దీదీ ఇంట్లోకి ఆగంతకుడి చొరబాటు

తుపాకీతో ఉన్న వ్యక్తిని పట్టుకున్న భద్రతా సిబ్బంది
కోల్‌కతా, జూలై 21 : పశ్చిమ బెంగాల్‌ ‌సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి ఒక వ్యక్తి గన్‌తో చొరబడేందుకు ప్రయత్నించాడు. అలెర్ట్ అయిన పోలీసులు అతడ్ని అరెస్ట్ ‌చేశారు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి వద్ద తుపాకీ, కత్తితోపాటు కొన్ని ఏజెన్సీలకు చెందిన ఐడీ కార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ ‌రాజధాని కోల్‌కతాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. నల్లకోటు, టై ధరించిన ఒక వ్యక్తి పోలీస్‌ అని స్టిక్కర్‌ ఉన్న కారులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాళీఘాట్‌ ‌నివాసం వద్దకు చేరుకున్నాడు. గన్‌, ‌కత్తి కలిగిన అతడు భద్రతా లేన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. నిలువరించిన పోలీసులు అతడ్ని అరెస్ట్ ‌చేశారు.  ఆ వ్యక్తిని షేక్‌ ‌నూర్‌ ఆలంగా పోలీసులు గుర్తించారు.

మద్యం మత్తులో ఉన్న అతడి నుంచి గన్‌, ‌కత్తి, మత్తు పదార్థాలతోపాటు కొన్ని భద్రతా ఏజెన్సీలకు చెందిన ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, స్పెషల్‌ ‌టాస్క్ ‌ఫోర్స్ (ఎస్టీఎఫ్‌), ‌స్పెషల్‌ ‌బ్రాంచ్‌ ‌పోలీసులు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నారని కోల్‌కతా పోలీస్‌ ‌కమిషనర్‌ ‌వినీత్‌ ‌గోయల్‌ ‌తెలిపారు. ఈ సంఘటన జరిగినప్పుడు సీఎం మమతా బెనర్జీ ఆ నివాసంలో ఉన్నట్లు చెప్పారు. మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ (‌టీఎంసీ) కోల్‌కతాలో శుక్రవారం ’అమరవీరుల దినోత్సవం’ ర్యాలీ నిర్వహించ నున్నది. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ నివాసం వద్దకు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఆమె తన నివాసం నుంచి బయలుదేరాల్సి ఉంది. ఇంతలో గన్‌, ‌కత్తి కలిగిన వ్యక్తి భద్రతా లేన్‌లోకి ప్రవేశించడం కలకలం రేపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *