- ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఉద్దేశ్యమేంటి
- మణిపూర్ తగులబడితే ఎందుకు ఏర్పాటు చేయలే..
- మోదీ ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
ముంబై, సెప్టెంబర్ 1 : ఈనెల 18 నుంచి 22 వరకూ పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం పిలుపునివ్వడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం నిలదీశారు. మణిపూర్ తగులబడుతుంటే పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయలేదని ఎద్దేవా చేశారు. ఈ దేశం నియంతృత్వం దిశగా పయనిస్తుందని అన్నారు. ఈరోజు, ప్రతిపక్షాలను మాటమాత్రంగా కూడా అడక్కుండా పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చారు. మణిపూర్ తగులబడుతున్నప్పుడు కానీ, కోవిడ్ మహమ్మారి సమయంలో కానీ, చైనా అంశం, పెద్దనోట్ల రద్దు నిర్ణయం, వలస కార్మికులకు సంబంధించిన అంశాలపై ఒక్కసారి కూడా పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదని అని ముంబైలో జరిగిన ఇండియా కూటమి సమావేశానంతరం వి•డియాతో మాట్లాడుతూ ఖర్గే అన్నారు.
ఏ ఎజెండాతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారో తనకు తెలియదని, దేశాన్ని నడిపే పద్దతి మాత్రం ఇది కాదని ఆయన చురకలు వేశారు. క్రమంగా మనం నియంతృత్వం వైపుకు పయనిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడూ పేదల కోసం పనిచేయలేదని, నిరుద్యోగం, ఇంధనం ధరలు, ప్రజాసంక్షేమ అంశాలపై పోరాటమే ’ఇండియా’ కూటమి ఉద్దేశమని ఖర్గే చెప్పారు. దీనికి ముందు, పార్లమెంటరీ వ్యవహారల మంత్రి ప్రహ్లాద్ జోషి ఐదురోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. అయితే, సమావేశాల ఎజెండా మాత్రం ఆయన వెల్లడించలేదు.



