- భారీ వర్షాలపై సిఎం కెసిఆర్ సవి•క్ష
- పలు జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం
నగరంలో వరద పరిస్థితులపై మంత్రి కెటిఆర్ సవి•క్ష…అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు శుక్రవారం కూడా సెలవు ప్రకటించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. దీంతో శనివారం మొహర్రం సెలవు కావడంతో ప్రభుత్వ విద్యాసంస్థలు అన్నీ సోమవారం తెరుచుకోనున్నాయి. ఇక రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వరదలపై సీఎం కేసీఆర్ సవి•క్ష నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.
ములుగు జిల్లా ప్రత్యేకాధికారిగా కృష్ణ ఆదిత్య, భూపాలపల్లి జిల్లాకు పీ.గౌతమ్, నిర్మల్ జిల్లాకు ముషారఫ్ అలీ, మంచిర్యాల జిల్లా ప్రత్యేక అధికారిగా భారతి హోళికేరిని నియమించారు.నగరంలో వరద పరిస్థితులపై మంత్రి కెటిఆర్ సవి•క్ష…అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన హైదరాబాద్‌లో వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయని, దీంతో హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద వొచ్చి చేరుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌తో కలిసి హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో వరద పరిస్థితిని మంత్రి కేటీఆర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా వి•డియాతో మాట్లాడుతూ.. వర్షకాలం ప్రారంభానికి ముందే నాలాల్లో పూడిక తీశామని చెప్పారు. చెరువుల్లోనూ తక్కువ నీటిమట్టం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. నగరంలో ఎస్సార్‌డీపీ చేపట్టకముందు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవని చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో చేతనైతే ప్రతిపక్షాలు సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వర్షాలను కూడా రాజకీయం చేయడం సరికాదన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో 14 బ్రిడ్జిలు మంజూరు చేశామన్నారు. అనంతరం ముసారంబాగ్ వద్ద మూసీనదిపై ఉన్న బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ పరిశీలించారు.




