ఓంకార స్వరూపమా
త్రిలోక విఘ్నవినాయకా
కాసేపు స్వనంద లోకం వీడి
మా మొర ఆలకించ రావయ్యా
ఇల వేళ్లూనుకున్న
కుల,మత విబేధాలు
జాతి వర్ణ విధ్వేషాలు
సాంఘీక దురాచారాలు
సామాజిక అసమానతల్ని
వక్రతుండంతో ప్రక్షాళనచేసి
సమభావం ప్రసాదించు గణేషా
అంతటా పెట్రేగుతున్న
వినాశకర దుశ్చర్యలు
వికృత వింత పోకడలు
అజ్ఞానపు చిమ్మ చీకట్లను
అంకుశంతో అంతంగావించి
జ్ఞాన జ్యోతి వెలిగించు విగ్నేషా
అష్టదిక్కుల ధ్వనిస్తున్న
అన్నార్తుల ఆక్రందనలు
అన్నదాతల ఆర్థనాదాలు
వలస బతుకుల విలాపాలు
కష్టజీవుల వేదన రోదనలను
ఏకదంతంతో తుదముట్టించి
వికాసగీతం విన్పించు అవనీషా
ప్రకృతి వైపరీత్యాలు
పర్యావరణ ప్రకంపనలు
అకాల వర్షభీభత్సాలను
దివ్యాస్త్రంతో నియంత్రించి
విశ్వమానవ జగతి యావత్తు
శాంతిమయం గావించు జగదీషా
నమో…నమోస్తుతే గజాననా!
ప్రణతి..మనోప్రణతి గణనాధా!!
(ఆగస్టు 31 న వినాయక చవితి పర్వదినం సందర్బంగా…)
– కోడిగూటి తిరుపతి, 9573929493




