నా జీవితం
సంఘర్షణల సమాహారం.
అనంత సాగరంలో లాగే
నా ఎదలో
భావతరంగాలెన్నో,
సమస్యల సుడిగుండాలెన్నో,
మనోభావాల నిధులెన్నో,
ఆశల అలలెన్నో.
అలాంటి నాకై
ఎవరో ముందుకొచ్చి
ఒక స్వప్నాన్ని చెక్కివ్వాలంటే ఎలా
అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ
కాలం విసిరే సవాళ్ళను
అధిగమించడానికి,
జీవితాన్ని అమృతమయం చేసే
అమృతంకోసం…
అసూయా ద్వేషాల చీకట్లను
దరికి రానీయక
పున్నమి వెలుగుల
మానవత్వ రహదారిలో పయనిస్తూ
సద్వివేకంతో,
సద్బుద్ధి కవ్వంతో
జీవన జలధిని
మధిస్తూనే ఉన్నా.
సంఘర్షణ మబ్బులను మేధస్సుతో,
సమయానుకూల పవనాలతో
పారద్రోలుతూనే ఉన్నా…
– వేమూరి శ్రీనివాస్‌, 99121 28967, ‌తాడేపల్లిగూడెం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *