నాకు తెలిసిన గద్దర్‌

గద్దర్‌, ‌నేను సమకాలికులం. విరసం సభ్యుడిగా, రాడికల్‌ ‌యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, గద్దర్‌ ‌జననాట్యమండలి కళాకారుడుగా ఒకే విప్లవోద్యమంలో, భిన్న రంగాల్లో దశాబ్దాలుగా కలిసి పనిచేస్తున్నాము. మా మాతృ సంస్థ పీపుల్స్ ‌వార్‌ ‌పార్టీ, నేటి మావోయిస్టు పార్టీ 1980ల నుండి మేము అనేక రంగాల్లో, అనేక వేదికల మీద కలిసి పనిచేస్తున్నాము. ప్రజలే మా లక్ష్యం, గమ్యం. ప్రజల చైతన్యం, జీవన ప్రమాణాలు పెరగడం, సామాజిక మార్పు మా అంతిమ లక్ష్యం. భావాల్లో వైవిధ్యం, భిన్నత్వం మా స్నేహానికి, కలిసి పనిచేయడానికి ఎన్నడూ అడ్డురాలేదు. పరస్పర విశ్వాసం. చిత్తశుద్ధి పట్ల గౌరవం, భిన్న రంగాలు పరస్పర సహకారం వల్ల కలిసి నడవడం సాధ్యపడుతున్నది.

గద్దర్‌ ఒక సముద్రం- ఒక యుద్ధ నౌక :
సామాజిక ఉద్యమాలతో పాటు ఎదుగుతూ వచ్చిన గద్దర్‌ ఒక సముద్రం. సముద్రంలో ఈదడం కష్టం. గద్దర్‌ను ప్రజా యుద్ధనౌక అన్నారు. కాల పరిణామంలో యుద్ధనౌక  తానే ఒక సముద్రమైంది. అలలు అలలుగా సముద్రం. ఆగిపోని అలలు. కదలకుండా వుండిపోయినట్టు కనిపించే లోతు, విస్తీర్ణం. ఆయన జీవనయానం నిరంతర చైతన్యశీలం. ఆర్‌.ఎస్‌.‌యు, ఆర్‌.‌వై.ఎల్‌, ‌రైతుకూలీ సంఘం, విరసం, ఎఐఎల్‌ఆర్‌సి, ఎఐఆర్‌ఎస్‌ఎఫ్‌, ఎపిసిఎల్‌సి అనే ఏడు సంస్థల ప్రతినిధులుగా రాష్ట్రంలోని ఉద్యమాలను వాటిపై ఎన్‌టిఆర్‌ ‌ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్భందాలను, ఇక్కడ కళారూపాలను, సాహిత్యాన్ని గురించి దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి నేను, గద్దర్‌, ‌వరవరరావు, సంజీవ్‌, ‌తదితరులం కలిసి 1985లో పలు రాష్ట్రాలు పర్యటించడం జరిగింది. ఆయా రాష్ట్రాల్లోని వేలాది కళాకారులను, రచయితలను, మేథావులను, ఉద్యమకారులను, పౌర హక్కుల నాయకులను కలుస్తూ, సభలు, సమావేశాలు, చర్చలు నిర్వహిస్తూ నెలల తరబడి వరుసగా సాగిన మా అఖిల భారత సాంస్కతిక పర్యటన ఒక గొప్ప అనుభవం.
అప్పుడు వివిధ ఉద్యమకారులతో, సంస్థలతో ఎన్నో చర్చలు. అలా ఎంతో వైవిధ్యపూరితమైన ఉద్యమాల పరిశీలనకు అవకాశం ఏర్పడింది.సాహిత్యాన్ని అంచనా వేయడానికి గద్దర్‌ ‌తూనికరాళ్ళు ప్రత్యేకంగా సూచిస్తాడు. ‘‘నాగురించేకాదు – ఏ కవినీ, కళాకారుడినీ అయినాసరే అంచనాలువేసే ఈ పద్ధతులమీద నాకు చాలా అభ్యంతరాలున్నాయి. మహాకవి, ఏకైక కవి, సువర్ణాక్షరాలతో రాయాలి అంటూ రాసేవన్నీ సైంటిఫిక్‌ ‌విశ్లేషణలు ఎంతమాత్రం కావు. ఒక కవినిగానీ, సాహిత్యాన్నిగానీ క్రిటికల్‌గా చూస్తే తప్ప ప్రయోజనంలేదు. ఒక నిర్దిష్టమైన టైమ్‌ అం‌డ్‌ ‌స్పేస్‌లో జీవించిన కవి, తన కాలానికి సంబంధించిన లక్షణాలను తన కవిత్వంలో సరిగ్గా ప్రతిబింబించాడా, లేదా, ఆ పరిస్థితుల్లో అతను ప్రజలవైపు నిలబడ్డాడా? పాలకులవైపా? అనే అంశాలని విమర్శకులు చెప్పగలగాలి. కొందరు ఆకాశానికెత్తితే, యింకొందరు అన్నీ లోపాలే చూపిస్తారు. రెండూ అన్యాయమనే నేననుకుంటున్నా. తప్పుల్లోనూ, గొప్పతనంలోనూకూడా నడిపించిన రాజకీయాల పాత్ర ప్రముఖమైనది. ఫలానా పార్టీ, వ్యక్తి అని నేను చెప్పదలుచుకోలేదుగానీ, ప్రజల రాజకీయాలవైపు నిలబడే కమిట్‌మెంట్‌నుండి దూరమైన కవులు, ఎంత టాలెంట్‌వున్నా చెయ్యగలిగేదేమీ లేదని నా అబిప్రాయం.’’

image.pngసామాన్యులను ఉద్యమకారులుగా, నాయకులుగా ఎదిగించేవి ఉద్యమాలు :
ఉద్యమాలు సామాన్యులను అసమాన్యులుగా ఎదిగిస్తాయి. అంతదాకా నిబిడీకృతంగా వున్న అంతర్గత శక్తులు, నాయకత్వ సామర్థ్యాలు, సృజన, కళలు ఒక్కసారిగా పెల్లుబుకి ముందుకు వస్తాయి. ఉద్యమాలు వాటిని పంట కాలువలుగా పొలాలకు మళ్లించి పంటలు పండిస్తాయి. ఉద్యమం కవులను, కళాకారులను, రచయితలను, నాయకులను తయారు చేస్తుంది. ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రజల నుండే మహ•న్నత నాయకులు, కళాకారులు, మేథావులు ఎదుగుతారు. అలా వేలాది మంది రచయితలు, కళాకారులు, కవులు తెలంగాణ, విప్లవోద్యమంలో ఎదిగారు. అలా ఎదిగినవారు కొందరు రకరకాల కారణాలతో మాతృసంస్థకు దూరమైనప్పటికి తల్లి నుండి దూరంగా, స్వతంత్రంగా ఎదుగుతూ బతుకుతున్నప్పటికి ప్రజల కోసం ఉద్యమాల కోసం ఎక్కడో ఒక చోట ఎప్పుడోకప్పుడు అందరూ కలుసుకుంటూనే ఉన్నారు. అది ఉద్యమం నేర్పిన సంస్కారం.విప్లవోద్యమంలో ప్రజల కళలను, కళారూపాలను స్వీకరించి తమ నైపుణ్యం, భావజాలం కలిపి ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఉపయోగిస్తారు. 1940ల నాటి తెలంగాణ రైతాంగ పోరాటం నుండి ఈ వారసత్వం కొనసాగుతున్నది.

ప్రజల పాటలను, జానపద పాటలను వాటి బాణిలను స్వీకరిస్తూనే వాటిని మరింత పదును పెట్టి ప్రజల్లోకి తీసుకురావడంలో జననాట్య మండలి, అరుణోదయ సాంస్క•తిక సమాఖ్య, ప్రజాకళామండలి వంటి సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయి. జననాట్య మండలి రూపకర్తల్లో కె.జి.సత్యమూర్తి, కొండపల్లి సీతారామయ్య, బి.నర్సింగరావు, గద్దర్‌, ‌వంగపండు ప్రసాద్‌రావు, భూపాల్‌…‌తదితరులు ప్రముఖులు.1970ల నుండి విప్లవోద్యమాల కళా సాహిత్య ప్రదర్శనలు, ప్రచారాలు వేగం పుంజుకున్నాయి. సుద్దాల హనుమంతు, షేక్‌ ‌నాజర్‌, ‌సుంకరల వారసత్వాన్ని కొనసాగిస్తూ శ్రీకాకుళ ఉద్యమం నుండి సుబ్బారావు పాణిగ్రాహి కవిగా, కళాకారుడిగా, విప్లవ నాయకుడిగా ముందుకు వచ్చాడు. ఆ బాటలో చెరబండ రాజు, వంగపండు ప్రసాదరావు, బి.నర్సింగరావు, గద్దర్‌, ‌భూపాల్‌ ‌వంటి ఎందరో కవులు, కళాకారులు ముందుకు సాగారు.ఆర్ట్ ‌లవర్స్ అనే సంస్థ 1969లో చిన్నగా సికింద్రాబాద్‌లో బి.నర్సింగరావు నేతృత్వంలో ప్రారంభమైంది. అది ఎందరో కళాకారులను, కవులను అందించింది.  గద్దర్‌, ‌భూపాల్‌ ‌వంటి వారిని ఆర్ట్‌లవర్స్ అం‌దించి తాను చరితార్థమైంది.

నక్సల్‌బరీ శ్రీకాకుళం ఉద్యమం :
భూమి కొరకు, భుక్తి కొరకు, భారతదేశ విముక్తి కొరకు, కార్మిక, కర్షక, నూతన ప్రజాస్వామిక వ్యవస్థ కొరకు మార్క్సిస్టు, లెనినిస్ట్ ‌దృక్పథంతో 1967లో నక్సల్‌బరీ ఉద్యమం మొదలైంది. సీపీఎం కడుపు చీల్చుకొని డార్జిలింగ్‌లో, నక్సల్‌బరీలో, కలకత్తాలో, సుందరబన్స్‌లో పెట్టిన పొలికేక అది. ఆ కేక శ్రీకాకుళం దాకా విస్తరించింది. శ్రీకాకుళంలో సుబ్బారావు పాణిగ్రాహి అలా ఎదిగి వచ్చారు. ఈ క్రమంలో శ్రీకాకుళ ఉద్యమాన్ని  ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, హ•ంమంత్రి జలగం వెంగళరావు అణచివేతకు గురి చేశారు. మరొక పోరాట రంగాన్ని ప్రారంభించే ఆలోచన జగిత్యాల, సిరిసిల్ల పోరాటాలుగా క్రమంగా కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ‌పోరాటాలుగా, ఆ తర్వాత దండకారణ్య పోరాటాలుగా, విముక్తి ప్రాంతాలుగా ఉద్యమం ముందుకు సాగింది.

విరసం, జననాట్యమండలి, రాడికల్‌ ‌సంఘాలు :
ఒకవైపు సాహిత్య రంగంలో విప్లవ రచయితల సంఘం సైద్ధాంతికంగా మధ్యతరగతి ప్రజల్లో బలమైన ప్రభావం వేస్తున్నది. మధ్య తరగతితో పాటు కార్మిక, కర్షక, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సామాజిక శ్రేణులన్నిటినీ జననాట్యమండలి బలంగా ప్రభావితం చేసింది. వందలాది పాటలతో, వేలాది ప్రదర్శనలతో, కోట్లాది ప్రజలను చైతన్యపరిచింది. రాడికల్‌, ‌విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, రైతుకూలి సంఘాలు తమలో జననాట్యమండలి కళాకారులను రూపొందించుకున్నాయి. అందుకు జననాట్యమండలి ప్రత్యేకంగా శిక్షణా తరగతులను నిర్వహించింది.

జననాట్యమండలి కృషి :
జననాట్యమండలి ఎందరో కళాకారులను, కవులను తన వైపు తిప్పుకుంది. ఆ కవులు, కళాకారులు, పలువురు విప్లవ కార్యకర్తలుగా విప్లవానికి అంకితమై ఎందరో అమరులయ్యారు. జననాట్య మండలి లేని విప్లవోద్యమాన్ని ఊహించలేం. అలాంటి జననాట్యమండలి కళాకారుల్లో గద్దర్‌, ‌వంగపండు, భూపాల్‌, ‌దివాకర్‌, ‌డప్పు రమేష్‌, ‌కుమారీ, డోలక్‌ ‌రాజు, కె.పి.సుబ్బారావు, సంజీవ్‌, ‌సుధ, శారద, స్వర్ణ, బెల్లిలలిత వంటి ఎందరో…! జననాట్యమండలి కళాకారుల్లో, నలభై మంది విప్లవోద్యమంలో అమరులయ్యారు. చిన్న స్వర్ణక్క, గద్దర్‌ ‌మేనకోడలు కూడా అమరులైనవారిలో ఉన్నారు.జననాట్యమండలి కృషి భారతదేశంలో అసామాన్యమైనది. దానికి చుక్కానిగా గద్దర్‌, ‌వంగపండు ఎదిగారు. దిక్సూచిగా ఉద్యమం, దాని నాయకత్వం, భావజాలం, రాజకీయాలు ముందుకు సాగుతుంటే ప్రజలను నిర్థిష్ట సమస్యలపై పాక్షిక పోరాటాల నుండి సాయుధ దీర్ఘకాలిక పోరాటాల వైపు నడిపించే చుక్కానిగా, స్ఫూర్తిప్రదాయినిగా జననాట్యమండలి ఎదుగుతూ వచ్చింది.

image.png
– ‌బి ఎస్‌ ‌రాములు
బీసీ కమిషన్‌ ‌మాజీ చైర్మన్‌
8331966987

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *