సూకీ అంతర్జాతీయ న్యాయస్థానం ముందు నిలబడ్డారు.
2020 నవంబర్ 8 నాడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్. ఎల్. డి ) మెజారిటీ సీట్లను గెలుచుకుని విజయం సాధించింది. 2021 ఫిబ్రవరి 1 నాడు కొత్తగా ఎన్నిక అయిన పార్లమెంట్ మొదటి సెషన్ ని నిర్వహించాల్సి ఉంది. కాని ఆ రోజు సైన్యం అధికారాన్ని అన్యాయంగా చేజిక్కిచ్చుకుంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఆమెపై అనేక అభియోగాలు నమోదయ్యాయి. 2021 ఫిబ్రవరి 1 నాడు సూకీని మయన్మార్ మిలటరీ అరెస్ట్ చేసింది. కోర్ట్ ఉత్తర్వ్యు ఆమెని 15 రోజుల పాటు నిర్బంధించడానికి అధికారం ఇచ్చింది. 2021 ఫిబ్రవరి 3 నాడు సూకీ ఇంట్లో అక్రమంగా దిగుమతి చేసుకున్న వాకీ-టాకీ రేడియో లు ఉన్నాయంటూ అభియోగాలు ప్రకటించారు. ఫిబ్రవరిలో రహస్య పద్ధతిలో విచారించి కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజలతో ద్వారా దేశం యొక్క సహజ విపత్తు చట్టాన్ని ఉల్లంఘించినందుకు కూడా ఆమెపై అభియోగాలు మోపారు. సాధారణ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆమెని పదవి నుండి తొలగించారు. అప్పటి నుండి సూకీని నిర్బంధంలోనే ఉంచి కేసులు మోపుతున్నారు. ఇప్పటికే పలు కేసులలో ఆమెకు శిక్షలు ఖరారు కూడా విధించారు.
2021 ఏప్రిల్ 1 నాడు సూకీపై అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా ప్రకటించారు. 2021 ఏప్రిల్ 12 నాడు మరొక అభియోగాన్ని మోపారు. మరోసారి 2021 జూన్ 10 నాడు సూకి పై అవినీతి ఆరోపణలు మోపబడ్డాయి. 2021 డిసెంబర్ 6 నాడు సూకీకి 4 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. అసమ్మతిని ప్రేరేపించడం, కోవిడ్ ప్రోటోకాల్ ని ఉల్లంఘించిన ఆరోపణలపై శిక్ష విధింపబడింది. సైనిక ప్రభుత్వ చీఫ్ పాక్షిక క్షమాపణ తర్వాత నాలుగు సంవత్సరాల శిక్ష రెండు సంవత్సరాలకు తగ్గించబడింది. 2022 జనవరి 10 నాడు మిలటరీ కోర్ట్ మరో ఆరోపణపై వాకీ- టాకీలను స్వంతం చేసుకోవడం, కరోనా నియమాలను ఉల్లంఘించడం వంటి అనేక ఆరోపణలపై అదనంగా నాలుగు సంవత్సరాల శిక్ష విధింపబడింది. సూకీని మరియు ఇతర నాయకులను నిర్బంధించింది. ఫలితంగా మాజీ జనరల్ మై%శీ%ట్ స్వే తాత్కాలిక అధ్యక్షుడు అయ్యారు. 2022 ఏప్రిల్ 27 నాడు అవినీతి ఆరోపణలపై జుంటా కోర్ట్ ఆమెకు అయిదు సంవత్సరాల జైలు శిక్షని విధించింది. వాకీ టాకీ ల అక్రమ దిగుమతిలో 6 లక్షల డాలర్ల నగదును, 11.4 కిలోల బంగారాన్ని యంగాన్ మాజీ ముఖ్యమంత్రి ఫియోమిన్ థీన్ నుండి లంచం రూపంలో తీసుకున్నట్లు జుంటా కోర్ట్ సృష్టం చేసింది. 2022 ఆగస్ట్ 15 నాడు నాలుగు అవినీతి ఆరోపణలపై దోషిగా తేలడంతో మరో 6 సంవత్సరాల జైల్ శిక్ష విధింపబడింది. ఆ అభియోగాల్లో అధికార దుర్వినియోగం, స్వలాభం కోసం మార్కెట్ కంటే తక్కువ ధరలకు ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకోవడం, దాతృత్వ కార్యక్రమాల కోసం నెలకొల్పిన డా క్విన్ క్వి ఫౌండేషన్ ఆస్తుల దుర్వినియోగం, సేకరించిన విరాళాలతో ఇల్లు నిర్మించుకోవడం ఉన్నాయి. దేశద్రోహం, అవినీతి తదితర ఆరోపణలపై ఆమెకు 11 ఏళ్ల శిక్ష శిక్షతో పాటు మొత్తంగా 17 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. అభియోగాలు గృహ మరియు జైలు నిర్బంధాలు ఆమె జీవితంలో నిత్యకృత్యం కావడం విషాదకరం. ఆమె గతంలో రెండు సార్లు హత్యా ప్రయత్నాల కారణంగా చావు అభియోగాలు నిరూపితం అయితే అంచుల వరకు వెళ్లి తృటిలో తప్పించుకున్నారు.
సూకీపై మొత్తం 18 నేర అభియోగాలను మోపారు. ఆమె వంద ఏళ్లకు పైగా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. అయితే వాటన్నింటిని నిర్ద్వంద్వంగా ఆమె ఖండించారు. 2022 సెప్టెంబర్ 2 నాడు ఎన్నికల్లో జరిగిన అవినీతి కేసులో సూకికి మరో మూడేళ్ళ పాటు శిక్షను విధిస్తూ సైనిక కోర్ట్ తీర్పుని వెలువరించింది. అయితే ఇప్పటికే పలు కేసుల్లో ఆమెకు 17 ఏళ్ల జైలు శిక్ష ఖరారు కాగా ఈ తాజాగా విధించిన శిక్ష దానికి అదనపు శిక్ష కావడం గమనార్హం. మయన్మార్ లో సైనిక పాలన రద్దు కోసం ఉద్యమించి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం సుదీర్ఘ పోరాటం చేసిన సూకీ ప్రస్తుత వయస్సు 76 సంవత్సరాలు. జీవిత చరమాంకంలో ఉన్న ఆమెపై సైనిక జుంటా కోర్ట్ అన్యాయంగా శిక్షలు విధించడం కర్కోటకానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఆమెపై అన్యాయంగా మోపబడిన నేరాలకు శిక్షలు అనుభవించడానికి ఆమె జీవిత కాలం కూడా సరిపోదు. అందువల్ల సైనిక జుంటా ప్రభుత్వం మానవతా దృక్పథంతో సూకిని నిర్బంధం నుండి విముక్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోహింగ్యాల సమస్యలపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు ఎదుర్కోవడం మినహాయిస్తే మిగతా అన్ని ప్రజాస్వామిక ఉద్యమాలలో సూకీ ప్రజాస్వామికంగా వ్యవహరించారు. ‘నిర్బంధమే ఆంగ్ సాన్ సూకీ ఆచూకి’ అనే దానికి తార్కాణంగా నిలిచి కళ్ళ ముందు కదలాడుతున్న సూకీని నిర్బంధం నుండి విముక్తి గావించేందుకు ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులు అంతర్జాతీయంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనది.
– జె.జె.సి.పి. బాబూరావు , 94933 19690




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల