బిజెపి వొస్తే…రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్లు రద్దు
మోదీ అమిత్ షా నాపై పగబట్టారు
10 ఏళ్లలో తెలంగాణకు ఇచ్చింది ‘గాడిద గుడ్డు’
కేసులకు భయపడను.. నా వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలు
తెలంగాణ పౌరుషానికి..గుజరాత్ ఆధిపత్యానికి మధ్య పోటీ
ప్రస్తుత ఎన్నికలు ప్రత్యేకమైనవి..ప్రజలు ఆలోచించాలి
కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం
కోరుట్ల జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కోరుట్ల(జగిత్యాల), ప్రజాతంత్ర, మే 1 : ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలవాలని భాజపా చూస్తుందని..తద్వారా దేశాన్ని అమ్మేయాలని భావిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే రిజర్వేషన్లను రద్దు చేయడమేనా..అంటూ రేవంత్ ప్రశ్నించారు. దేశంలో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వొస్తే, రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్ల ఎత్తివేతతో బలహీన వర్గాలకు దక్కాల్సిన అవకాశాలు, నిధులు రావని ఆయన తెలిపారు. రిజర్వేషన్లపై గొంతెత్తి ప్రశ్నించినందుకు తనపై పగబట్టి స్వయంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రే కేసు పెట్టారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీలపై రేవంత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బుధవారం నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని జగిత్యాల జిల్లాలోని కోరుట్ల జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల బహిరంగ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ…ఇప్పుడు జరుగుతున్న లోక్ సభ ఎన్నికలు గతం కంటే భిన్నమన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలని ప్రజలను బిజెపి అభ్యర్థించడం వెనుక పార్లమెంటులో 2/3 మెజార్టీ సాధించి రాజ్యాంగాన్ని మార్చడంతో పాటు రిజర్వేషన్లను రద్దుపరిచే కుట్రలో భాగమేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఈ ఎలక్షన్స్‌లో 400 ఎంపీ సీట్లు గెలవాలని, దేశాన్ని అమ్మేయాలని బీజేపీ చూస్తుందని, తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేయాలని చూస్తే కమలం పార్టీ అడ్డుకుంటుందన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయని, రిజర్వేషన్లపై మాట్లాడుతుంటే నాపై దేశ హోమ్ మంత్రే కేసు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. బలహీన వర్గాలకు దక్కాల్సిన అవకాశాలు, నిధులు రాలేదని, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ఇచ్చిందని, రిజర్వేషన్లు రద్దు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎటు వెళ్లాలని, ఈ అంశంపై తాను ప్రశ్నించానని, అందుకే మోదీ, అమిత్ షా తనపై పగబట్టి దిల్లీలో కేసు పెట్టారన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీతోనే కాదు.. దిల్లీ పోలీసులతో భయపెట్టాలని చూస్తున్నారని, కేసులకు రేవంత్ భయపడడని, చర్లపల్లి, జైలుకు కేసీఆర్ పంపితే తిరగబడి కొట్లాడానని, వారి దగ్గర సీబీఐ, ఈడీ, పోలీసులు ఉండొచ్చునని, తన వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలున్నారన్నారు. మోదీ గుజరాత్ వ్యక్తిలా వొచ్చి మనల్ని తిట్టారని, శపించారని అన్నారు. ఐదు రోజుల్లో ఇస్తామన్న పసుపు బోర్డు ఐదేళ్లయినా ఇవ్వలేదని, 20 ఏళ్ల నుంచి ఎన్నో ఆటుపోట్లు చూశానని, గుజరాత్ నుంచి వొచ్చి తెలంగాణలో పెత్తనం చేద్దామనుకుంటున్నారని, తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి మధ్య ఈ ఎన్నికల్లో పోటీ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
ప్రెస్ మీట్ పెట్టి భాజపా కుట్రలు బయటపెడతానని, రాజ్యాంగాన్ని ఎలా మార్చాలని చూస్తుందో వివరిస్తానని అన్నారు. రాజ్యాంగం మార్పు అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలోనే చేర్చారని, దీనికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కొనసాగించాలని చెప్పినందుకు తనపై, తన రాష్ట్ర నడిగడ్డపై నిలబడి సీఎంను బెదిరిస్తారా..మోదీ భయపెడితే బెదరడానికి ఇక్కడెవరూ లేరు..అంటూ రేవంత్ మండిపడ్డారు. తెలంగాణకు బిజెపి ప్రభుత్వం ఇచ్చింది పెద్ద ‘గాడిద గుడ్డు’ అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగాం.. వాళ్లు ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు కేంద్రం ఇచ్చింది ఏమీ లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘తెలంగాణ అడిగింది బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ.. భాజపా ఇచ్చింది ‘గాడిద గుడ్డు’. తెలంగాణ అడిగింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. భాజపా ఇచ్చింది ‘గాడిద గుడ్డు’. తెలంగాణ అడిగింది కృష్ణా, గోదావరిలో వాటాల పంపకం.. భాజపా ఇచ్చింది ‘గాడిద గుడ్డు’. తెలంగాణ అడిగింది మేడారం జాతరకు జాతీయ హోదా.. భాజపా ఇచ్చింది ‘గాడిద గుడ్డు’.
తెలంగాణ అభివృద్ధికి భాజపానే అడ్డు.. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద ‘గాడిద గుడ్డు’ అని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు ప్రజల నుండి భారీగా స్పందన లభించింది రేవంత్ ప్రశ్నలకు కేంద్రం ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ ప్రజలు ముక్తకంఠంతో ప్రతిస్పందించారు. విభజన హామీల అమలులో బీజేపీ నేతలు తెలంగాణను అవమానించి, మళ్లీ ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బలహీనవర్గాల జనాభా లెక్కలను మదింపు చేసి వారికి దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేశామని అన్నారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, మైనారిటీలు అందరికీ న్యాయం చేసే విధంగా రిజర్వేషన్లను కల్పిస్తామని ముఖ్యమంత్రి వెల్లడిరచారు. రాష్ట్రంలోని కార్మికులకు సీఎం రేవంత్? రెడ్డి మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరదని ఆయన తెలిపారు.సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మిక సంఘాలు సకలజనుల సమ్మె చేశారని గుర్తు చేశారు.రాష్ట్రంలో ప్రజల అండతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు.





