- ట్విట్టర్ వేదికగా సిఎం కెసిఆర్‌పై పిసిసి చీఫ్ రేవంత్ ఫైర్
- రైతులకు ఎకరాకు 15 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : వర్షాలతో రాష్ట్రంలో రైతుల కష్టం వరద పాలైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం అంచనా వేయాలన్న సృహ కూడా కేసీఆర్ సర్కార్‌కు లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ..దిల్లీలో కేసీఆర్ ఏ రాచకార్యాలు వెలగబెడుతున్నాడని ప్రశ్నించారు.
నష్టం అంచనాకు తక్షణం క్షేత్రస్థాయికి బృందాలను పంపాలని కేంద్రాన్ని కోరుతున్నారని, ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ దిల్లీలో ఏ చీకటి కార్యం వెలగబెడుతున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ వైపు భారీ వర్షాలకు పంటలు నీట మునిగి రైతులు నష్టపోతుంటే… కేసీఆర్ సర్కారుకు ఏమాత్రం సోయి లేదని మండిపడ్డారు.


