వచన కవిత అనగానే మొదట గుర్తుకు వచ్చే కవి కుందుర్తి. ఇది నా కవిత్వం గీత/ వినేవాడు నరుడు/ చదువూ సంధ్యలు లేని రోడ్డు మీద పామరుడు/ లేమి తల్లి ఒడిలో నిరంతర గాఢ నిద్రాపరుడు అని యుగేయుగే కవితాసంపుటిలో తన కవిత్వానికి నిర్వచనం చెప్పుకున్న కుందుర్తి మారుతున్న కాలంతో పాటు కవితా ప్రక్రియలో మార్పు అనివార్యం అని భావించినవారు. పద్యం, గేయం ఆధునిక ప్రపంచాన్ని వచన కవితలాగా ప్రతిబింబించలేవని, వానికున్న ఛందోవ్యాకరణ నియమాలు అందుకు కారణమని అభిప్రాయపడ్డ కుందుర్తి వచన కవితను ఒక ఉద్యమంగా నిర్వహించిన యుగకర్త. వచన కవితకు ఆద్యుడుగా శ్లిష్ట్లా ఉమామహేశ్వర రావును, వచన కవితను జనంలోకి ప్రతిభావంతంగా తెచ్చిన యుగకవిగా శ్రీశ్రీని చెప్పుకుంటున్నాం. గిడుగు రామమూర్తి పంతులు వ్యావహారిక భాషోద్యమానికి జీవితాన్ని అంకితం చేసినట్టుగానే తుది శ్వాస విడిచేదాకా వచన కవితావ్యాప్తి కోసం తెలుగునాట కృషి చేసిన కవి నాయకుడు కుందుర్తి. సామాన్యునికి అర్థమయ్యే సరళభాషలో చక్కని శిల్పంతో కవిత ఉండాలని ప్రతిపాదించి మార్గం వేసి ఆ మార్గంలోనే తనవెంట వచన కవితాపథంలో యువకవిలోకాన్ని నడిపించుకొని వెళ్ళిన ఆయన అభ్యుదయ కవితా పథికుడు.
సుమారు ఐదు దశాబ్దాలు అలుపు లేకుండా వచన కవితా పరిపుష్టికి కృషి కొనసాగించిన క్రాంతదర్శి కుందుర్తి. వచన కవిత్వ పద్ధతిలో కథాకావ్యాన్ని రచించారు. పండిత పామరులందరికీ అర్థమయ్యే గుణం వచన కవితలో ఉందన్న సత్యాన్ని సహృదయులకు ప్రయోగాత్మకంగా చూపించిన ద్రష్ట కుందుర్తి. తన కవిత ద్వారా సామాజిక సంస్కరణను, మానవతా దృక్పథాన్నీ సందేశించిన కుందుర్తి వచన కవితా పితామహుడు. కుందుర్తి ఆంజనేయులు 16 డిసెంబర్ 1922న గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని కుందుర్తివారి పాలెంలో జన్మించారు. వినుకొండలో, నరసరావుపేటలో ప్రాథమిక, సెకండరీ విద్య ముగించి గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఉన్నత విద్య చదివి ఆర్థిక శాస్త్రంలో బి.ఏ పట్టా పొందారు. విద్యార్థి దశలోనే కవితా రచనకు ఉపక్రమించిన కుందుర్తికి అభిమాన కవులే కాక ఆయన గురువులైన విశ్వనాథ సత్యనారాయణ, జాషువా. విశ్వనాథ వారి భావుకత, జాషువా సాంఘిక విప్లవ భావన ఆయనను ఆకర్షించాయి. ఆ ఇరువురి రచనలన్నింటినీ చదివి ఆకళించుకున్నారు. సౌప్తికము అనే పద్య కావ్యాన్ని రచించారు. పద్యాలైతే ఆయన రచించారు కాని మనస్సుకు తృప్తి కలగలేదు. తన అభివ్యక్తికి వచన కవిత తగిందని భావించారు. తనలోంచి పొంగి వచ్చే అభ్యుదయ భావాలను వ్యక్తం చేయడానికి వచన కవితా రచనకు పూనుకున్నారు. 1944లో తన కవి మిత్రులు బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యంలతో కలిసి తొలి తెలుగు వచన కవితా సంకలనం నయగారాను ప్రచురించారు. శ్రీశ్రీ మహాప్రస్థానం ద్వారా ఇరవయ్యో శతాబ్దంలోని యువకవులకు ఓ కొత్తదారి వేస్తే కుందుర్తి ఆ దారిని రహదారిగా మార్చిన మహానుభావుడు.
కుందుర్తి రచనలో సరళతకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. తెలుగు వారి నాలుకలపై వచన కవితలు పలకాలన్నదే ఆయన ఆశయం. తెలంగాణా (1956), ఆశ (1957), యుగేయుగే (1959), నగరంలో వాన (1967), నాలోని నాదాలు (1967), కుందుర్తి కృతులు (1975), హంస ఎగిరిపోయింది, తీరా నేను కాస్తా ఎగిరిపోయాక, మేఘమాల వంటివి కుందుర్తి రచనలు. కుందుర్తి వివిధ కవితా సంకలనాలకు రచించిన పీఠికలు కుందుర్తి పీఠికలు అనే గ్రంథంగా మచిలీపట్నంలోని స్పందన సాహితీ సమాఖ్య ప్రచురించింది.
కుందుర్తి కవితలో సమసాడంబరత ఉండదు. వ్యవహారంలో ఉన్న పదాలనే ఎక్కువగా ఎంచుకుం టారు. అందరికీ సులువుగా అర్థమయ్యే సరళ రమణీయమైన శైలి ఆయనది. చాలా మంది వచన కవుల గీతాల్లో కన్పించే పదాడంబరం, క్లిష్టత, అస్పష్టత కుందుర్తి కవితల్లో మచ్చుకైనా కన్పించదు. తిలక్ అమృతం కురిసిన రాత్రికి ఆయన రచించిన మావాడు మహా గట్టివాడు పీఠికలో సమాస బాహుళ్యమూ సంస్కృతం లేక ఆంగ్ల భాషా శబ్ద ప్రదర్శనమూ, ఉక్తిలో గ్రాంధిక చ్ఛాయలూ కలిగి పద్యమూ గేయమూ అనే భేదం మాత్రమే మిగుల్చుకొని పూర్వకావ్య భాషా సంప్రదాయానికి చేరువగా నడుస్తున్న శైలిని ఆయన ఒప్పుకోలేదు. వచన కవితలో లయ ఉండాలనే వారాయన. అంత్యప్రాసలు వాటంతట అవే సహజంగా వస్తే ఉంచడం తప్పులేదని ఐతే ప్రాసల కోసం బుర్ర బద్దలు కొట్టుకోవడం తగదన్నారు. కుందుర్తి వచన కవితలు గొంతెత్తి చదవడానికి వీలుగా ఉంటాయి. కుందుర్తి కవితల్లో ఉపమాలంకారం సహజ సుందరంగా ప్రయోగింపబడుతుంది.
అంతా అయిపోయాక ఆలస్యంగా వచ్చిన
తద్దినం పెట్టేవాడి తమ్ముడిలా
వచ్చింది కొత్త సంవత్సరం
డీలక్స్ బస్సు తప్పిపోయి
మామూలు ప్యాసింజరు బస్సు
ఫుట్బోర్డు మీద వేలాడుతూ
ఆగినప్పుడు అందరితో పాటు
క్రిందిగా దిగి తోస్తూ
అలసిపోయి, సొలసిపోయి
ఆలస్యగా వచ్చింది కొత్త సంవత్సరం
(వసంతుడి కోసం పోలీసులు)
సర్కస్ డేరాల్లో ఆడే పులులు
చెరువల్లో చేపల్ని పట్టుకోలేని వలలు
చక్రవడ్డీ పరిధుల్లో అసువులు బాసిన అసళ్ళు
కన్నీళ్ళు కార్చే మొసళ్ళు
(రెండు లోకాలు)
ఇలా వస్తువుకు అనుగుణంగా సహజంగా ఉపమాకాళి దాసస్య అన్నట్టు కుందుర్తి కవితల నిండా ఉపమ కన్పిస్తుంది.
సంకెళ్ళు లేని కాళ్ళు
నిర్భంధ ప్రాస నియమాలతో నిమిత్తం లేక కవిత్వాలు
ధనగిరుల గర్వాన్ని అణచిన మునిశిఖామణులు
కిరాతకుడి బాణం పలికించిన ఉత్తమశ్లోకాలు
(రెండు లోకాలు)
వంటి పంక్తుల్లో కుందుర్తి స్వేచ్ఛా భావనతో పాటు ఆయన కవితలోని సంప్రదాయ నేపథ్యం కన్పిస్తుంది. ధనగిరుల గర్వాన్ని అణచిన ముని శిఖామణులు అనే పంక్తిలో వింధ్య గర్వమణిచిన అగస్త్యుడు, కిరాతకుడి బాణం పలికించిన ఉత్తమ శ్లోకాలులో క్రౌంచ మిధునం వైపు బాణం గురిపెట్టిన కిరాతుని శపించిన వాల్మీకి శోకమే శ్లోకమైన మానిషాద గుర్తుకొస్తాయి. కుందుర్తి ఎంత ఆధునికులో ఆయన కవితలో అంత సాంప్రదాయికత తొంగి చూస్తుంది.
నేడు బ్రతుకు గాఢనిద్రలో కలిగిన పీడకల
విస్మరించు గతాన్ని
చరిత్రను కరచిన అనుభవాల వాసుకితో
మధించు ప్రస్తుతాన్ని
మనం కోరుకుందాం సస్యలక్ష్మిని ముందు
దీనికి ముందు, ఆనకట్ట తగిలి అదే వాహిని
పొలం మీద పారే జలం జాతికి బలం
కడలి శత్రువును మాయచేసి
అదే మనకమృతం పంచే మోహిని
జగతి మాత శల్యాలను కొరికే
సమస్త పురాణ రోగాలకు
మన చైతన్యం ధన్వంత్రి
( సముద్ర మధనం – యుగేయుగే )
అన్నది కుందుర్తి కవితా సందేశం.
కుందుర్తి వచన కవితా వికాసం కోసం 1956లో హైద్రాబాదులో ఫ్రీవర్స్ ఫ్రంట్ స్థాపించారు. ఎందరో యువ కవులను వచన కవిత రాయండని ప్రోత్సహించారు. ప్రతి సంవత్సరం ఉత్తమ వచన కవితా సంపుటికి అవార్డులనిచ్చి ప్రోత్సహించారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రయాణం ఐదు దశాబ్దాలకు చేరువవుతున్నది. ప్రముఖ చిత్రకారులు, కవి శీలావీర్రాజు వంటి పెద్దలు, కుందుర్తి కుమారుడు సత్యమూర్తి కుందుర్తి ఆశయ సాధనకు ఫ్రీవర్స్ ఫ్రంట్ ద్వారా కృషి చేశారు. వచన కవితలో కథా కావ్యాలు రావాలన్నది కుందుర్తి ఆకాంక్ష. ఆ దిశగా అజ్ఞాన శైశవం, ఆరంభ యౌవనం, అసమర్థ కౌమారం, అవసాన వార్థక్యం అనే గీతాలను రాసి చూపించారు. తిలక్ దీనిని వ్యతిరేకించారు.
సంప్రదాయ వాదుల ఆమోద ముద్ర దీనికి ఉండాలనేవారు కుందుర్తి. వచన కవిత్వంలో ప్రయోగాలు జరగాలనే ఉద్దేశంతో ఆయన ఆశ, శిక్ష ఏమిటి అనే వచన గేయ నాటికల్ని రచించారు. పద్యమే కవిత్వమన్న సంప్రదాయవా దులైన కవుల చేత వచన కవితలు రాయించిన ఘనత కుందుర్తిదే. తెలుగు సాహిత్యంలో విమర్శ ఇంకా రావలసి ఉందనే వారు కుందుర్తి. మనకున్న విమర్శా దీపం చిన్నది అన్నారు. కుందుర్తి ఆశించిన విమర్శ ఈనాడు రావడం కొంత ముదావహం. 1968లో కుందుర్తి సోవియట్ లాండ్ బహుమతి పొందారు. కవిత్వంలో కుందుర్తి కృతులకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును అందుకున్నారు. ఆంధ్ర దేశంలో ఎన్నో సన్మానాలను ఆయన పొందారు. వచన కవితను ఉద్యమంగా నడిపి ఆ ప్రక్రియ సర్వతోముఖ వికాసానికి కృషి చేసిన కుందుర్తి ప్రజలలో చైతన్యాన్ని కలిగించడమే కవిత్వ ప్రయోజనమని నమ్మిన క్రాంతిదర్శి. కన్ను మూసేదాకా అభ్యుదయ చేతనతో చైతన్య కవిత రచించిన
వచన కవితా చక్రవర్తి కుందుర్తి.
మళ్ళీ నరజన్మ ఎందుకంటే
మనుషులంటే ఇష్టం నాకు
దేవుడికంటే మనిషి ఇష్టం
దేశం ఇష్టం – తెలుగు ఇష్టం (నాలోని నాదాలు)
-డా.తిరునగరి శ్రీనివాస్
8466053933