- అందుకే వెన్నుపోటుకు గురయ్యారు
- గుంటూరులో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు
గుంటూరు, డిసెంబర్ 24 : కీర్తి శేషులు ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఎన్టీఆర్ భోలా మనిషని అందుకే వెన్నుపోటుకు గురయ్యారని అంటూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యనాయుడు శనివారం తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడుతూ.. కుట్రలు, కుతంత్రాలు ఎన్టీఆర్ గమనించలేకపోయారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ భోలా మనిషి. అందుకే వెన్నుపోటుకు గురయ్యారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో సైలెంట్ విప్లవాన్ని తెచ్చారు.
పేదల సంక్షేమానికి అనేక పథకాలు తెచ్చారని వ్యాఖ్యానించారు. రాజకీయాలలో కొత్త ఒరవడి తెచ్చి విప్లవం సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. బలహీన వర్గాలకు రాజకీయాలలో పెద్ద పీట వేశారన్నారు. ఎన్టీఆర్ కల్మషం లేని వ్యక్తి, బోళాతనంగా ఉండేవారని తెలిపారు. అందరినీ నమ్మేవారు, అందుకే వెన్నుపోటుకు గురయ్యారని వ్యాఖ్యలు చేశారు. సిద్దాంతాలు వేరైనా పద్ధతులు పాటించే వారంటే తనకు గౌరవమని చెప్పుకొచ్చారు. ఉచితాలు అనుచితం అని… చేపలు పెట్టడం కాదు పట్టడం నేర్పాలని హితవుపలికారు.
సమాజంలో అశాంతి పెరుగుతుందని.. మనుషుల్లో అశాంతి పెరిగిందన్నారు. ఎన్టీఆర్ స్పూర్తిని నేటి తరం కొనసాగించాలని కోరారు. ఉపరాష్ట్రపతి అయ్యాక రాజకీయాలు వదిలేశానని… కానీ ప్రజలను కలవడం మాత్రం మానుకోలేదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.



