- సిఎం కెసిఆర్ రాజశ్యామల యాగం
- నేడు లాంచనంగా కార్యాలయాన్ని ప్రారంభించనున్న సిఎం
న్యూ దిల్లీ, డిసెంబర్ 13 : దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీలో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఈ యాగం కోసం దిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ముందుగానే ప్రత్యేక యాగశాలను నిర్మించి, ఇతర ఏర్పాట్లు చేశారు. యాగంలో పాల్గొనేంతుకు పలువురు బీఆర్ఎస్ నేతలు దిల్లీకి వొచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు 12 మంది ఋత్విక్కులు గణపతి పూజతో రాజశ్యామల యాగానికి శ్రీకారం చుట్టారు. యాగ నిర్వహణ కోసం వారు సోమవారమే దిల్లీకి చేరుకున్నారు. పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించారు. నేడు బుధవారం నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
శృంగేరిపీఠం గోపీకృష్ణశర్మ, ఫణి శశాంకశర్మ ఆధ్వర్యంలో యాగాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం రాత్రికే దిల్లీకి చేరుకున్నారు. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావం అనంతరం ఆయన దిల్లీకి రావడం ఇదే తొలిసారి. ముఖ్యమంత్రి నేడు దిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఇప్పటికే దిల్లీకి చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ మద్దతుదారులు ఈ కార్యక్రమానికి తరలివచ్చే అవకాశం ఉన్నది.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలను కూడా కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్నది. దిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా కెసిఆర్ మంగళ, బుధవారాల్లో యాగాలు, పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దిల్లీ విమానాశ్రయం నుంచి సర్దార్‌పటేల్ రోడ్డు, వసంతవిహార్, తెలంగాణభవన్, తుగ్లక్‌రోడ్డు తదితర ప్రాంతాలన్నీ గులాబీమయం అయ్యాయి. బీఆర్ఎస్ పేరుతో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు.




