భరతజాతి అమృతోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న సందర్భమిది. ఏడు దశాబ్దాలకు పైగా స్వతంత్ర భారతి పురోగమనదిశలో పయనించే సకల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మహిళాశక్తి నిర్వీర్యం కావడం చూస్తూనే ఉన్నాం. దేశంలోని నేటికీ అధిక జనాభా పేదరికంలోనే మగ్గుతున్నారు.
ప్రకృతిలో సగభాగమైన మహిళ శక్తియుక్తులను వినియోగించుకోవడంలో ఈ పురుషాధిక్య సమాజం ఉద్దేశపూరితంగానే నిర్లక్ష్యం చేస్తున్నట్లు గత చరిత్ర బోధిస్తున్నది. మహిళల్లో అవిద్య, ఇంటర్నెట్ అజ్ఞానం, భాషా హద్దులతో పేద మహిళలు అభివృద్ధికి దూరంగా, పేదరికానికి సమీపంగా మగ్గుతూనే ఉన్నారు. విద్యావంతులైన మహిళలు కూడా అర్హతకు తగిన ఉద్యోగాలు, ఉద్యోగాలకు తగిన వేతనాలు పొందడంలో విఫలం అవుతున్నారు.
మానవీయత పలుచబడడం, విడాకుల సంస్కృతులు పెరగడం, సింగిల్ పేరెంటింగ్ భావనలు సర్వసాధారణం కావడం, సహజీవన విధానాలు బయట పడడం, సువిశాలా భవనాల్లో మానవ సంబంధాలు పలుచబడడం లాంటి నవ్య నాగరికతలు మొలకెత్తుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 432 మిలియన్ల మహిళలు పని చేయగల స్థితిలో ఉండగా, వీరిలో 343 మిలియన్ల మహిళలు అసంఘటిత రంగంలోనే ఉన్నారు. దేశ జిడిపిలో 18 శాతం వరకు మహిళలు అందిస్తున్నట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. కరోనా విపత్తు సమయంలో లక్షల మంది యువత, ముఖ్యంగా మహిళలు ఉద్యోగ ఉపాధులను కోల్పోయిన సంగతి మనకు తెలుసు.
ఉన్నత విద్య లేకపోవడం, వివాహ సంబంధ సమస్యలు, సంతాన బాధ్యతలు, కుటుంబ భద్రత, పని ప్రదేశం నుంచి దూరంగా ఉండడం, రవాణా వసతుల కొరత, గృహ సంబంధ బంధనాలు, లింగ వివక్ష, అసమాన వేతనాలు, ఆర్థిక స్వేచ్ఛ లేకపోవడం, ఆడది వంటింటి కుందేలని భావించడం, చులకన భావం లాంటి పలు సమస్యలతో మహిళలు తమ నైపుణ్యాలను భరతమాత సేవలో అంకితం చేయలేక పోవడం సోచనీయం. మహిళా సాధికారత, మహిళా స్వేచ్ఛలకు వ్యత్యాసాలను తెలుసుకోవాలి. విద్యార్హతలు పెరిగితే వేతనాలు, గౌరవం, ఆర్థిక స్వేచ్ఛలు అధికం అవుతాయి.





