దళితుడిని సిఎం చేయడమే మా పార్టీ లక్ష్యం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 :  వచ్చే ఎన్నికల్లో దళితుడిని సిఎం చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ చెప్పారు. కెసిఆర్ తెలంగాణ ఉద్యమం సమయంలో దళితుడిని సిఎంగా చేసి తెలంగాణకు కాపలా కుక్కలాగా ఉంటానని ప్రగల్భాలు పలికి తానే సిఎం అయి దళితులకు తీరని అన్యాయం దేశారని ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం హిమాయత్ నగర్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అలేరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి వల్లవి సాంబయ్య వడ్డెరకు తొలి బి-ఫారంను అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో బిఆర్ఎన్ తోపాటు బిజెపి, కాంగ్రెస్ వంటి దోపిడీ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టి సామాజిక వర్గాలకు అత్యంత ప్రమాదకరమన్నారు. తెలంగాణలో అంబేద్కర్ సమతా రాజ్యస్థాపనే ప్రధాన లక్ష్యంతో ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. సామాజిక న్యాయ సాధన కోసం రానున్న ఎన్నికల్లో డిబిపి అభ్యర్థులకు ఓటు వేసి ఆదరించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మనువాద పార్టీలను రానున్న ఎన్నికల్లో ఓడించకపోతే దళిత బహుజన జాతులకు భవిష్యత్తు లేదని, బానిసత్వం తప్పదని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరం సతీష్ కుమార్, అధికార ప్రతినిధి దేవునూరి శ్రీనివాస్, నుబ్బారావు, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *