తెలుగు సినిమా పరిశ్రమలో ‘కాస్టింగ్‌ కౌచ్‌’ సమస్య పోయిందా?

 గత సంవత్సరమే హైలెవల్‌ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఎందుకని ఇప్పటివరకూ  బయటకు రాలేదు!?

పరిశ్రమలోని హీరోలు, పెద్దవాళ్ల విషయాలయితే ఎగబడి వెళ్లి వాళ్లతో కూర్చుని వాళ్ల సినిమాలకు ప్రచారం చేసే
మంత్రులూ అధికారులు, పరిశ్రమకు పునాదిగా పనిచేసే కార్మికుల విషయంలో ఇంత తాత్సారం, నిర్లక్ష్యం ఎందుకు చేసినట్టు?  మరి ఇప్పుడు మారిన ప్రభుత్వంలో అయినా ఈ హైలెవెల్‌ కమిటీ రిపోర్ట్‌ వెలుగులోకి వస్తుందా? కమిటీ ప్రతిపాదించిన అంశాలు ఏమై వుంటాయి? ఎందుకు ఈ విషయంలో ఇంత నిశ్శబ్దం? తెలుగు సినీపరిశ్రమ తమలో పేరుకుపోయిన అహంకారపూరిత, లైంగిక జాడ్యాలను వదిలించుకుని ఇప్పటికైనా జెండర్‌ జస్టిస్‌ వైపు అడుగులు వేస్తుందా?

2018లో తెలుగు సినీ పరిశ్రమను ఒక పెద్ద కుదుపునకు గురిచేసిన కాస్టింగ్‌ కౌచ్‌ అంశం అందరికీ గుర్తుండే వుంటుంది. సినీ పరిశ్రమలో కిందిస్థాయి మహిళా, ట్రాన్స్‌ జెండర్‌ ఆర్టిస్టుల మీద జరుగుతున్న వ్యవస్థీకృత ఆర్థిక, లైంగిక దోపిడీని వివరిస్తూ మహిళా, ట్రాన్స్‌ జెండర్‌ సంఘాల ఐక్యకార్యాచరణ వేదిక తరఫున మే నెలలో ఒక ఆదివారం హైదరాబాదులోని సోమాజిగూడా ప్రెస్‌ క్లబ్బులో నిర్వహించిన పబ్లిక్‌ హియరింగ్‌ ని ప్రధాన స్రవంతి టీవీ ఛానళ్ళు అన్నీ కూడా ఐదారు గంటలపాటు లైవ్‌ టెలికాస్ట్‌ చేశాయి. ఈ అంశం ఇంత పెద్ద ఎత్తున చర్చనీయాంశం కావటానికి శ్రీరెడ్డి అనే ఆర్టిస్టు ఎంతో ధిక్కారంతో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ముందు ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న కాస్టింగ్‌ కౌచ్‌ కి నిరసనగా ‘బట్టలు విప్పటం’ అనే ఘటన ఒక విస్ఫోటనంగా మారింది. అంతకు ముందు నుంచి కూడా అడపాదడపా కొంతమంది మహిళా ఆర్టిస్టులు కాస్టింగ్‌ కౌచ్‌ తీవ్రత గురించి మీడియాలో మాట్లాడుతున్నప్పటికీ, శ్రీరెడ్డి తీసుకున్న కార్యాచరణ ప్రతి ఒక్కరినీ అవాక్కయ్యేలా చేసింది. ఫలితంగా ఈ వ్యవహారం సీరియస్‌ చర్చకు దారితీసింది. మహిళా ట్రాన్స్‌ జెండర్‌ సంఘాల ప్రతినిధులు మొదటినుంచి ఈ అంశాన్ని శ్రీరెడ్డి వ్యక్తిగత విషయంగా కాక ఒక వ్యవస్థీకృత అంశంగానే పరిగణించి సినీపరిశ్రమలో జెండర్‌ కేంద్రకంగా రావలసిన మార్పులను సూచించారు. అందులో భాగంగా సినీపరిశ్రమకు చెందిన సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వంలో అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గారికి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శికి నాలుగైదు విజ్ఞాపనలు రాతపూర్వకంగా ఇచ్చారు. నాటి మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ త్రిపురాన వెంకటరత్నంగారికి కూడా విజ్ఞాపన ఇచ్చారు. ఈ అంశం తీవ్రతను వివరిస్తూ పత్రికల్లో వ్యాసాలు రాశారు, మీడియా సమావేశాలు, సెమినార్లు నిర్వహించారు.

నెలలు గడిచినా అటు పరిశ్రమ వైపునుంచి గానీ ఇటు ప్రభుత్వపరంగా గానీ ఏ విధమైన కదలికా లేకపోవటంతో మహిళా ట్రాన్స్‌ జెండర్‌ సంఘాల జాక్‌ సభ్యులు తొమ్మిదిమంది ఉమ్మడిగా హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయవలసి వచ్చింది. ఒక సంవత్సరం సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఫిల్మ్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల కమిషనర్లతో (ఐఏఎస్‌బీ ఐపిఎస్‌), పౌరసమాజ ప్రతినిధులు, పరిశ్రమ ముఖ్యులతో కూడిన ఒక హైలెవెల్‌ కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశంతో ఒక కమిటీ ఏర్పడిరది. ఈ హైలెవెల్‌ కమిటీకి సహాయంగా పనిచేయటానికి స్వచ్ఛంద సంస్థలు, పరిశోధకులతో కూడిన ఒక సబ్‌ కమిటీ ఏర్పాటు కూడా జరిగింది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, హైకోర్టులో వాదించిన లాయర్లు గానీ, ఈ సబ్‌ కమిటీకి పనిచేసిన సభ్యులు గానీ పూర్తి స్వచ్ఛందంగా ప్రోబోనోగా పనిచేశారు. ఇంత పనిని మహిళా, ట్రాన్స్జెండర్‌ సంఘాల ఐక్యకార్యాచరణ వేదిక నిర్మాణాత్మకంగా చేస్తే తప్పించి వ్యవస్థలో ఒక కదలిక రాలేదు.

2018లో ఆర్టిస్టుల పోరాటం మొదలయితే 2022లో గానీ కమిటీ రిపోర్ట్‌ పూర్తికాలేదు. మధ్యలో రెండేళ్లు కోవిడ్‌ లాక్‌ డౌన్‌ తో అడ్డంకులు వచ్చాయి. సబ్‌ కమిటీ తయారుచేసిన రిపోర్ట్‌ పూర్తిచేసి ఇచ్చి కూడా సంవత్సరంన్నర అవుతోంది. కానీ దానిమీద ఎటువైపు నుంచి ఉలుకూపలుకూ లేదు. ఆరేళ్ళపాటు సుదీర్ఘంగా అన్ని వ్యవస్థల మెట్లు ఎక్కినా గానీ ఇప్పటివరకూ సినీపరిశ్రమలోని కాస్టింగ్‌ కౌచ్‌, ఇతరత్రా అంశాల మీద ఒక విధాన నిర్ణయాన్ని తీసుకోవడం జరగలేదు. రాతపూర్వకంగా అప్పటి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ తో పాటు ఇతర సభ్యులతో కూడిన అత్యున్నత కమిటీ ముందు పెట్టినా.. దానిని బహిర్గత పరచడానికి ఎదురయిన  సమస్యలు ఏమిటనేది ఇప్పటికీ ఒక అంతుబట్టని విషయం. పరిశ్రమలోని హీరోలు, పెద్దవాళ్ల విషయాలయితే ఎగబడి వెళ్లి వాళ్లతో కూర్చుని వాళ్ల సినిమాలకు ప్రచారం చేసే మంత్రులూ అధికారులు, పరిశ్రమకు పునాదిగా పనిచేసే కార్మికుల విషయంలో ఇంత తాత్సారం, నిర్లక్ష్యం  ఎందుకు చేసినట్టు?  మరి ఇప్పుడు మారిన ప్రభుత్వంలో అయినా ఈ హైలెవెల్‌ కమిటీ రిపోర్ట్‌ వెలుగులోకి వస్తుందా? కమిటీ ప్రతిపాదించిన అంశాలు ఏమై వుంటాయి? ఎందుకు ఈ విషయంలో ఇంత నిశ్శబ్దం?  తెలుగు సినీపరిశ్రమ తమలో పేరుకుపోయిన అహంకారపూరిత, లైంగిక జాడ్యాలను వదిలించుకుని ఇప్పటికైనా జెండర్‌ జస్టిస్‌ వైపు అడుగులు వేస్తుందా? కాస్టింగ్‌ కౌచ్‌ నియంత్రణలో భాగంగా హైలెవెల్‌ కమిటీ ఈ కింది అంశాలను ప్రధానంగా పరిశీలించాలని మొదటినుంచి మహిళా ట్రాన్స్‌ జెండర్‌ జాక్‌ డిమాండ్‌ చేస్తూ వచ్చింది.

1. వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న డ్యాన్స్‌/ యాక్టింగ్‌ స్కూళ్లను నియంత్రించాలి. ఈ సంస్థలు సంబంధిత ప్రభుత్వశాఖతో కలిసి పనిచేసే విధంగా నియమ, నిబంధనలను రూపొందించాలి. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వారికి ఈ సంస్థల నిర్వహణపై వున్న నియమ, నిబంధనల సమాచారం అందేలా చూడాలి.
2. ఔత్సాహిక కళాకారులకు ఎఫ్‌.డి.సి గుర్తింపు కార్డులను జారీచేయాలి.
3. తెలుగు సినీపరిశ్రమలోని డైలాగ్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టుల కోసం సినిమా కార్యాలయాలలో బాత్రూమ్‌లు, దుస్తులు మార్చుకునే గదులు, తాగునీటి సదుపాయం, షూటింగ్‌ సమయంలో రవాణా వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించాలి. కళాకారులకు గౌరవప్రదంగా, వివక్ష లేకుండా ఆహారం అందించాలి.
4. కళాకారులకు తాము పనిచేసిన రోజులకు నేరుగా చెల్లింపులు బ్యాంకు ద్వారా చేయాలి.
5. నిర్భయ చట్టం ప్రకారం ప్రతి కార్యాలయంలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీ వివరాలు, వాటి నియమ, నిబంధనలు అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించబడాలి. అటువంటి డిస్‌ప్లే బోర్డులపై సభ్యుల పేర్లు, సంప్రదింపు నంబర్‌లు, వారిని సంప్రదించే మార్గాలు కూడా స్పష్టంగా రాయాలి.
6. ఎంపిక, ఆడిషన్‌ ప్రక్రియలో, ప్రతి చిత్రానికి కనీసం ఒక మహిళా కాస్టింగ్‌ డైరెక్టర్‌ లేదా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఉండాలి. అలాంటి స్థానాల్లో మహిళల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. అప్పుడే అధికార దుర్వినియోగానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది.
7. అన్ని కాస్టింగ్‌ సంబంధిత కమ్యూనికేషన్‌లు అధికారికంగా కేటాయించిన వాట్సప్‌ సమూహాలు, ఇ-మెయిల్‌ సమూహాల ద్వారా మాత్రమే చేయాలి. ఇందులో ప్రొడక్షన్‌ హౌస్‌లో కాస్టింగ్‌లో పాల్గొన్న వ్యక్తులందరినీ చేర్చాలి. ఇది సమాచారమూలాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా జవాబుదారీతనం ఉంటుంది.
8. అసాంఘిక పద్ధతులతో వర్ధిల్లుతున్న సమన్వయకర్త వ్యవస్థను (కో-ఆర్డినేటర్‌ సిస్టమ్‌) వెంటనే తొలగించాలి. కళాకారులు, ప్రొడక్షన్‌ హౌస్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించే వారందరినీ గుర్తించి, జాబితా చేసి, గుర్తింపు కార్డులు జారీచేయాలి.
9. భవిష్యత్తులో మేనేజర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, సినిమాటోగ్రాఫర్‌ లేదా ఎవరైనా వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణ వచ్చిన వెంటనే వారిని ఆ స్థానం నుండి తొలగించాలి, అతను/ ఆమె సభ్యులుగా ఉన్న యూనియన్‌ లేదా అసోసియేషన్‌ నుండి సస్పెండ్‌ చేయాలి.
10. సినిమాకి పనిచేసే సిబ్బంది అన్ని వివరాలను రికార్డ్‌ చేయాలి. ప్రాజెక్ట్‌ వ్యవధిలో వారికి సంబంధిత ఐడీ కార్డ్‌లను జారీచేయాలి. దీని ద్వారా ఇతరులు అధికార దుర్వినియోగం చేయటానికి ఆస్కారం వుండదు. కళాకారులతో సంభాషించే వారికి ఇది చాలా ముఖ్యం. కొన్ని ప్రొడక్షన్‌ హౌస్‌లు ఇప్పుడు దీనిని అనుసరిస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియను ప్రతి సినిమా ప్రొడక్షన్‌ హౌస్‌ కి తప్పనిసరి చేయాలి.
11. లైంగిక వేధింపులు, వివక్ష లేదా ఆర్థిక దోపిడీకి సంబంధించిన ఫిర్యాదుల కోసం ఒక కమిటీ ఎఫ్‌.డి.సి ఆధ్వర్యంలో వుండాలి. శిక్షణ లేని కార్యదర్శులు,  గుమస్తాలు, రిసెప్షనిస్టులు బాధితులతో వ్యవహరించడానికి వీల్లేదు. శిక్షణ పొందిన కౌన్సెలర్‌లకి మాత్రమే ఈ బాధ్యత అప్పగించాలి. ఫుల్‌టైమ్‌ కౌన్సెలర్‌లను దొరకడం కష్టంగా ఉంటే, పార్ట్‌టైమ్‌ కౌన్సెలర్‌లను సఖి కేంద్రాల నుండి లేదా అటువంటి మహిళా గ్రూపుల నుండి తీసుకోవచ్చు. కౌన్సెలర్లు లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను అంతర్గత ఫిర్యాదుల కమిటీకి అందించాలి.
12. బాధితులు/ ప్రాణాలతో బయటపడినవారు మళ్లీమళ్లీ బాధపడేలా వారి సమస్యలను సానుభూతి తో పరిష్కరించాలే తప్పించి, సంచలన వార్తల కోసం ఒకటికి పదిసార్లు చెప్పించకూడదు.
ఇలా పలు ముఖ్యమైన అంశాలను హైలెవల్‌ కమిటీ దృష్టికి అప్పట్లోనే రాత పూర్వకంగానే నివేదించడం జరిగింది. ఇందులో ఎన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని తుది రిపోర్టులో పొందుపరిచారో తెలియదు. హైలెవల్‌ కమిటీ రిపోర్టు వెలుగు చూస్తేనే ఈ విషయంలో స్పష్టత వస్తుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో దీనిపై కదలిక వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ రోజు త్వరలో రావాలి..
-కె.సజయ, సామాజికవిశ్లేషకులు,
స్వతంత్ర జర్నలిస్ట్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *