రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న స్కామ్
పాపాల చిట్టా బయటపడక తప్పదన్న విజయశాంతి
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఎప్పుడు ఏం జరుగగుతందో అన్న చర్చ మొదలయ్యింది. 160 సీఆర్పీసీ కింద విచారణకు సహకరించాలని అందులో పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం సీబీఐ డీఎస్పీ అలోక్ కుమార్ షహీ కవితకు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి మనీశ్ సిసోడియాతో పాటు మరో 14 మందిపై ఐపీసీ సెక్షన్ 477ఏ కేసు నమోదైందని సీబీఐ వెల్లడించింది. ఈ కేసు దర్యాప్తులో కవితకు సంబంధించి పలు అంశాలు వెలుగు లోకి వచ్చాయని తెలిపింది. తదుపరి దర్యాప్తులో సాక్ష్యాధారాలపై విచారణ అవసరంగా భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. అందువల్ల ఈ నెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు ఢిల్లీ, హైదరాబాద్‌లో ఎక్కడైనా విచారణకు హాజరుకావచ్చని అందులో పేర్కొంది. సీబీఐ నోటీసులు ఇవ్వడంపై కవిత స్పందించారు. తనకు నోటీసులు అందినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో తన నివాసంలోనే 6న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరవుతానని సమాధానం ఇచ్చినట్లు ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నోటీసులతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎప్పుడు ఏం జరుగుతందో అన్న చర్చ సాగుతోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు ఆరుగురిని కేంద్ర దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అనుచరుడు విజయ్ నాయర్, తర్వాత ఆప్ కు చెందిన అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసింది. సీబీఐ స్పెషల్ కోర్టు ముందు అమిత్ అరోరాను హాజరుపరిచిన సందర్భంలో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరును ఈడీ పేర్కొంది.
సౌత్ గ్రూప్ రూ.100 కోట్ల ముడుపులు చెల్లించిందని, సౌత్‌గ్రూప్‌ను శరత్ చంద్రారెడ్డి, కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి నియంత్రించారని తెలిపింది. సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 కోట్లను ఆప్ నేత విజయ్ నాయర్‌కు ఇచ్చినట్లు వెల్లడించింది. అమిత్ అరోరా తన స్టేట్‌మెంట్లో ఈ విషయం ధ్రువీకరించారని ఈడీ రిమాండ్ రిపోర్ట్ పేర్కొంది. కాగా, వీరిలో తెలంగాణకు చెందిన రాబిన్ డిస్టీలర్స్ లో డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్, అరబిందో ఫార్మా ఎండి శరత్ చంద్రా రెడ్డిలను దర్యాప్తు సంస్థలు ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు తిహార్ జైల్లో రిమాండ్?లో ఉన్నారు. సౌత్ గ్రూప్ లో శరత్ చంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ స్పెషల్ కోర్టులో ఈడీ వాదనలు కూడా వినిపించింది. అలాగే, బోయినపల్లి అభిషేక్ సౌత్ గ్రూప్ కు రూ.100 కోట్లను చేర్చడంలో ఉన్నట్లు గుర్తించింది. కాగా, అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు రావడంపై సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇదిలావుంటే నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, పాపాల చిట్టు బయటపడుతుందని బిజెపి నేత, మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు. చేసిన పాపాలు పండుతున్నాయనిచెప్పారు. కవిత పాత్ర ఉందా లేదా అనేది ఏజెన్సీలు నిర్ధారిస్తాయన్నారు. ఎవరనీ టార్గెట్ చేయాల్సిన అవసరం బీజేపీకి లేదని వివరించారు. ఈడీ, సీబీఐ చేసింది చాలా తక్కువ అన్న విజయశాంతి.. ఇంకా బయటకు రావాల్సింది చాలా ఉందని స్పష్టం చేశారు.
కేసీఆర్ ఎన్నికల వ్యూహం ఏమిటో త్వరలోనే చెబతామన్నారు. తప్పు చేయలేదంటున్న వారు ,ఏ చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాగా దేశవ్యాప్తంగా పెను సంచలనం కలిగించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పేరు రావడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు కలిగించింది. ఓ వైపు అరెస్ట్‌లు కొనసాగుతున్న వేళ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరో మలుపు తిరిగింది. రిమాండ్ రిపోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చింది. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితతో పాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను ఈడీ రిపోర్టులో చేర్చింది.
కవితకు స్పెషల్ ట్రీట్‌మెంట్‌లో ఆంతర్యం
ఇంటి వద్దకే సిబిఐని రమ్మంటే విచారిస్తారా
టిఆర్‌ఎస్, బిజెపి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి
మండిపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
రైతురుణమాఫీ తక్షణంచేయాలని డిమాండ్
టిఆర్‌ఎస్ నేత, కెసిఆర్ తనయ కవితకు సీబీఐ నోటీసులు అందడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటుగగా స్పందించారు. సోనియా, రాహుల్ గాంధీని సిబిఐ ఆఫీస్‌కి పిలిచి విచారించిన అధికారులు… ఎమ్మెల్సీ కవిత విషయంలో ఎందుకలా వ్యవహరించడం లేదని నిలదీశారు. బీజేపీ, టీఆర్‌ఎస్ రెండు ఒకటేనని తేలిపోయిందని చెప్పారు.. ఎమ్మెల్సీ రమణను కార్యాలయానికి పిలిచి విచారించిన అధికారులు.. ఎమ్మెల్సీ కవిత తన ఇంటికి వచ్చి వివరణ తీసుకోమని చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రమణ, కవిత ఇద్దరూ ఒకే పార్టీ అయినప్పుడు విచారణలో వ్యత్యాసం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరులకు ఒక న్యాయం, ముఖ్యమంత్రి కూతురుకి ఇంకో న్యాయమా అని ప్రశ్నించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసమే కాంగ్రెస్ పోరాటం చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రం, కేంద్రం ఇద్దరూ దొంగలేనని, ఇద్దరి మధ్య రైతులు నలిగిపోతున్నారని ఆరోపించారు. రుణమాఫీ వడ్డీ చెల్లింపుకే పోతుందన్న ఆయన… రుణ మాఫీ పథకం కాదు వడ్డీ మాఫీ పథకమని విమర్శించారు. 4 ఏళ్లు గడుస్తున్నా రూ.1లక్ష రుణ మాఫీ కాలేదని విరుచుకుపడ్డారు. కేవలం రూ.30 వేలు మాత్రమే మాఫీ చేశారని తెలిపారు.




