- ఎస్సీ, ఎస్టీ కోటాను ‘వోట్ జిహాద్’ కు ఇవ్వాలని కోరుకుంటున్న ఇండియా కూటమి
- మత ప్రాతిపదికన రిజెర్వేషన్లను రాజ్యాంగం అనుమతించదు : బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, మే 21 : ఈ దేశ ప్రజలు తప్ప తనకు వారసుడు, వారసత్వం లేవని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బీహార్‌లోని మహారాజ్‌గంజ్, మోతీహారి బహిరంగ సభలలో మోదీ మాట్లాడుతూ…ఆనాడు బీఆర్ అంబేద్కర్ లేకపోతే, జవహర్లాల్ నెహ్రూ షెడ్యూల్డ్ కులాల కోటాను అమలు చేసి ఉండేవాడు కాదని అన్నారు. జంగల్ రాజ్ తెచ్చిన వారు రిజర్వేషన్లపై ఒకదాని తర్వాత మరొకటి అబద్ధాలు మాట్లాడుతున్నారని, వాస్తవంగా అంబేద్కర్ లేకుంటే నెహ్రూ ఎస్సీ/ఎస్టీ కోటాను అనుమతించేవారు కాదని, ఈ మేరకు భారత తొలి ప్రధాని ముఖ్యమంత్రులకు లేఖలు కూడా రాశారని తెలిపారు. నెహ్రూ నుండి రాజీవ్ గాంధీ వరకు ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించారని, ఇప్పుడు వారికి ఒక్క వోటు బ్యాంకు మాత్రమే మిగిలి ఉందని ముప్లిమ్ వోట్లను ఉద్దేశించి అన్నారు.
మత ప్రాతిపదికన కోటాను రాజ్యాంగం అనుమతించదని, అయితే వారు ఆ మేరకు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారని మోదీ ఆరోపించారు. ఈ సందర్భంగా మోదీ మహాత్మా గాంధీని ప్రస్తుతిస్తూ, తాను గుజరాత్‌లోని బాపు జన్మస్థలం నుండి వొచ్చానని, ఇప్పుడు ప్రజల ఆశీర్వాదం కోసం చంపారన్‌కు వొచ్చానని అన్నారు. బాపు గొప్ప పరిశుభ్రతా వాది అని, అందుకే పేద తల్లిదండ్రుల కొడుకునైన తాను అధికారంలోకి వొచ్చిన తర్వాతనే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి వొచ్చిందన్నారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి ప్రసాద్ యాదవ్ జూన్ 4 తర్వాత తాను బలవంతంగా బెడ్ రెస్ట్ తీసుకోవలసి వొస్తుందని చేసిన వ్యాఖ్యపై మోదీ స్పందిస్తూ.. దేశంలో ఎవరూ బెడ్ రెస్ట్‌కు వెళ్లకూడదని తాను కోరుకుంటున్నానని, ప్రతి ఒక్కరికీ శక్తివంతమైన జీవితాన్ని కోరుకుంటున్నానని అన్నారు. తన ప్రత్యర్థులకు తాను కంటి మీద కునుకు లేకుండా చేసి ఉండవొచ్చు కానీ, తాను మాత్రం ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటానని మోదీ అన్నారు.





