బీహార్ పర్యటనలో అభాసుపాలు
రాష్ట్రంలో పాలన చేతగాక బీహార్ వెళ్లాడన్న బిజెపి నేత లక్ష్మణ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : తెలంగాణలో చెల్లని రూపాయి బీహార్‌లో చెల్లుతుందా అని బిజెపి ఎంపి డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఇంట గెలవకుండా రచ్చ కెళ్తున్నారని లక్ష్మణ్ అన్నారు. స్థానిక సమస్యలు పరిష్కరించకుండా ముఖం చాటేస్తున్న కెసిఆర్..జాతీయ రాజకీయాలు అంటూ బయలుదేరాడని ఎద్దేవా చేశారు. మీడియా సమావేశంలో కేసీఆర్ పదిసార్లు బతిమాలినా నితీష్ కుమార్ కూర్చోలేదని తెలిపారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, కేసీఆర్‌ను పట్టించుకోలేదని.. కేసీఆర్ తెలంగాణా పరువు తీశారన్నారు. బీహార్ పర్యటనతో కేసీఆర్ అభాసు పాలయ్యారని.. తెలంగాణలో అనేక సమస్యలతో సతమతమవుతుంటే కేసీఆర్ బీహార్ పర్యటనకు వెళ్లారని.. బుధవారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు దగ్గర అవుతున్నట్లు కనిపిస్తుందన్నారు. రాహుల్ గాంధీ మీ నాయకుడా..ఎవరు మీ నాయకుడు అంటే కూర్చొని మాట్లాడుకుంటం అన్నారని..బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను పదే పదే కూర్చోమని బ్రతిమిలాడే పరిస్థితి కేసీఆర్‌కు వొచ్చిందన్నారు.
గల్వాన్ లోయలో చనిపోయిన వారికి సహాయం చేస్తే తప్పు లేదన్న లక్ష్మణ్.. తెలంగాణలో చనిపోయిన వారి పరిస్థితి ఎమిటని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ ఎందుకు ఆదుకోవడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ పట్టించు కోవడంలేదని సీరియస్ అయ్యారు. ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌కే పరిమితమైన కేసీఆర్ అదే ప్రపంచ మనుకుంటున్నారని.. ఇప్పుడు దేశ రాజకీయమంటూ కొత్త నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని..మునుగోడు భయం కేసీఆర్‌కు బాగా పట్టుకుందని లక్ష్మణ్ తెలిపారు. కూరగాయల ధరలు పెరుగుతున్నాయంటున్న సీఎం కేసీఆర్..మన రాష్ట్రానికి కూరగాయలు పక్క రాష్ట్రాల నుంచి వొస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. క్యాబేజీ కర్ణాటక నుంచి, టమాట, బెండకాయలు ఏపీ నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. బీజేపీతో టీడీపీ పొత్తు అని వొస్తున్న వార్తల్లో నిజం లేదని..తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. ఆందప్రదేశ్‌లో పవన్ కల్యాణ్‌తో కలసి పోటీ చేస్తుందని.. ఆందప్రదేశ్‌లో రోజురోజుకు బీజేపీ బలపడుతుందన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తుపై ఎలాంటి చర్చలు కూడా జరగడం లేదని లక్ష్మణ్ తెలిపారు.




