ధరణి పేరుతో భారీ భూకుంభకోణం

  • తెలంగాణలో కాళేశ్వరం, ధరణిల ద్వారా భారీ అవినీతి
  • ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక మూడు నెలలకే ధరణి విధుల నుంచి తప్పుకున్న టిసిఎస్‌
  • ‌తర్వాత దివాలా కంపెనీ ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు…
  • అనంతరం మనుగడే ప్రశ్నార్థకంగా ఉన్న టెర్రాసిస్‌కు అప్పజెప్పిన వైనం
  • ధరణిపై విచారణకు వెనక్కు తగ్గేది లేదు
  • నేడు బిజెపి మేనిఫెస్టో విడుదల చేయనున్న అమిత్‌ ‌షా
  • బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ ‌ప్రకాష్‌ ‌జవదేకర్‌

‌ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 17 : ‌ధరణి పేరుతో తెలంగాణలో భారీ భూకుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ ‌ప్రకాష్‌ ‌జవదేకర్‌ అన్నారు. ఇది కాళేశ్వరం కుంభకోణం కంటే పెద్దదని ఆరోపించారు. ధరణి కారణంగా విలువైన భూమిని కోల్పోయారని, ఇది లక్షల మంది తెలంగాణ రైతులు, ప్రజలకు బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేసిన అతిపెద్ద మోసం అన్నారు. కానీ ప్రభుత్వం ధరణిని సర్వరోగ నివారిణి అని గొప్పగా ప్రచారం చేసుకుంటుందన్నారు. ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడలోని హోటల్‌ ‌కత్రియాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ ‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కే.లక్ష్మణ్‌లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ…గ్రామాల్లో రెవెన్యూ రికార్డులను నిర్వహించాల్సిన వీఆర్వోల వ్యవస్థను లేకుండా చేయడం ద్వారా గ్రామాల్లోని భూరికార్డులను ప్రభుత్వం తీసేసుకుని ఎవరికీ ఈ రికార్డులు అందకుండా చేశారన్నారు. ధరణిలో రెవెన్యూ రికార్డులను మార్చేసి, పట్టేదార్‌, ‌పొసెషన్‌(అనుభవదారు)ల స్థానంలో బినామీ, అక్రమంగా చొరబాటుదారు అని పేర్లు చేర్చారన్నారు.

కేంద్ర ప్రభుత్వం, ఎన్‌ఐసీ రూపొందించిన కంప్యూటరైజ్డ్ ‌సాఫ్ట్‌వేర్‌ అన్ని రాష్ట్రాలకు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలే ఈ భూ రికార్డులను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మాడిఫై(అప్‌డేట్‌) ‌చేసుకునేందుకు వీలుంటుందన్నారు. మొదట్లో ఈ రికార్డులను ఆధునీకరించే పక్రియను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(‌టీసీఎస్‌) ‌కంపెనీకి అప్పగించారన్నారు. మొదటి 3 నెలలు ఈ రికార్డులను పద్ధతిగా నిర్వహించిన టీసీఎస్‌ ‌కంపెనీ ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో విధుల నుంచి తప్పుకుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం కోరినట్లుగా టీసీఎస్‌ ‌పనిచేయనందునే తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి పెంచినట్లు తెలిసిందన్నారు. టీసీఎస్‌ ‌కంపెనీ ఈ భాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ అనే మరో కంపెనీకి అప్పజెప్పారని తెలిపారు. ఆ కంపెనీ కూడా దివాలా తీసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాఫ్ట్‌వేర్‌ను టెర్రాసిస్‌ అనే మరో కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పిందన్నారు.

ఈ టెర్రాసిస్‌ ‌కంపెనీ మనుగడ ప్రశ్నార్థకంగా ఉందన్నారు. వాస్తవమైన భూ రికార్డులను పూర్తిగా గందరగోళంగా చేసేసిన తర్వాత కేంద్రం ఇచ్చిన నిబంధనలను బేఖాతరు చేస్తూ కొత్త రూల్స్(‌వేస్‌ ‌మీన్స్) ‌ను తీసుకొచ్చారన్నారు. దీంతో భారీమొత్తంలో భూరికార్డులు తారు మారయ్యాయని ఆరోపణలు వొచ్చాయన్నారు. వ్యవసాయ భూములు, ప్రైవేటు భూములు, ప్రభుత్వ భూములు, ఈడీ సీజ్‌ ‌చేసిన భూములు, దేవాలయ భూములు, చెరువులు, కాందీశీకుల భూమి(ఎవాక్యూ ప్రాపర్టీ), పరిశ్రమల భూములు, భూదాన్‌ ‌భూములు, ఎక్స్-‌సర్వీస్‌మెన్‌ ‌భూములు, స్వాతంత్య్ర సమరయోధుల భూములు, పైగా లాండ్స్, ‌బ్లూబుక్‌ ‌ల్యాండ్స్ ‌పెద్దమొత్తంలో అవకతవకలు జరిగాయన్నారు. విశ్వసనీయ వర్గాలు, నిపుణులు చెబుతున్నదాని ప్రకారం ఓ విదేశీ కంపెనీ రూపొందించిన యాప్‌(‌మొబైల్‌ అప్లికేషన్‌) ‌ధరణిలోని డిజిటల్‌ ‌ప్రాపర్టీ డాక్యుమెంట్స్‌ను పొందినట్లు (యాక్సెస్‌ ‌చేసినట్లు) తెలుస్తుందన్నారు. వివిధ కోడ్ల సీక్వెన్షియల్‌ ‌స్కానింగ్‌ ‌ద్వారా ధరణి డేటాను పరిశీలించారని అర్తమవుతుందన్నారు.

ప్రభుత్వ డేటాను ఓ ప్రయివేటు కంపనీ మైనింగ్‌ ‌చేయడం(లోతుగా పరిశీలించడం) సాధ్యం కాదనే విషయం అందరికీ తెలిసిందే అన్నారు. కానీ తెలంగాణలో మాత్రం దీనికి విరుద్ధంగా ప్రభుత్వ కీలక డేటాను ఓ ప్రైవేటు కంపెనీ మైనింగ్‌ ‌చేసిందన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ను ప్రస్తుత రెవెన్యూ శాఖ ప్రాసెస్‌లో నుంచి తొలగించి దీన్ని ల్యాండ్‌ ‌రికార్డుల్లోకి చేర్చారన్నారు. ప్రస్తుతం ఉన్న సీఏఆర్‌ ‌డి సాఫ్ట్‌వేర్‌కు బదులుగా ధరణికి ఓ కొత్త సాఫ్ట్‌వేర్‌ను డెవలప్‌ ‌చేశారని అన్నారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా, గ్రామ సభలను నిర్వహించకుండా భూరికార్డుల ధృవీకరణ వ్యవస్థను తారుమారు చేశారన్నారు. దీని కారణంగా చాలా సర్వే నెంబర్లు మిస్‌ అయ్యాయన్నారు.

కానీ ఈ సమస్యలను పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేయడంలో సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. 10 నుంచి 15 లక్షల నోషనల్‌(‌పట్టాలేనివి) ఖాతాలు ఉన్నాయన్నారు. లక్షల ఎకరాలు ప్రొహిబిషన్‌ ‌కింద చూపిస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ధరణి భూ కుంభకోణాన్ని పూర్తిగా విచారణ జరుపుతామని అన్నారు. భూ యజమానులకు న్యాయం చేస్తామన్నారు. బిఆర్‌ఎస్‌ ‌చెప్పిందే కరెక్ట్ అనేట్లు పరిస్థితి తయారైందన్నారు. అమిత్‌ ‌షా శనివారం మేనిఫెస్టో రిలీజ్‌ ‌చేస్తారని అన్నారు. ధరణి మీద మేం విచారణ జరుపుతాం, వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్నారు. కాళేశ్వరం, ధరణి రెండు భారీ కుంభకోణాలని అన్నారు. ఇది దొంగ ప్రభుత్వం అని, ప్రజలను మోసం చేసినందుకు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, ఓటమి తప్పదన్నారు. బీజేపీ గెలుస్తుందని, బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ఓడిపోవడం ఖాయం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *