- క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రతినిధి కరువు
- వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పోస్టుల రద్దుతో 40 వేల ఉద్యోగాలు కనుమరుగు
- రెండేళ్లుగా వీఆర్‌ఎలు ఉద్యమిస్తే ఎట్టకేలకు క్రమబద్దీకరణ
- తక్షణమే రైతు బంధు విడుదల చేయాలి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి
జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 27: తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్య పరిచారని రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో గురువారం జీవన్ రెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ…ప్రకృతి వైపరీత్యాల్లో క్షేత్రస్థాయి ప్రతినిధిగా పనిచేస్తూ ప్రజలకు తోడుగా నిలిచే వ్యవస్థను రద్దుపరిచి రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ వ్యవస్థ ప్రభుత్వానికి రెండు కండ్లు..చెవులాంటివని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు..వివరాల సేకరణ.. కులం, నివాస, కుటుంబ సర్టిఫికేట్, కల్యాణ లక్ష్మి పథకాలు అమలులో క్షేత్ర స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ కీలకం. ఎన్నికల నిర్వహణలో అధికారులకు గ్రామస్థాయిలో తోడుగా నిలిచేది వీఆర్‌ఓలు.. వీఆర్‌ఎలు ఈ వ్యవస్థను రద్దు పరచడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీతో పాటు, అదనంగా పోస్టులు భర్తీ చేస్తారని భావించి తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు, నిరుద్యోగులు బాటలు వేశారు.
అదనంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, కనీసం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం లేదని, ఉన్న ఉద్యోగాలను రద్దు చేసి నిరుద్యోగుల పొట్టగొడుతున్నరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 33 జిల్లాలు ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యంతో పాటు అదనంగా ఉద్యోగాలు పెరుగుతాయని భావిస్తే..కనీసం 23 ఉద్యోగాలు కూడా సృష్టించలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థుల చేరిక తగ్గిపోతుంది. రేషనలైజేషన్ నెపంతో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం లేదు. కనీసం పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం లేదు. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా.. వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో వీఆర్వో పోస్టులు 18000, వీఆర్‌ఎ పోస్టులు 22000 పోస్టులు సర్దుబాటు చేసి 40 వేల ఉద్యోగాలు కనుమరుగు చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 40 వేల ఉద్యోగాలు రద్దు చేసి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారని దుయ్యబట్టారు. తెలంగాణ ఇందుకే సాధించుకున్నమా..అని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రెవెన్యూ వ్యవస్థను బలోపేతం. చేయకుండా.. వీఆర్‌ఓ పోస్టులు రద్దు చేసి రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. రెండేళ్లుగా వీఆర్‌ఎ లు ఉద్యమించడంతో ఎట్టకేలకు ప్రభుత్వం వీఆర్‌ఎలను క్రమబద్దీకరించడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వీఆర్‌ఎ 22,000 పోస్టుల్లో వంశపారంపర్యంగా 18,000 మంది దళితులు కొనసాగుతున్నారు. రెవెన్యూ వ్యవస్థలో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు ఆర్‌ఐ లు, టైపిస్ట్ మిగిలారు. గ్రామాల్లో రెవెన్యూ ప్రతినిధి కరువయ్యారు. తహశీల్దార్‌కు రిజిస్ట్రేషన్ అప్పగించారు. ప్రకృతి వైపరిత్యాల నష్టం అంచనా వేసేందుకు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించే వారు కనుమరుగయ్యారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. గతంలో వారసత్వ చట్టం అనుగుణంగా వారసులకు భూమి అమలు ఉచితంగా చేశామని అన్నారు. నేడు ధరణితో ఎకరానికి 2500 ఫీజు వసూలు చేస్తున్నారు. ధరణితో సామాన్యులపై మరింత భారం వేస్తున్నారు. ధరణికి రైతు బంధుకు సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. ఖరీఫ్ ఆరంభించి నెల రోజులు గడుస్తున్నా.. నేటికీ పెట్టుబడి సాయం పూర్తిగా అందించలేదు.
గత నెల 26 నుండి రోజుకో ఎకరం చొప్పున రైతు బంధు ఇస్తామని చెప్పి నెల రోజులు గడుస్తున్నా ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామని జీవన్ రెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ రేషన్ కార్డు జారీ నిరంతర పక్రియ చేస్తాం. కల్యాణ లక్ష్మితో పాటు రేషన్ కార్డు జారీ చేస్తాం. ఇళ్లు లేని వారికి అర్హత ప్రాతిపదికన ఇళ్లు కేటాయిస్తాం. వీఆర్‌ఎ, వీఆర్‌ఓలను రెవెన్యూ శాఖలో తిరిగి కొనసాగించడం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి అమలు చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వొస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే రైతుబంధు విడుదల చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పిసిసి కార్యదర్శి బండ శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, రేపల్లె హరికృష్ణ, పుప్పాల అశోక్, చందా రాధాకిషన్, గుంటి• జగదీశ్వర్, జగిత్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జున్ను రాజేందర్, పిసిసి ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా, మామిడిపల్లి మహిపాల్ పాల్గొన్నారు.




