- అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న పార్టీ అధినేత చంద్రబాబు
- పార్టీ బలంగా ఉన్న చోట నేతలు విస్తృతంగా పర్యటించాలని సూచన
న్యూ దిల్లీ, ఆగస్ట్ 29 : వొచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీచేయాలని నిర్ణయించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై టిడిపి దృష్టిసారించింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఓ కమిటీని నియమించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా తెలంగాణలో పోటీ చేసే స్థానాల సంఖ్యపై స్పష్టత ఇచ్చారు. మంగళవారం ఆయన దిల్లీలో వి•డియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆలస్యం అయిందని పార్టీ బలంగా ఉన్న చోట నేతలందరూ విస్తృతంగా పర్యటించాలని సూచించారు.
ఇప్పటికే పోటీపై కమిటీ వేశామని చెప్పారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు సమయం మించిపోయిందని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఆంధప్రదేశ్‌లో సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని..పొత్తులపై పోలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇండియా కూటమికి నాయకుడు లేకపోవడం బీజేపీకి కలిసి వొచ్చే అంశమని..ఇండియా కూటమి ఎలా ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసమే తాను ఎన్డీఏ నుంచి బయటకు వొచ్చానని స్పష్టం చేశారు. రాజకీయ అనుభవం ఉన్న వారు ఎవరూ మోదీని విమర్శించడం లేదన్నారు.
ఏపీని ఎలా పునర్నిర్మించాలన్న ఆలోచనలో తాను ఉన్నట్లు తెలిపారు. బీజేపీతో అంతర్గతంగా ఏం చర్చిస్తున్నామనేది ఎవరికీ తెలియదన్నారు. తాను చూడని రాజకీయం లేదని..దేశ నిర్మాణంలో భాగం కవాలన్నది తన ఉద్దేశ్యమని తెలిపారు. అది ఎలా అనేది కాలం నిర్ణయిస్తుందన్నారు. ప్రత్యేక హోదా కోసమే ఎన్డీయే నుంచి బయటకు వొచ్చినట్లు చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా ప్రజల సెంటిమెంట్ అని అన్నారు. జగన్ ఏపీని సర్వం నాశనం చేశారని విమర్శించారు. జగన్ విధానాలవల్లే తెలంగాణకు, ఆంధ్రాకు పొంతన లేకుండా పోయిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.




