కొత్తగా 8329 మందికి పాజిటివ్
కొరోనా టెస్టు అవసరం లేదు …అమెరికా వెళ్లే ప్రయాణీకులకు తప్పనిసరి నిబంధన ఎత్తివేత
న్యూ దిల్లీ, జూన్ 11 : దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 40 వేలు దాటాయి. తాజాగా 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8329 కొత్త కేసులు నమోదు అవగా… 10 మరణాలు సంభవించాయి. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 40,370 యక్టీవ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసులు 0.09 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 4,32,13,435 కేసులు అవగా…5,24,757 మంది మృత్యువాతపడ్డారు. ఇక దేశంలో కొరోనా రికవరీ రేటు 98.69 శాతంగా ఉంది. శుక్రవారం కొరోనా నుంచి 4216 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా మొత్తంగా ఇప్పటి వరకు 4,26,48,308 మంది కొరోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.41 శాతం ఉండగా..వీక్లీ పాజిటివిటీ రేటు 1.75 శాతంగా ఉంది. సుమారు 103 రోజుల తర్వాత దేశంలో 8 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కొరోనా టెస్టు అవసరం లేదు …అమెరికా వెళ్లే ప్రయాణీకులకు తప్పనిసరి నిబంధన ఎత్తివేత
అమెరికా వెళ్లే ప్రయాణీకులకు బైడెన్ సర్కార్ తీపి కబురును అందించింది. విమాన ప్రయాణానికి ఒక రోజు ముందు తప్పనిసరిగా కొరోనా టెస్టు చేయించుకోవాలన్న నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 12:01 గంటల నుంచి అమల్లోకి రానుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ రోచెల్ వాలెన్స్కీ వెల్లడించారు. ఇందుకోసం సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నాలుగు పేజీల ఆర్డర్‌ను జారీ చేశారు.



