‘‘ఇక్కడ అపార్ట్మెంట్స్ లో 10 ఫ్లాట్స్ ఉండని, వంద ఫ్లాట్స్ ఉండని, వీళ్ళు నివసించే అపార్ట్మెంట్ బిల్డింగ్ లో ఒకరికొకరు మాట్లాడుకోవడం దేవుడెరుగు, కనీసం తెలిసే అవకాశమే ఉండదు. అసలు ఎన్ని నెలలైనా ఒకరి మొహం ఒకడు చూసుకోరు. చూసుకున్న పలకరించారు. అసలు అంత సమయమే ఉండదు.’’
1960, 70 దశకాలలో పుట్టిన వాళ్లంతా ఇప్పుడు 50 లలో 60 లలో ఉన్నారు. వాళ్లంతా హైదరాబాదుకు వారి పిల్లల పిల్లల గురించి రావడం. వారి సంతానం కొడకైతే, కొడుకు కోడలు, బిడ్డ అయితే బిడ్డ అల్లుడు ఉద్యోగాలు చేస్తుంటారు. వీరిలో చాలామంది ఈ కంప్యూటర్ రంగాల్లో ఉద్యోగాలు చేయడం వల్ల తీరిక ఉండడం లేదు. వారి పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఈ వయస్సు మళ్ళిన వారి మీద పడింది. ఉమ్మడి కుటుంబాలు లేని దరిద్రం ఇది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు సాధ్యం కాదు. ఈ తిప్పలు ఈ తరం వాళ్లకి తప్పవు. వాళ్ల వల్ల మందు తరాలకి తప్పడం లేదు.
ఈ ముందు తరం తల్లిదండ్రులు చిన్న చిన్న నగరాలలో పల్లెలలో జీవించారు. ప్రకృతి మధ్యన తెలిసిన బంధుమిత్రులతో హాయిగా ఎన్ని కష్టాలు వచ్చినా తమ పిల్లల్ని ఎంతో కష్టంతో పెంచి పెద్ద చేశారు. కష్టాలు నష్టాలు వస్తే పంచుకునేందుకు పక్కన బంధువులు స్నేహితులు ఉండేవారు. తెలిసిన స్థలాలు.. ఒక్కరి ఎక్కడికైనా వెళ్లగలిగే వారు. అంత చక్కటి పరిస్థితులు వదిలిపెట్టుకొని వారి మనవలు, మనవరాళ్ళ కోసం వారి తరమయినా కాకపోయినా ముందు తరం ఎదగాలని వాళ్ళ ఊర్లలో విశాలమైన ఇల్లు, స్థలాలు కూడా అమ్ముకొని వచ్చి ఇక్కడ అపార్ట్మెంట్స్ చిన్న చిన్న ఫ్లాట్స్ లో, సౌకర్యంగా గడపవలసిన శేష జీవితం కఠినంగా వెళ్లదీస్తున్నారు
ఈ ఫ్లాట్స్ లో ఎక్కడికి వెళ్లాలన్నా లిఫ్ట్ కోసం వేచి ఉండాలి. గేటెడ్ కమ్యూనిటీస్ లో అయితే అసలు ఏదైనా కొనుక్కునేందుకు బయటికి రావడం మోకాలు నొప్పులతో ఓ సాహసమే అవుతుంది.
శరీరం ఎంత సహకరించిన సహకరించకపోయిన పిల్లల గురించి పెంద లాడే లేచి వారికి వంట చేయడం పిల్లలకు తినిపించడం అవసరమైతే కూరగాయలు ఇతర సామాన్లు తీసుకురావడం చేయాల్సి వస్తుంది. ఇంత చేసి రాత్రి నిద్ర పోదామంటే ఊరు నిండా కుక్కలు. విపరీతమైన అరుపులు. మంచి నిద్ర పట్టే సమయానికి పక్కనే ఎవరో పెద్ద సౌండ్ పెట్టుకొని టీవీ చూస్తుంటారు నడి రాత్రి వరకు. ఇక పైన ఒక ఫ్లోర్ ఉంటే వాళ్ళ చప్పుడు. చుట్టుపక్కల ఎప్పుడు ఏదో ఒక నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. దానికి సంబంధించిన ఫ్లోరింగ్ చేసేటప్పుడు ఏదో చెక్కపని కావాల్సిన కోతల చప్పుడు ఏదో చప్పడు నిరంతరం వినబడుతూనే ఉంటుంది. అలా నిద్ర పట్టి చావదు.ఫ్లాట్స్ లో ఉండే వాళ్ళకి కుక్కలు ఉంటాయి.ఇక్కడ ఒక మనిషి అవసరానికైనా అరిస్తే ఇంకొక మనిషి పట్టించుకోడు. కానీ ఈ ఫ్లాట్స్ లో ఉన్న ఒక కుక్క మొరిగితే మిగతా వీది కుక్కలు, ఇతర ఫ్లాట్స్ లోని కుక్కలు వాటీతో మోరుగుతూనే ఉంటాయి. పొద్దున్నే లేవగానే ఆ కుక్కల యజమానులు వాటిని వాటి కాల కృత్యాల కోసం పట్టుకొని రోడ్డుమీద తిప్పుతారు.
అవి బయట ఒకటి రెండు చేస్తూ అసలే అపరిశుభ్రంగా ఉన్న రోడ్లన్నీ ఇంకా గలీజ్ చేస్తాయి. ఇక వర్షాకాలం అయితే వాటి పెంట, మురికి కాలువల నీరు వాన నీరు కలిసి రచ్చ రచ్చ అవుతుంది. చాలా కాలనీలలో రోడ్లు సరిగా ఉండవు. ఎత్తులు వంపులుంటాయి. ఏదో నిర్మాణం అవుతుంది ఆ బిల్డింగ్ ల ముందు ఇసుక, రాళ్లు వేయడ వల్ల పెద్ద మనుషుల నడవడం కూడా కష్టమే.ఏ చిన్న ఆరోగ్యం కారణాన డాక్టర్ దగ్గరికి పోతే పెద్ద పెద్ద క్యూలు. ముందు అపాయింట్మెంట్ తీసుకున్న ఒక్కొక్క డాక్టర్ నాలుగైదు హాస్పిటల్స్ లో చూస్తూ ఉండడం వల్ల, సమయానికి రారు. అంతేకాకుండా విపరీతమైన ఖర్చు. చిన్న ఊరిలో ఉంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి అయ్యే ఖర్చులో ఇక్కడ నాలుగు నుండి పది అంతలు కూడా అవుతాయి.
ఊర్లోనే ఉన్న చుట్టాల ఇండ్లలో ఏదైనా శుభశుభకార్యాలు అయితే పోవాలంటే ఎంతో కష్టం. ఎప్పుడు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలియదు. చిన్న ఊరిలో 10 కిలోమీటర్ల కి పది నిమిషాలు అయితే ఇక్కడ గంట కావచ్చు రెండు గంటలు కావచ్చు. ఒకే దగ్గరికి ట్రాఫిక్ జామ్ వల్ల గంట ఉండవచ్చు. అక్కడ కార్లు ఎన్ని ఉంటాయంటే అసలు కార్ లో నుంచి బయటికి రారాదు. మూత్రం వస్తే పోరాదు. చాలా మందికేమో ముఖ్యంగా పెద్దలకు షుగర్ రోగం వల్ల మూత్రం ఆపుకోలేరు.. అలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్న వాళ్ళ మానసిక స్థితి చెప్పనలవి కాదు. అంతెందుకు ఏ ట్రాఫిక్ జామ్ లేకున్నా ప్రయాణం మధ్యలో మూత్రం వస్తే పోసేందుకు సరియైన స్థలం దొరకదు. ఒక్కోసారి తన గంట స్థానం దాటి మూత్రం పోసేందుకు ఒక కిలోమీటర్ కూడా ప్రయాణం నడిచి మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది.
కూరగాయ ధరలు మొదలు అన్ని వస్తువుల ధరలు అత్యంత ఎక్కువ. అసలే బొటాబొటి పెన్షన్ మీద బతికే వాళ్ళకి, వారి సంపాదనలో ఎక్కువ భాగం ఫ్లాట్స్ రెంట్ కే కట్టవలసి రావడం వల్ల వారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేని పరిస్థితి చాలా మందికి వస్తుంది.
ఇక్కడ మాత్రం ఒక సౌకర్యం ఉంది. ఆరోగ్యం కోసం నడక సాగించేందుకు పార్కులు ఉంటాయి. కానీ వాటిని చేరేందుకు ఆ రెండు మూడు వందల గజాలు భయంకరమైన వాహనాల కాలుష్యాన్ని పీలుస్తూ పోవాల్సిందే. వాటిలో విపరీతమైన రద్దీ. వాకింగ్ చేస్తూ కూడా సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటారు. అందులో పిల్లల అటు ఇటు ఆడుతూ తిరుగుతుంటారు. ఎక్కడ గుద్దేసి పడేస్తారో తెలియదు. అదే పల్లెటూర్లలో చిన్న చిన్న నగరాల్లో అయితే హాయిగా ప్రకృతి మధ్య విశాలమయిన రోడ్లు లేకున్నా రద్దీ ఉండదు. కాబట్టి ప్రకృతి సహజ శబ్దాలను వింటూ ఆరోగ్యంగా అంత తెలిసిన వాళ్లే కాబట్టి వారితో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నడిచే అవకాశం ఉంటుంది.
ఇక్కడ అపార్ట్మెంట్స్ లో 10 ఫ్లాట్స్ ఉండని, వంద ఫ్లాట్స్ ఉండని, వీళ్ళు నివసించే అపార్ట్మెంట్ బిల్డింగ్ లో ఒకరికొకరు మాట్లాడుకోవడం దేవుడెరుగు, కనీసం తెలిసే అవకాశమే ఉండదు. అసలు ఎన్ని నెలలైనా ఒకరి మొహం ఒకడు చూసుకోరు. చూసుకున్న పలకరించారు. అసలు అంత సమయమే ఉండదు.
దశాబ్దాల తరబడి మిత్రులు ఇరుగుపొరుగు వారంతా అందరిని విడిచి ఇలాంటి పెద్ద నగరాలకు రావడం చాలా బాధాకరంగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఈ నగరాల్లో, ఆ చిన్న నగరాలలో పల్లెటూరులలో ఉన్న ఆప్యాయత అనురాగాలు దొరకవు. పోతే భయంకరమైన కాలుష్యం ఒకటి. పల్లెటూర్లలో అసలు కాలుష్యం ఉండదు. ఒకవేళ ఈ మధ్య బాగా పెరిగిన వాహనాల వల్ల కొంత కాలుష్యం ఉన్న ఈ నగరాలలో దానికన్నా వెయ్యి అంతలు ఎక్కువ ఉంటుంది. శబ్ద కాలుష్యం అయితే భరించరానిది. అంతేకాకుండా ఇక్కడ జనాభాలో ఏ వస్తువు అయినా కొనాలి తినాలి అంటే భయమేస్తుంది. ఎందులో ఏ కల్తీ ఉందో అనే భయం. కూరగాయలు మనకు తాజాగా దొరకడం అనేది అసంభవం. ఎక్కడి నుండో వస్తాయి. వాటిని కెమికల్స్ లో ముంచి తాజాగా చేస్తున్నారు.
ఎప్పుడో ఒకప్పుడు సినిమాకు వెళ్తే వేల రూపాయల ఖర్చు. ఆహార పదార్థాలు రకరకాలుగా దొరుకుతుంటాయి. ఇక్కడ ఆన్ లైన్ లో స్విగ్గి, జొమాటో లాంటి వాటి ద్వారా మనకు అవసరమైన ముఖ్యంగా ఆహార పదార్థాలు తెప్పించుకునే సౌకర్యం ఉంటుంది. కాబట్టి ఏ కొద్దిగా నలుసుగా ఉన్న వండుకోకుండా ఈ ఆన్లైన్ లో తెప్పించుకోవడం దానిమీద విపరీతమైన టాక్స్ లు మళ్ళీ ఆహార పదార్థాలు ఎలా ఉంటాయో అని భయం. పల్లెటూర్లో చిన్న నగరాల్లో ఏ దసరాకో బతుకమ్మకో తప్పితే కానీ మనం పెద్ద సంఖ్యలు జనం గుమి కూడటం కనబడదు. ఇక్కడ ప్రతిరోజు బస్టాండ్ లో రోడ్లలో బతుకమ్మ దసరాలే. ప్రతి చిన్నదానికి పెద్ద క్యూ. పెద్ద వయసు వాళ్ళు నిలబడలేరు. కూర్చునేందుకు ఏమి సౌకర్యాలు ఉండవు. పేరుకే పెద్ద నగరాలు కానీ పాశ్చాత్య దేశాలలో ఉన్నట్టు పెద్దవాళ్లకు కానీ, కాస్త అనారోగ్యం ఉన్నవాళ్లకు వికలాంగులకు సౌకర్యాలు శూన్యం.
ఎటైనా వెళ్లాలంటే తిరిగి బతికి వస్తామా అనిపిస్తుంది. చుట్టూ పక్కల ఎక్కడి నుంచి ఏది వస్తుందో తెలియదు. విపరీతమైన వేగంతో బైకులు, ఆటో రిక్షాలు తోలుతుంటారు వాటి మధ్య నుండి రోడ్డు దాటాలంటే పద్మవ్యూహాన్ని చేదించినట్టు ఉంటుంది.
సొంత కారు డ్రైవర్ ఉంటేనే ప్రయాణం కష్టం. ఇంకా అవి లేని వాళ్ళైతే ఆ మెట్రోల్లో బస్సులలో ఆటోలలో తిరగడం ఒక పరీక్ష లాగుంటుంది. ఈ మధ్యన యువకులు బాగా విపరీతంగా చప్పుడు చేసేటువంటి బండ్లు కొనుక్కుంటారు. వాటిని ఆక్సిలరేటర్ విపరీతంగా పెంచేసి విపరీతంగా చప్పుడు చేస్తూ నడి రాత్రి నడుపతారు. వారిని నియంత్రించే నాధుడే ఉండడు. అసలు అంత చదువుకొని ఆ శబ్ద కాలుష్యం గురించి తెలియకపోవడం శోచనీయం. ఇకపోతే గుడుల పక్కన ఖర్మగాలి ఇల్లు ఉంటే, మత కాలుష్యానికి తోడు శబ్ద కాలుష్యం. పొద్దున్నే మైకులు పెడతారు. అర్థమైన కాకున్న సంస్కృత శ్లోకాలు లేక భక్తి పాటలు ఇష్టం ఉన్నా లేకున్నా వినవలసిందే.
సొంత ఊర్లలో కొన్ని నెలలకు గాని మనం గుండెల్లో దడ పుట్టించే అంబులెన్స్ సైరన్లు వినం. ఇక్కడ ప్రతిరోజు ఒక రెండు మూడు సార్లు అయినా ఆ చప్పుడు వినవాల్సిందే.
ఈ మధ్య హైరైస్ బిల్డింగ్ లు వచ్చాయి. 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు ఉంటాయి. వాటిల్లో 30 వ ఫ్లోర్లో ఉన్న వారిని కలవాలంటే ఒక ప్రభుత్వ ఆఫీసులో పని చేయించుకున్నట్టే ఉంటుంది. ముందు తెలిసినవారిని వాచ్మెన్ కి చెప్పు అని, వాచ్మెన్ దగ్గర పర్మిషన్ తీసుకొని రెండు మూడు వందల గజాలు నడిచి లిఫ్ట్ దగ్గరికి పోయి అందులో మొత్తం బయటికి ఏమీ కనపడని జైలులా ఉన్నా లిఫ్టులో బిక్కు బిక్కుమంటూ ఆ ఫ్లోర్ లో పైకి వెళ్లాలి. అది ఎక్కడ ఆగుతుందో తెలియదు.పల్లెటూరులో తోట చెట్లు ఉన్న సొంత ఇల్లు ఇతర ఆస్తులు అమ్ముకున్న అదే డబ్బుతో ఇక్కడ చిన్న ఫ్లాట్ కూడా రాదు. ఆ ఫ్లాట్లో అంతకు ముందు వాళ్ళ అనుభవించిన సొంత ఇల్లు సుఖం లేశ మాత్రం కూడా ఉండదు.కానీ కాలగమనాన్ని అది తెచ్చే మార్పుల్ని ఎవర ఆపగలరు? భరించడం తప్ప!
– డా।। మండవ ప్రసాద్ రావు, 9963013078 హైదరాబాద్



